రెవెన్యూ బరితెగింపు!
ABN, Publish Date - Jul 30 , 2025 | 01:33 AM
గ్రామాల్లో పరిశ్రమలను నెలకొల్పి ఉద్యోగాల సృష్టి జరపాలని ఒకవైపు ప్రభుత్వం కృషి చేస్తుంటే మరోవైపు అవినీతి రుచి మరిగిన రెవెన్యూ అధికారులు ప్రభుత్వ ఉద్దేశానికి మకిలి పట్టిస్తున్నారు. బరి తెగించి మరీ లంచాలు డిమాండ్ చేస్తున్నారు. పారామౌంట్ కంపెనీ పెనుగంచిప్రోలు మండలంలో భూములు కొనుగోలు చేసి పరిశ్రమ విస్తరణలో భాగంగా ల్యాండ్ కన్వర్షన్‌కు దరఖాస్తు చేసుకుంటే పైసలిస్తేనే ఫైల్ ముందుకు కదులుతుందని బీష్మించుకుర్చున్నారు. స్థానిక ఎమ్మెల్యే మందలించినా తీరు మార్చుకోకపోవడంతో విసిగిపోయిన కంపెనీ యాజమాన్యం విస్తరణ పనులను వాయిదా వేసుకుంది. దీంతో రెవెన్యూ అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
- పారామౌంట్ కంపెనీకి చుక్కలు చూపిస్తున్న తహసీల్దార్ కార్యాలయం
- పెనుగంచిప్రోలులో పరిశ్రమ విస్తరణకు 8 ఎకరాలు కొనుగోలు
- ల్యాండ్ కన్వర్షన్ కోసం దరఖాస్తు.. రూ.లక్షల్లో లంచం డిమాండ్
- జగ్గయ్యపేట ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసిన యాజమాన్యం
- రెవెన్యూ అధికారులను మందలించిన శ్రీరాం తాతయ్య
- అయినా సరే లంచం ఇవ్వాల్సిందేనంటూ రెవెన్యూ అధికారుల పట్టు
- తాత్కాలికంగా యూనిట్ విస్తరణ నిలుపుదల చేసిన యాజమాన్యం
గ్రామాల్లో పరిశ్రమలను నెలకొల్పి ఉద్యోగాల సృష్టి జరపాలని ఒకవైపు ప్రభుత్వం కృషి చేస్తుంటే మరోవైపు అవినీతి రుచి మరిగిన రెవెన్యూ అధికారులు ప్రభుత్వ ఉద్దేశానికి మకిలి పట్టిస్తున్నారు. బరి తెగించి మరీ లంచాలు డిమాండ్ చేస్తున్నారు. పారామౌంట్ కంపెనీ పెనుగంచిప్రోలు మండలంలో భూములు కొనుగోలు చేసి పరిశ్రమ విస్తరణలో భాగంగా ల్యాండ్ కన్వర్షన్‌కు దరఖాస్తు చేసుకుంటే పైసలిస్తేనే ఫైల్ ముందుకు కదులుతుందని బీష్మించుకుర్చున్నారు. స్థానిక ఎమ్మెల్యే మందలించినా తీరు మార్చుకోకపోవడంతో విసిగిపోయిన కంపెనీ యాజమాన్యం విస్తరణ పనులను వాయిదా వేసుకుంది. దీంతో రెవెన్యూ అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
(ఆంధ్రజ్యోతి, విజయవాడ):
ఉమ్మడి కృష్ణాజిల్లాలో పారిశ్రామికంగా పురోగమిస్తున్న జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు, బాపులపాడు మండలాల్లో పారామౌంట్ ఇండస్ర్టీ యాజమాన్యం పలు యూనిట్లను ఏర్పాటు చేసింది. పెనుగంచిప్రోలు మండలంలో పరిశ్రమను విస్తరించటానికి గాను ఇటీవల ఎనిమిది ఎకరాల భూములను కొనుగోలు చేసింది. ల్యాండ్ కన్వర్షన్ కోసం దరఖాస్తు చేసుకుంటే స్థానిక రెవెన్యూ అధికారి ఒకరు పారిశ్రామిక సంస్థ నుంచి లంచం డిమాండ్ చేయటం సంచలనం సృష్టిస్తోంది. ఈ పంచాయితీ జగ్గయ్యపేట ఎమ్మెల్యేకు చేరింది. రెవెన్యూ అధికారికి ఎమ్మెల్యే ఫోన్ చేసి మందలించారు. అయినా కూడా ఆ రెవెన్యూ అధికారి తాను తగ్గేది లేదని లంచం ఇవ్వాల్సిందేనని పట్టుబట్టడంతో ల్యాండ్ కన్వర్షన్ ఫైల్ పెండింగ్‌లో ఉంది.
కలెక్టర్ దిశానిర్దేశం చేసినా మారని తీరు!
ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో పరిశ్రమల ప్రోత్సాహకానికి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ ఓ వైపు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవలే పరిశ్రమలశాఖతో పాటు అన్ని శాఖల అధికారులతో ఆయన సమీక్ష చేశారు. పరిశ్రమలకు అనుమతుల విషయంలో అన్ని శాఖలు సమన్వయం చేసుకుని త్వరితగతిన ఇవ్వాలని నిర్దేశించారు. ఇది జరిగి కొద్ది రోజులే అయినా రెవెన్యూ అధికారులలో మార్పు కనిపించటం లేదు. అవినీతి వాసనలను వదులుకోని రెవెన్యూ అధికారులు ల్యాండ్ కన్వర్షన్ల విషయంలో పారిశ్రామికవేత్తలను ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీరు తాగిస్తున్నారు. ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లినా ఎవ్వరికైనా చెప్పుకోండి మా రేటు ఇంతే అనే ధోరణితో వ్యవహరిస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో రూ.1000 కోట్లలో పరిశ్రమలు
పారామౌంట్ సంస్థ ఉమ్మడి జిల్లాలో దాదాపుగా రూ.1000 కోట్ల వ్యయంతో పరిశ్రమలను స్థాపించింది. ఈ సంస్థ ఐరన్ గడ్డర్లు, బ్యారికేడ్లు, ఐరన్ షీట్స్ వంటి ఉత్పత్తులను తయారు చేస్తుంది. ప్రస్తుతం ఐరన్ స్ట్రక్చర్‌తో భవనాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి భవనాలకు అవసరమైన సామగ్రిని ఈ సంస్థ అందిస్తుంది. పెనుగంచిప్రోలులో పరిశ్రమ విస్తరణ కోసం ఇటీవల ఎనిమిది ఎకరాలను ఆ సంస్థ కొనుగోలు చేసింది. ఆ భూమిలో పెయింటింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. పెయింటింగ్ యూనిట్ స్థానికంగా లేకపోవటం వల్ల వీటిని బయట ప్రాంతానికి తీసుకువెళ్లి పెయింటింగ్ చేయిస్తున్నారు. స్థానికంగానే పెయింటింగ్ యూనిట్ ఏర్పాటు ద్వారా బయటకు తీసుకు వెళ్లే బాధ తప్పుతుందని పారామౌంట్ యాజమాన్యం భావించింది. ఈ పెయింటింగ్ యూనిట్ ద్వారా స్థానికంగా చాలా మందికి ఉద్యోగావకాశాలు కూడా వస్తాయి. ప్రభుత్వానికి ఆదాయం కూడా లభిస్తుంది. కొనుగోలు చేసిన భూమి సక్రమమే. నిబంధనలకు అనుగుణంగానే ఆ భూములకు రిజిస్ర్టేషన్ జరిగింది. నిబంధనల మేరకు యూనిట్ కడుతున్నారు కాబట్టి ల్యాండ్ కన్వర్షన్ కోసం దరఖాస్తు చేసుకుంటే .. లంచం ఎందుకు కట్టాలో అర్థం కాక ఈ అంశాన్ని పారామౌంట్ యాజమాన్యం తల పట్టుకుంది. స్థానిక ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య దృష్టికి తీసుకువెళ్లింది. జరిగిన వ్యవహారాన్ని పరిశీలించిన తర్వాత రెవెన్యూ అధికారులను ఎమ్మెల్యే తాతయ్య మందలించారు. తర్వాత వెళ్లి రెవెన్యూ అధికారులను కలవమని చెప్పి పంపారు. తీరా రెవెన్యూ అఽధికారుల దగ్గరకు వెళితే .. డబ్బులు చెల్లించాల్సిందేనని డిమాండ్ చేయటంతో బిత్తరపోయారు. దీంతో పారామౌంట్ యాజమాన్యం తాత్కాలికంగా పెయింటింగ్ యూనిట్ విస్తరణ పనులకు బ్రేక్ వేసింది.
పీ4లో ప్రభుత్వానికి బాసటగా నిలిచిన సంస్థకు ఇబ్బందులు
ఎన్టీఆర్ జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు క్షేత్ర స్థాయిలో పీ4 తొలి సభను నిర్వహించారు. ఈ సందర్భంగా బంగారు కుటుంబాలను ఆదుకునేందుకు పారామౌంట్ యాజమాన్యం ఎంతో పెద్ద మనసు చూపింది. ఇప్పటి వరకు ఏ పారిశ్రామిక సంస్థ కూడా చేయని విధంగా మొత్తం 27 బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవటం జరిగింది. ఆర్థికంగా, విద్యా, వైద్య పరంగా ఆ కుటుంబాల బాధ్యతలను తీసుకున్న పారామౌంట్ యాజమాన్యాన్ని చంద్రబాబు అభినందించారు.
వందలాది మందికి ఉపాధి కల్పించిన సంస్థకు చుక్కలు
పారామౌంట్‌కు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట ఇండస్ర్టియల్ ఎస్టేట్‌లో రెండు యూనిట్లు ఉన్నాయి. పెనుగంచిప్రోలు మండలంలో జాతీయ రహదారి పక్కనే యూనిట్ ఉంది. కృష్ణాజిల్లా మల్లవల్లిలో కూడా ఈ కంపెనీకి సంబంధించిన యూనిట్ ఉంది. అన్ని యూనిట్లు కూడా ఐరన్ ఫ్రేమింగ్స్ సంబంధించినవే ఉన్నాయి. ఈ మూడు ప్రాంతాల్లో కూడా వందల మందికి ఈ సంస్థ ఉపాధి అవకాశాలను కల్పిస్తోంది. అలాంటి సంస్థకు ల్యాండ్ కన్వర్షన్‌కు దరఖాస్తు చేసుకుంటే .. లంచాలు డిమాండ్ చేయటం గమనార్హం.
Updated Date - Jul 30 , 2025 | 01:33 AM