Sajjala Ramakrishna Reddy: కబ్జాల పునాదిపై సజ్జల సామ్రాజ్యం
ABN, Publish Date - Apr 26 , 2025 | 04:16 AM
కడప సీకేదిన్నెలో సజ్జల కుటుంబం అక్రమంగా 63 ఎకరాల ప్రభుత్వ భూములను తమ ఎస్టేట్‌లో కలిపేసుకున్నట్లు అధికార నివేదికలు స్పష్టం చేశాయి. అటవీ, రెవెన్యూ భూముల ఆక్రమణపై కలెక్టర్ బృందం విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.
63 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణ
రిజర్వ్ ఫారెస్టు, రెవెన్యూ భూములూ..
తేల్చిన యంత్రాంగం..ప్రభుత్వానికి నివేదిక
‘ఆంధ్రజ్యోతి’ చెప్పిందే అక్షర సత్యం
అవి రిజర్వ్ ఫారెస్టు భూములా, రెవెన్యూ భూములా అని చూడలేదు. ప్రభుత్వ భూములను కబ్జా చేసేసి, కడపలోని ‘సజ్జల’ ఎస్టేట్‌లో దర్జాగా కలిపేసుకున్నారు. 200 ఎకరాల్లో విస్తరించిన ఈ ఎస్టేట్‌లో 63 ఎకరాలు సర్కారీ భూములేనని అధికారులు తాజాగా తేల్చారు. ప్రభుత్వానికి నివేదిక అందించారు.
(కడప-ఆంధ్రజ్యోతి)
కడప శివారులోని సీకేదిన్నెలో ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ ఎస్టేట్ గురించి ‘ఆంధ్రజ్యోతి’ చెప్పిందే నిజమని తేలింది. కోట్లాది రూపాయలు విలువ చేసే 63 ఎకరాల ప్రభుత్వ భూములను ఈ ఎస్టేట్‌లో కలిపేసుకున్నారని అధికార యంత్రాంగం నిర్ధారించింది. చివరకు రెవెన్యూ, అటవీ భూములను సైతం లాగేసుకుని తమ ఎస్టేట్‌ను విస్తరించారని గుర్తించింది. మాజీ సీఎం జగన్‌కు ఇడుపులపాయ ఎలానో, సజ్జల కుటుంబానికి సీకే దిన్నె అంత...అన్నట్టు గత ప్రభుత్వంలో కబ్జాలపర్వం యథేచ్ఛగా సాగింది. సజ్జల సామ్రాజ్యాన్ని ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తెచ్చింది. ‘రిజర్వు ఫారెస్టులో సజ్జల సామ్రాజ్యం’ అనే కథనం ప్రచురించింది. వెంటనే ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. దీనికోసం కలెక్టరు చెరుకూరి శ్రీధర్ ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేశారు. రెవెన్యూ రికార్డుల్లో సజ్జల ఎస్టేట్‌లో అటవీశాఖ భూములు ఉన్నట్టు స్పష్టంగా ఉంది. అయితే అటవీ శాఖాధికారులు ఈ భూమి మాది కాదంటూ చేతులెత్తేశారు. కలెక్టరు సీరియస్‌గా తీసుకుని గట్టి ఆదేశాలు ఇచ్చారు.
ఈ మేరకు జేసీ అదితిసింగ్, అటవీశాఖ ల్యాండ్ సర్వేయర్లు పలుమార్లు క్షుణ్ణంగా పరిశీలించారు. తొలుత ప్రాథమికంగా 42 ఎకరాలు కబ్జా అయిందని భావించారు. అయితే, తుది పరిశీలనలో అది 63 ఎకరాల ప్రభుత్వ భూమిగా తేలింది. సజ్జల ఎస్టేట్‌లో ఫారెస్టుతోపాటు రెవెన్యూ భూములు కూడా ఉన్నాయి. ఇక్కడ మామిడి, నేరేడు, టేకు సాగుతోపాటు గెస్ట్‌హౌస్ నిర్మాణం చేసుకున్నారు. అధికార యంత్రాంగం సర్వే నంబర్ల వారీగా రైతులందరినీ పిలిపించి విచారించింది. ప్రభుత్వానికి తన నివేదికను అందించింది.
అసలేం జరిగిందంటే..
ప్రభుత్వానికి చేరిన నివేదికను అనుసరించి.. సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబానికి కడప, చిత్తూరు, హైదరాబాద్ జాతీయ రహదారిలోని సీకే దిన్నె మండలంలో వ్యవసాయ భూములు ఉన్నాయి. ఈ భూములన్నీ కడప నగర శివారులో ఉన్నాయి. రోడ్డు పక్కనే అయితే ఎకరం రూ.5 కోట్ల నుంచి రూ.7 కోట్లు పలుకుతోంది. కొద్దిగా దూరమైతే రూ.3 కోట్లు పైమాటే. కడపకు చెందిన కొందరు పారిశ్రామికవేత్తలు, డాక్టర్లు కడప-చిత్తూరు రహదారిలో ఫాంహౌ్‌సలు ఏర్పాటుచేసుకున్నారు. సజ్జల కుటుంబీకులకు కూడా ఇక్కడ రెవెన్యూ పొలం సర్వే నం.1599, 1600/1, 2, 1601/1, 1ఎ, 2తోపాటు మరికొన్ని సర్వే నెంబర్లలో 200 ఎకరాలకుపైగా భూములు ఉన్నాయి. ఇందులో సజ్జల సోదరుడు దివాకర్‌రెడ్డి తనయుడు సందీ్‌పరెడ్డి పేరిట 130 ఎకరాలు, కుటుంబసభ్యుల పేరుతో మిగతా భూములు సజ్జల ఎస్టేట్‌లో ఉన్నాయి. వీటిలో కొన్ని రిజిస్ర్టేషన్ అయిన భూములున్నాయి.
ఇందులో సుమారు 146 ఎకరాలు పట్టా భూమి. ఇక డీకేటీ 5.14 ఎకరాలు, చుక్కల భూమి రెండు ఎకరాల పైచిలుకు ఉన్నాయి. వీటితోపాటు పక్కన ఉన్న భూములు కూడా బలవంతంగా లాక్కుని ఎస్టేట్‌లో కలిపేసుకున్నారు. అటవీ, రెవెన్యూకు సంబంధించిన భూములను కూడా ఆక్రమించారు. సీకేదిన్నె రెవెన్యూ సర్వే నం. 1629లో అటవీ భూములు, రిజర్వు ఫారెస్టు భూములు కూడా ఉన్నాయి.
Also Read:
ఇలా నడిస్తే బోలెడు ప్రయోజనాలు..
లామినేషన్ మిషన్‌ను ఇలా వాడేశాడేంటీ...
ప్రధాని నివాసంలో కీలక సమావేశం..
For More Andhra Pradesh News and Telugu News..
Updated Date - Apr 26 , 2025 | 04:16 AM