ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సాగుకు సన్నద్ధం!

ABN, Publish Date - Jun 18 , 2025 | 01:26 AM

మండలాల్లో ఇప్పటికే నారుమడులు పోశారు. దిగువ ప్రాంతంలో మాత్రం భూములు అదనుకు రాలేదని వేచిచూస్తున్నారు. సమృద్ధిగా వర్షాలు కురిస్తేనే సాగుకు వాతావరణం అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. శివారు ప్రాంతాలకు ఈ నెల 23 తర్వాతే పూర్తిస్థాయిలో కాలువలకు నీటిని విడుదల చేయాలని యోచిస్తున్నారు.

-ఎగువ ప్రాంతంలో నారుమడుల సందడి

-దిగువ ప్రాంతంలో అదనుకు రాని భూములు

-మరిన్ని వర్షాలతోనే వాతావరణం అనుకూలమంటున్న రైతులు

- శివారు ప్రాంతాలకు ఈ నెల 23 తర్వాతే సాగునీటి విడుదల!

ఖరీప్‌ సాగుకు రైతన్నలు సిద్ధమవుతున్నారు. ఎగువ ప్రాంతంలోని గన్నవరం, పెనమలూరు, పామర్రు నియోజకవర్గాల్లోని పలు మండలాల్లో ఇప్పటికే నారుమడులు పోశారు. దిగువ ప్రాంతంలో మాత్రం భూములు అదనుకు రాలేదని వేచిచూస్తున్నారు. సమృద్ధిగా వర్షాలు కురిస్తేనే సాగుకు వాతావరణం అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. శివారు ప్రాంతాలకు ఈ నెల 23 తర్వాతే పూర్తిస్థాయిలో కాలువలకు నీటిని విడుదల చేయాలని యోచిస్తున్నారు.

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం :

కృష్ణాడెల్టాకు ఈ నెల 15వ తేదీన సాగు నీటిని విడుదల చేశారు. అయితే జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో నారు మడులు పోసేందుకు రైతులు పూర్తిస్థాయిలో ఆసక్తి చూపడం లేదు. శివారు ప్రాంతాల్లో చౌడు భూములు అధికంగా ఉన్నాయి. నారు మడులు పోసిన తర్వాత ఎండలు వేస్తే ఎదుగుదల లోపిస్తుందని ముందుకు రావడం లేదు. వాతావరణం చల్లబడిన తర్వాత సాగునీటిని విడుదల చేస్తే మేలని రైతులు సూచనప్రాయంగా చెబుతున్నారు. ప్రస్తుతం ప్రధాన కాలువలకు అవసరాల మేరకే ప్రకాశం బ్యారేజీ నుంచి సాగు నీటిని విడుదల చేస్తున్నారు. రైవస్‌ కాలువ, బందరు కాలువ, కేఈబీ కాలువ, రామరాజుపాలెం కాలువల ద్వారా శివారు ప్రాంతాలకు సాగునీరు అందాల్సి ఉంది. వాతావరణంలో మార్పులు ఏర్పడి వ్యవసాయానికి అనుకూలంగా మారిన తర్వాతే.. అనగా ఈ నెల 23వ తేదీ దాటాక ఈ కాలువలకు సాగు నీటిని పూర్తిస్థాయిలో విడుదల చేస్తామని నీటిపారుదలశాఖ అధికారులు చెబుతున్నారు.

పంట కాలువల్లో రసాయనాల పిచికారీ

పంట కాలువల్లో పెరిన గుర్రపు డెక్క, నాచు, తదితరాలను నిర్మూలించేందుకు రసాయనాలు పిచికారీ పనులు ప్రస్తుతం జిల్లాలో జరుగుతున్నాయి. మరో మూడు, నాలుగు రోజుల పాటు ఈ పనులు చేసేందుకు సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. కాలువలకు సాగు నీటిని విడుదల చేసేందుకు అవకాశం ఉన్నా వీటి వల్ల విడుదల చేయడం లేదని అధికారులు పేర్కొంటున్నారు. కంకిపాడు, పామర్రు, నిడుమోలు ప్రాంత రైతులు నారు మడులు పోసుకునేందుకు సరిపడినంతగా కాలువలకు నీటిని విడుదల చేస్తున్నామని అంటున్నారు. బందరు కాలువలకు అనుబంధంగా ఉన్న మల్లవోలు, గుండుపాలెం, రుద్రవరం తదితర ప్రాంతాలకు సాగునీటి సరఫరా చేసే కాలువ గట్లు బలహీనంగా ఉన్న చోట్ల మట్టి పనులు చేస్తున్నామని, వీటిని త్వరగా పూర్తి చేస్తామని నీటి పారుదలశాఖ అధికారులు చెబుతున్నారు. కానీ ఈ ప్రాంతంలోని డ్రెయిన్లలో పెరిగిన గుర్రపు డెక్క, నాచు తదితరాల నిర్మూలనకు రసాయనాలు పిచికారీ ఇంకా చేపట్టలేదు.

పెరిగిన భూగర్భ జలాలు

పంట కాలువలకు ఎగువన ఉన్న కంకిపాడు, పెనమలూరు, గన్నవరం, పమిడిముక్కల, ఉయ్యూరు, మొవ్వ, తోట్లవల్లూరు తదితర మండలాల్లో బోరు నీటి ఆధారంగా రైతులు నారుమడులు పోశారు. కొందరు రైతులు వెదజల్లే పద్ధతిన సాగు చేశారు. మొక్క దశలో ఉన్న వరిపైరును కాపాడేందుకు బోరు నీటిని వాడుకుంటున్నారు. వేసవిలో ఊహించని విధంగా వర్షాలు కురవడంతో భూగర్భ జలాల నీటిమట్టం ఐదడుగుల మేర పెరిగిందని, గతంలో 40 అడుగుల లోతులో ఉన్న నీరు ప్రస్తుతం 35 అడుగులకు చేరిందని, దీంతో బోర్ల ద్వారా నీటిధార పూర్తిస్థాయిలో వస్తోందని కంకిపాడు, ఉయ్యూరు మండలాల రైతులు చెబుతున్నారు. కంకిపాడు మండలంలోని అధిక గ్రామాలకు సాగు నీటిని సరఫరా చేసే రైవస్‌ కాలువకు ఇంకా సాగు నీటిని విడుదల చేయకున్నా బోరునీటి ఆధారంగా నారుమడులు పోయడంతో పాటు, వెదజల్లే పద్ధతిలో సాగు చేపట్టారు. ఈ ఏడాది ఎంటీయూ 1061, 1318, 1224, 1262, బీపీటీ-5204, స్వర్ణ తదితర రకాల వరి వంగడాలతో పాటు ఎంటీయూ 2077, 5293, పీఎల్‌ఏ 1100 (బాలామసూరి)వంటి పాతరకాల వరి వంగడాలను రైతులు ఈ ఏడాది సాగుచేసే యోచనలో ఉన్నారు. ఇప్పటికే 550 ఎకరాలకుపైగా నారుమడులు పోశారు. ఈ ఏడాది మేలో భారీ వర్షాలు కురవడంతో పూర్తిస్థాయిలో నేల ఆరలేదని, దీంతో వరిపైరుకు తెగుళ్లబెడద అధికంగా ఉండే ప్రమాదం ఉంటుందని రైతులు అభిప్రాయపడుతున్నారు. నేల పూర్తిస్థాయిలో ఆరితే వేసవి దుక్కుల తర్వాత నేలగుల్ల బారేదని, ఈ ఏడాది ఈ స్థితి లేకుండా పోయిందని అంటున్నారు.

వాతావరణం అనుకూలించేనా!

ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమైన తర్వాత ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. రుతుపవనాలు వచ్చినట్లే వచ్చి ముఖం చాటేశాయి. వాతావరణం వ్యవసాయానికి అనుకూలంగా మారలేదు. దీంతో శివారు ప్రాంత రైతులు నారుమడులు పోసేందుకు, వెదజల్లే పద్ధతిన సాగు చేసేందుకు ముందుకు రావడం లేదు. ఈ నెలాఖరు నాటికి వాతావరణం అనుకూలంగా మారితే ఇప్పటికే నారు మడులు పోసిన ప్రాంతాల్లో జూలై మొదటి వారంలో వరినాట్లు ప్రారంభమవుతాయని, కాలువ శివారు ప్రాంతాల్లో ఈ నెలాఖరునాటికి నారుమడులు పోయడం ప్రారంభమవుతుందని రైతులు అంటున్నారు.

Updated Date - Jun 18 , 2025 | 01:26 AM