నాణ్యతా ప్రమాణాలు ‘తుంగ’ పాలు
ABN, Publish Date - Jun 04 , 2025 | 12:31 AM
కరువు.. వలసలతో నిత్యం తల్లడిల్లే పశ్చిమ ప్రాంతం పల్లెసీమల జీవనాడి తుంగభద్ర దిగువ కాలువ సీసీ లైనింగ్ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు తుంగలో కలిపేస్తున్నారు.
ఫేజ్-2 కింద రూ.300 కోట్లతో ఎల్లెల్సీ కాలువ లైనింగ్
ఆధునికీకరణ పనుల్లో నిబంధనలకు తూట్లు
బలహీనంగా మారిన కాలువ గట్లు
చక్రం తిప్పుతున్న నాటి కాంట్రాక్టర్
చోద్యం చూస్తున్న టీబీపీ బోర్డు ఇంజనీర్లు
నాటి పనులకు కూటమి ప్రభుత్వంలో బిల్లుల చెల్లింపు
కరువు.. వలసలతో నిత్యం తల్లడిల్లే పశ్చిమ ప్రాంతం పల్లెసీమల జీవనాడి తుంగభద్ర దిగువ కాలువ సీసీ లైనింగ్ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు తుంగలో కలిపేస్తున్నారు. నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. పది కాలాల పాటు అన్నదాతల సేవల్లో తరిం చాల్సిన ఆధునికీకరణ పనులు రాజకీయ జోక్యంతో ప్రమాణాలు పరిహాసం అవుతు న్నాయి. వైసీపీ హయాంలో 2022-24మధ్య జరిగిన లైనింగ్ పనుల్లో బళ్లారిలో స్థిరప డిన వైసీపీ ముఖ్యనాయకులకు సన్నిహితుడైన ఓకాంట్రాక్టర్ పెత్తనం సాగింది. కూటమి ప్రభుత్వం వచ్చినా ఆ కాంట్రాక్టరు హవా నడుస్తుందన్న ఆరోపణులున్నాయి. క్షేత్రస్థాయిలో నాణ్యతా ప్రమాణాలు పర్యవేక్షించాల్సిన టీబీపీ బోర్డు ఇంజనీర్లు కొం దరు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. సీసీ లైనింగ్.. ఛీచీ లైనింగ్‌గా మారిందనే ఆరోపణులు లేకపోలేదు. ఫేజ్-2 కింద రూ.300కోట్లలో చేపట్టిన ఎల్లెల్సీ లైనింగ్ పనుల తీరుపై ‘ఆంధ్రజ్యోతి’ క్షేత్రస్థాయి కథనం.
కర్నూలు, జూన 3 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో తుంగభద్ర దిగువ కాలువ (ఎల్లెల్సీ)కు తుంగభద్ర డ్యాం నుంచి 24 టీఎంసీల వాటా ఉంది, ఎమ్మిగనూరు, ఆలూరు, ఆదోని, మంత్రాలయం, కోడుమూరు నియోజకవర్గాల్లో ఖరీఫ్, రబీలో 1,51,413 ఎకరాలకు సాగునీరు, ఆదోని, ఎమ్మిగనూరు మున్సిపల్ పట్టణాలతో పాటు 195 గ్రామాలకు తాగునీరు అందాల్సి ఉంది. 0/0 నుంచి 241కిలోమీటర్ల వరకు టీబీపీ బోర్డు పర్య వేక్షణలో ఉంది. 70ఏళ్ల క్రితం నిర్మించిన ఎల్లెల్సీ కాలువ గట్లు పలుచోట్ల బలహీనంగా మారడం, పూడికతో నిండిపోవడంతో వాటాజలాలు అందని ద్రాక్షగా మారింది. 2022 లో సీసీ లైనింగ్‌కు టీబీపీ బోర్డు శ్రీకారం చుట్టింది. ఫేజ్-1కింద రూ.519.80 కోట్లతో ఆధునికీకరణ పనులు 11ప్యాకేజీలుగా విభిజించి చేపట్టారు. బడ్జెట్ కేటాయింపులు లేకున్నా అప్పటి వైసీపీ ముఖ్యనాయకులు ప్రోద్బలంతో పనులు చేపట్టడమే కాకుండా టెండర్లల్లోనే అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణులు వెల్లువెత్తాయి. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. బోర్డు క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్లు నామమాత్రపు తనిఖీలతో సరిపుచ్చి.. మాముళ్లు పుచ్చుకొని అంతా బాగుందని సర్టిఫికెట్ ఇచ్చినట్లు తెలుస్తుంది. వైసీపీ హయాంలో పనులు చేసినా.. కూటమి ప్రభుత్వం వచ్చాక దాదాపు రూ.275కోట్లు బిల్లులు చెల్లించారు. 2023 జనవరిలో రెండోవిడత కింద ఎల్లెల్సీ కాలువ205కి.మీలు నుంచి 250 కిలోమీటర్లు వరకు రూ.300 కోట్లు, హెచ్చెల్సీ పరిధిలో రూ.100కోట్లు కలిపి రూ.400కోట్లతో ఆర్‌సీసీ లైనింగ్ పనులు 13 ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలిచారు. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు వైసీపీ హయాంలో బిల్లులు రావని మొదలు పెట్టలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక వీటిని రద్దు చేసి తిరిగి టెండర్లు నిర్వహించాలని బళ్లారికి చెందిన ఓ కాంట్రాక్టర్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. నాటి వైసీపీ హయాంలో చక్రం తిప్పిన వైసీపీ రంగు పూసుకున్న కాంట్రాక్టరే.. కూటమి ప్రభుత్వంలో కూడా చక్రంతిప్పి పనులు రద్దు కాకుండా చేశారనే ఆరోపణులు ఉన్నాయి. ఆపనుల్లో నిబంధనలు తుంగలో కలిపేస్తున్నారనే ఆరోపణులు వినిపిస్తున్నాయి.
పనులు పరిశీలిస్తే వాస్తవాలు..
ఎల్లెల్సీ ఆర్‌సీసీ లైనింగ్ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు తుంగలో కలిపేస్తున్నారు. పనులు జరుగుతున్న తీరు పరిశీలిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. టీబీపీ ఇంజనీర్లతో పాటుగా నాణ్యత తనిఖీకోసం థర్ట్ పార్టీకి చెందిన రెండు ప్రైవేటు సంస్థలకు అప్పగించినా ఫలితం శూన్యమే అనిపిస్తుంది. కాంట్రాక్ట్ ఒప్పందం మేరకు కాలువ గట్టు స్లోప్‌ను ఎర్రమట్టితో నింపి గట్టిపడేలా స్లోప్ రోలింగ్ చేయాలి. ఎక్కడ కూడా స్లోప్ రోలింగ్ యంత్రం కనిపించడం లేదు. ఎక్స్‌కవేటర్ (జేసీబీ) బకెట్‌తో స్లోప్ చేసి దానిపై సీసీ లైనింగ్ వేస్తున్నారు.
ఫ అప్రూవ్డ్ క్వారీ నుంచి తెచ్చిన ఎర్రగరుసుతో గట్టు స్లోప్ చేయాల్సి ఉంటే.. కాలువ పక్కనే నల్లరేగడి పొలాలు కొనుగోలు చేసి ఆ మట్టినే తవ్వికాలువకు వాడుతున్నారు.
ఫ ఇనుము కడ్డీలు(స్టీల్ బార్) మెయినబార్ (నిలువు) 10 మిల్లీ మీటర్లు, డిసి్ట్రబ్యూషన బార్ (అడ్డంగా) 8 మిల్లీ మీటర్లు (ఎం,ఎం) మందం కడ్డీలు వాడాలి. రెండింటికి 8 ఎం.ఎం కడ్డీలే వాడుతున్నారు. అలాగే కడ్డీకడ్డీల మధ్య బాక్స్ నిలువు 25 సెం.మీలు, అడ్డం 25 సెం.మీలు ఉండేలా స్టీల్ కడ్డీలు వాడాల్సి ఉంటే.. 40 సెం.మీలు, 45 సెం.మీలు బాక్స్‌లు కడుతున్నారు.
ఫ ఎం-15 గ్రేడ్ రేషియో ప్రకారం 1:2:4 నిష్పత్తిన సిమెంట్, ఇసుక, కంకర వినియోగించాలి. ఒక క్యూబిక్ మీటరుకు 296 కిలోలు సిమెంట్, 600 కిలోలు ఇసుకు, 900 కిలోలు కంకర వాడాల్సి ఉంది. ఇందుకు విరుద్ధంగా బల్కేజీ పేరుతో 800-900 కిలోలు ఇసుక, 1,200-1,300 కిలోలు కంకర వాడుతున్నారు. అంతేకాదు.. 4 ఇంచుల మందం సీసీ కాంక్రీట్ వేయాల్సి ఉంటే కొన్ని చోట్ల 3-3.5 ఇంచులే వేస్తున్నారు.
ఫ ఇంజనీరింగ్ అధికారుల సిఫారసులకు విరుద్ధంగా ఆర్‌సీసీ లైనింగ్ పనులు చేస్తూ సిమెంట్, స్టీల్ 25-30 శాతానికి పైగా పొదుపుగా పాటిస్తున్నారు. మట్టి పనుల్లోనూ ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పనులు చేస్తున్నారని క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్న ఇంజనీర్లు గాంధారిపాత్ర పోషిస్తున్నారనే ఆరోపణులు ఉన్నాయి.
నిబంధనల మేరకే పనులు
ఎల్లెల్సీ ఆర్‌సీసీ లైనింగ్ పనులు నిబంధనల మేరకే చేస్తున్నాం. బోర్డు ఇంజనీర్లతో పాటు థర్ట్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ బాధ్యతలు చూసే రెండు సంస్థలు కూడా క్షేత్ర స్థాయిలో పనులు పర్యవేక్షిస్తున్నారు. ఏకాంట్రాక్టరైనా నిబంధనలు విరుద్ధంగా పనులు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం.
- నారాయణ నాయక్, ఎస్‌ఈ, టీబీపీ బోర్డు, హోస్పెట్
Updated Date - Jun 04 , 2025 | 12:31 AM