Penalty: రూ.17.46 కోట్లు కట్టండి
ABN, Publish Date - Aug 01 , 2025 | 03:36 AM
విశాఖపట్నం భీమిలి బీచ్‌లో కోస్తా నియంత్రణ మండలి(సీఆర్‌జెడ్) నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టి పర్యావరణానికి నష్టం కలిగించినందుకు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డికి జాయింట్ కమిటీ...
విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డికి జరిమానా
బీచ్‌లో అక్రమ నిర్మాణాల వ్యవహారంలో విధింపునకు సిఫారసు
1,455 రోజులు.. రోజుకు రూ.1.2 లక్షలు చొప్పున లెక్కింపు
నిర్మాణాల కోసం తవ్విన ప్రాంతంలో పునరుద్ధరణ పనులు
అవి పూర్తయ్యే వరకూ రోజుకు 1.2 లక్షలు అదనంగా వసూలు
మూడు నెలల్లో పనులు పూర్తి చేయకుంటే జరిమానా రెట్టింపు
విశాఖపట్నం, జూలై 31(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం భీమిలి బీచ్‌లో కోస్తా నియంత్రణ మండలి(సీఆర్‌జెడ్) నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టి పర్యావరణానికి నష్టం కలిగించినందుకు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డికి జాయింట్ కమిటీ రూ.17.46 కోట్ల జరిమానా విధించింది. ఆమె నుంచి ఆ మొత్తం వసూలు చేయాలని హైకోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొంది. హైకోర్టు ఆదేశాల మేరకు కమిటీ సభ్యులు వారం క్రితం భీమిలి వచ్చి పరిశీలించారు. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల ప్రకారం పర్యావరణ నష్టాన్ని అంచనా వేశారు. గూగుల్ ఎర్త్, గత కమిటీ సర్వే నివేదిక ఆధారంగా 2021 ఆగస్టు 1న అక్కడ నిర్మాణాలు ప్రారంభమైనట్టు తేల్చారు. అప్పటి నుంచి సర్వే జరిగిన రోజు అంటే 2025 జూలై 26 వరకూ (1,455 రోజులు) పర్యావరణ నష్టాన్ని లెక్కించారు. ఈ ప్రాజెక్టు కింద 16,914 చ.మీ. విస్తీర్ణంలో పనులు చేపట్టారని, ఆ కాలుష్యం రెడ్ కేటగిరీలోకి వస్తుందని, అక్కడ పర్యావరణ నష్టం రోజుకు రూ.1.2 లక్షలుగా లెక్క తేల్చారు. ఆ మేరకు 1,455 రోజులకు రూ.17.46 కోట్లు జరిమానా విధించారు. బీచ్‌లో నిర్మాణాలను పూర్తిగా తొలగించలేదని, కూలగొట్టిన వాటి వ్యర్థాలు అక్కడే ఉన్నాయని పేర్కొన్నారు. భూమి లోపలి వరకు నిర్మించిన ప్రహరీని తొలగించాలని, డెబ్రిస్‌ను అక్కడి నుంచి తరలించాలని ఆదేశించారు. తవ్వేసిన ప్రాంతంలో మళ్లీ ఇసుక వేయాలని, ఆ ప్రాంతంలో కొబ్బరి చెట్లు పెంచాలని సూచించారు. ఈ పనులన్నీ మూడు నెలల్లో పూర్తిచేయాలని పేర్కొన్నారు. ఈ పనులు పూర్తిచేసే వరకూ రోజుకు రూ.1.2 లక్షల చొప్పున జూలై 27 నుంచి అదనంగా జరిమానా వసూలు చేయాలని పేర్కొన్నారు.
బీచ్ పునరుద్ధరణ పనులు మూడు నెలల్లోగా చేయకపోతే ముందుగా విధించిన జరిమానాకు రెట్టింపు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ పునరుద్ధరణ పనులను ఏపీ కోస్టల్ జోన్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ఏసీసీజెడ్‌ఎంఏ) పర్యవేక్షించాలని జాయింట్ కమిటీ నివేదికలో పేర్కొంది. బీచ్‌లో ప్రహరీని కింది నుంచి తొలగించాల్సి ఉందని, దానికి రూ.73.6 లక్షలు ఖర్చు అవుతుందని జీవీఎంసీ అంచనా ఇచ్చిందని, ఆ మొత్తాన్ని నేహారెడ్డి ముందుగా డిపాజిట్ చేయాలని ఆదేశించింది. బీచ్ పునరుద్ధరణ పూర్తయిన తరువాత ఏపీసీజెడ్‌ఎంఏ హైకోర్టుకు సమగ్ర నివేదికను ఇవ్వాలని కమిటీ సూచించింది.
Updated Date - Aug 01 , 2025 | 03:37 AM