Govt Building Decision: రుషికొండపై నాన్చుడే
ABN, Publish Date - Jul 06 , 2025 | 02:52 AM
విశాఖలో రుషికొండపై సముద్రానికి అభిముఖంగా గత ముఖ్యమంత్రి జగన్ నిర్మించిన ప్యాలస్‌ను ఏం చేయాలనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయమూ తీసుకోలేకపోతోంది. పర్యాటక శాఖకు చెందిన హరిత రిసార్ట్స్‌ను...
ప్యాలెస్ వినియోగంపై సర్కారు తర్జనభర్జన
రూ.452 కోట్లతో భవనాలు కట్టిన జగన్
అవి ఎటూకాకుండా ఉండడంతో సమస్య
ఎంబసీలకు ఇవ్వాలని, కన్వెన్షన్‌గా వాడాలని,
గెస్ట్‌హౌ్‌సలుగా ఉపయోగించాలని సూచనలు
అన్నింటినీ పరిశీలిస్తున్నామన్న ప్రభుత్వం
కానీ, ఏడాదైనా ముందుకు పడని అడుగు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
విశాఖలో రుషికొండపై సముద్రానికి అభిముఖంగా గత ముఖ్యమంత్రి జగన్ నిర్మించిన ప్యాలె్‌సను ఏం చేయాలనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయమూ తీసుకోలేకపోతోంది. పర్యాటక శాఖకు చెందిన హరిత రిసార్ట్స్‌ను కూలగొట్టి గత ప్రభుత్వం 9.8 ఎకరాల్లో రూ.452 కోట్లతో రాజభవనం నిర్మించింది. పర్యాటకుల కోసం నిర్మిస్తున్నామని చివరి వరకు మాయమాటలు చెప్పి ఎన్నికలు ఇంకో రెండు నెలల్లో ఉన్నాయనగా (2024 ఫిబ్రవరి 29న) ... దానిని సీఎం క్యాంపు కార్యాలయంగా ఉపయోగిస్తామని అప్పటి పర్యాటక శాఖ మంత్రి రోజా ప్రకటించారు. ఎంతో ముచ్చటపడి నిర్మించుకున్న ఆ భవనంలోకి అడుగు పెట్టకుండానే జగన్ అధికారం కోల్పోయారు. అప్పటివరకూ ఎవరినీ ఆ భవనం వైపు కన్నెత్తి కూడా చూడనీయలేదు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్ రెండుసార్లు రుషికొండ వెళ్లి వెనక్కి వచ్చేశారు. సీపీఐ సీనియర్ నేత నారాయణ కోర్టు ఉత్తర్వులతో లోపలకు వెళ్లి చూడగలిగారు. కూటమి విజయం సాధించాక భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మీడియాతో వెళ్లి ఆ భవనం చూశారు. ఆ తరువాత సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ భవనాన్ని పరిశీలించారు.
ఏమి చేయాలో అర్థం కావడం లేదు
రుషికొండపై 4.5 ఎకరాలలో 1,48,413 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణాలు చేపట్టారు. అందులో 2.8 ఎకరాల్లో మూడు భవనాలను జగన్, ఆయన ఇద్దరు కుమార్తెలకు వేర్వేరుగా నిర్మించారు. ఆ బ్లాకు లోపలకు ఎవరూ వెళ్లకుండా పెద్ద గేటు ఏర్పాటు చేశారు. మిగిలిన భవనాలన్నీ పెద్ద పెద్ద సమావేశ మందిరాలుగా నిర్మించారు. ఎక్కడా గదులు లేవు. వాటిని ఎలా ఉపయోగించుకోవాలనే దానిపై అభిప్రాయాలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది. కొంతమంది రాయబార కార్యాలయాలకు ఇవ్వాలని, ఐటీ సంస్థలు పెట్టాలని, పెద్ద పెద్ద సంస్థలకు కన్వెన్షన్ సెంటర్‌కు ఇవ్వాలని సూచించారు. అయితే ఎవరు దానిని వినియోగించుకోవాలన్నా లోపల కొన్ని మార్పులు చేస్తే తప్ప వీలు కాదు. అలా పనులు చేపట్టాలంటే వాటికి రూ.50 కోట్ల నుంచి రూ.60 కోట్ల వరకు వెచ్చించాల్సి ఉంటుందని చెబుతున్నారు.
సీఎంవోలో అధికారికి బాధ్యతలు
ముఖ్యమంత్రి కార్యాలయంలో ఓ ఐఏఎస్ అధికారిని రుషికొండ ప్యాలెస్ భవనం ఏం చేస్తే బాగుంటుందో నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్టు సమాచారం. అయితే ఆ అధికారి కూడా ఇప్పటివరకూ భవనాన్ని సందర్శించలేదు. ప్రజలను సందర్శనార్థం అనుమతించి, జగన్ ప్రభుత్వం నిధులను ఎలా దుర్వినియోగం చేసిందో వివరించాలని కొందరు ప్రభుత్వ పెద్దలకు సలహా ఇచ్చారు. ఆ ఆలోచనను కూడా పరిశీలిస్తున్నట్టు సీఎం చంద్రబాబు ఇటీవల విశాఖకు వచ్చినప్పుడు ప్రకటించారు. అయితే దానిపై కూడా నిర్ణయం తీసుకోలేదు. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ రెండురోజులక్రితం రుషికొండ బ్లూ ఫ్లాగ్ బీచ్‌ను సందర్శించారు. విశాఖకు వచ్చే పర్యాటకులకు ఆ భవనాన్ని చూపించే ఆలోచన ఉందని ఆయన ప్రకటించారు. జగన్ తప్పు చేశారనే భావనతో దానిని అందరికీ చూపించాలని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. కానీ అది చూసి...‘ఎంత పెద్ద భవనం నిర్మించాడో...జగన్!!’ అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యే అవకాశం లేకపోలేని కొందరు అంటున్నారు. కాబట్టి అలాంటి ప్రయత్నం చేయకుండా ఉండడమే మంచిదని అభిప్రాయపడుతున్నారు. విశాఖలో భారీ సమావేశాలు జరుగుతున్నాయి. భవిష్యత్తులో ఇంకా అనేకం జరుగుతాయి. అటువంటి వాటిని స్టార్ హోటళ్లలో నిర్వహించి, కోట్ల రూపాయల బిల్లులు చెల్లించడం కంటే ఈ భవనాన్ని ఉపయోగించుకుంటే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అతిథి గృహాలుగా వాడుకుంటే బాగుంటుందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఏదేమైనా నాన్చడం మాని, వీలైంతత్వరగా వాటిని సద్వినియోగం చేసుకోవలసి ఉంది.
Updated Date - Jul 06 , 2025 | 02:54 AM