రాకీ అవెన్యూస్, విశ్వ సంస్థల రహస్య బంధం!
ABN, Publish Date - Jul 06 , 2025 | 01:12 AM
చంద్రిక అయోధ్య గ్రూప్ అపార్ట్‌మెంట్స్ నిర్మించిన రాకీ అవెన్యూస్, ఈ అపార్ట్‌మెంట్స్‌ను తాము కొనుగోలు చేశామని చెప్పుకుంటున్న విశ్వ సంస్థల మధ్య రహస్య బంధం ఉన్నట్టు సమాచారం. రాకీ అవెన్యూస్ ఎండీ వేణు రామయ్య, విశ్వ సంస్థకు చెందిన వల్లభనేని వంశీ అనుచరుడు గుర్రం నాని మూడో కంటికి తెలియకుండా మంతనాలు చేస్తున్నట్టు తెలిసింది.
- చంద్రిక అయోధ్య మోసంలో కొత్త కోణం!
- అజ్ఞాతంలోని ‘రాకీ’ ఎండీ వేణు రామయ్య ‘విశ్వ’ ద్వారా వెలుగులోకి..
- ఫ్లాట్స్ రిజిస్ర్టేషన్‌కు సబ్ రిజిస్ర్టార్ కార్యాలయం వెనుక నుంచి రాక
- రిజిస్ర్టేషన్ చేశాక ఎవరికంటా పడకుండా అటునుంచి అటే..
- ఉద్దేశ్యపూర్వకంగానే కొనుగోలుదారులను మోసం చేశారా?
(ఆంధ్రజ్యోతి, విజయవాడ /గన్నవరం):
చంద్రిక అయోధ్య గ్రూప్ అపార్ట్‌మెంట్స్ నిర్మించిన రాకీ అవెన్యూస్, ఈ అపార్ట్‌మెంట్స్‌ను తాము కొనుగోలు చేశామని చెప్పుకుంటున్న విశ్వ సంస్థల మధ్య రహస్య బంధం ఉన్నట్టు సమాచారం. రాకీ అవెన్యూస్ ఎండీ వేణు రామయ్య, విశ్వ సంస్థకు చెందిన వల్లభనేని వంశీ అనుచరుడు గుర్రం నాని మూడో కంటికి తెలియకుండా మంతనాలు చేస్తున్నట్టు తెలిసింది. అరెస్టు వారెంట్ జారీ కావటంతో పారిపోయిన వేణు రామయ్య.. గుర్రం నానితో టచ్‌లో ఉన్నట్టుగా సమాచారం. అరెస్ట్ వారెంట్ తర్వాత కొందరు కొనుగోలుదారులకు ఫ్లాట్ రిజిస్ర్టేషన్స్ జరిగాయి. ఫ్లాట్స్ రిజిస్ర్టేషన్ చేసే అధికారం రాకీ అవెన్యూస్‌కు మాత్రమే ఉంది. ఎందుకంటే చట్టబద్ధంగా గుర్రం నాని సంస్థ ‘విశ్వ’కు బదిలీ జరగలేదు. దీంతో కొనుగోలుదారులకు వేణు రామయ్య గన్నవరం సబ్ రిజిస్ర్టార్ కార్యాలయానికి రహస్యంగా వచ్చి రిజిస్ర్టేషన్ చేస్తున్న వ్యవహారాలు వెలుగులోకి వచ్చాయి. సబ్ రిజిస్ర్టార్ కార్యాలయ వెనుక గేటు నుంచి లోపలికి ప్రవేశించి కొనుగోలుదారులకు రిజిస్ర్టేషన్ చేసి వెళ్లిపోతున్నట్టు ప్రత్యక్షంగా చూసిన కొనుగోలుదారులు చెబుతున్నారు. కొనుగోలుదారులను నిలువునా ముంచిన రాకీ ఎండీ వేణు రామయ్య ఆ తర్వాత వీటిని కొనుగోలుదారులకు అప్పగించే విషయంలో ‘విశ్వ’కు అధికారం కట్టబెట్టడంలో కూడా మోసం ఉందని విమర్శలు వస్తున్నాయి. కేవలం ఫ్లాట్ రిజిస్ర్టేషన్స్ సందర్భంలోనే వేణు రామయ్య అజ్ఞాతం వీడి బయటకు వస్తున్నాడు. ఫ్లాట్స్ రిజిస్ర్టేషన్ చేసిన తర్వాత వాటిని అప్పగించే విషయంలో మాత్రం తన పాత్రేమీ లేదన్నట్టుగా అజ్ఞాతంలో ఉంటున్నాడు. ఫ్లాట్స్ పొజిషన్ చూపించాల్సిన తరుణంలో విశ్వ సంస్థకు చెందిన గుర్రం నాని తెర మీదకు వస్తున్నాడు. మెయింట్‌నెన్స్ పేరుతో లక్షల రూపాయాలు చెల్లించిన వారికే ప్రవేశం కల్పిస్తున్నారు. ఆ తర్వాత ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు ఇవ్వటం లేదు. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇవ్వాల్సింది వేణు రామయ్యే. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు ఇవ్వకపోతే ఆ ఫ్లాట్స్ చట్టబద్ధం కావు.
ఎస్‌బీఐ పెద్ద అవుటపల్లి బ్రాంచిపై అనుమానాలు :
చంద్రిక అయోధ్య గ్రూప్ అపార్ట్‌మెంట్స్‌లో ఫ్లాట్స్‌ను కొనుగోలు చేసేందుకు పెద్ద అవుటపల్లిలోని ఎస్‌బీఐ బ్రాంచిలో కొందరు కొనుగోలుదారులు రుణాలు తీసుకున్నారు. ఈ రుణాలను డెవలప్‌మెంట్ సంస్థ చేపట్టే పనుల ప్రాతిపదికన ఫేజ్‌ల వారీగా చెల్లించాలి. కానీ ఒకేసారి డబ్బులు చెల్లించేయటంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇలా ఎలా చేస్తారని కొనుగోలుదారులు బ్యాంకు అధికారులను ప్రశ్నించగా.. సరైన సమాధానం రాకపోవడతో పలువురు అంబుడ్స్‌మెన్‌కు ఫిర్యాదు చేశారు. రాకీ అవెన్యూస్, విశ్వ సంస్థల మధ్య రెరా చట్టం మేరకు చట్టబద్ధమైన బదలాయింపు జరగకుండా, బ్యాంకు అధికారులు విశ్వ సంస్థను ప్రస్తుతం మేనేజ్‌మెంట్‌గా ఎలా గుర్తించిందన్నది ప్రశ్నగా ఉంది.
నిబంధనల ఉల్లంఘన
ఫ్లాట్స్ కట్టే సమయంలోనే కొనుగోలుదారుల నుంచి మొత్తం డబ్బులు, ఆ తర్వాత మంచినీరు, ఇతర సదుపాయాలు, ఫైర్ సేఫ్టీకి మళ్లీ నగదు వసూలు చేశారు. కానీ ఏ ఒక్క సౌకర్యం కల్పించలేదు. మొత్తం 670 ఫ్లాట్స్‌తో కూడిన గ్రూప్ అపార్ట్‌మెంట్స్‌కు ఇప్పటి వరకు ఫైర్ అనుమతులు కూడా రాలేదు. దరఖాస్తు చేశారో లేదో కూడా తెలియదు. గన్నవరంలోని కోనాయిచెరువు నుంచి మంచినీటిని అందించేందుకు పైపులైన్లు అయితే వేశారు. కానీ పంచాయితీకి డబ్బులు చెల్లించకపోవటంతో వాటర్ కనెక్షన్‌ను కట్ చేసినట్టు తెలుస్తోంది. కొనుగోలుదారులకు రిజిస్ర్టేషన్ చేసిన ఫ్లాట్‌లో ఇంకా పూర్తి చేయాల్సినవి అనేకం ఉన్నాయి.
Updated Date - Jul 06 , 2025 | 01:12 AM