పదోన్నతి ఫైర్
ABN, Publish Date - May 12 , 2025 | 12:17 AM
అర్హులను పక్కనపెట్టారు.. అనర్హుడిని అందలమెక్కించారు.. వైసీపీ ప్రభుత్వ హయాంలో అగ్నిమాపక శాఖలో జరిగిన ఈ వివాదాస్పద వ్యవహారం ఇప్పుడు కూటమి ప్రభుత్వ దృష్టికి వెళ్లింది. ఈ పదోన్నతి కల్పించింది వివాదాస్పద ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ కాగా, వెంటనే విచారణ చేయాలని ఫైర్ డీజీని సీఎంవో ఆదేశించింది.
- వివాదాస్పద ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ నిర్వాకం
- వైసీపీ హయాంలో అగ్నిమాపక శాఖలో అనర్హుడికి అందలం
- డీఎఫ్‌వో నుంచి ఏకంగా ఆర్‌ఎఫ్‌వోగా పదోన్నతి
- విజయవాడ కార్పొరేషన్ అగ్నిమాపక శాఖలో పోస్టింగ్
- మాజీమంత్రి మేరుగు నాగార్జున సిఫార్సు మేరకే..
- సీఎంవోకు చేరిన పంచాయితీ.. విచారణకు ఆదేశాలు
అర్హులను పక్కనపెట్టారు.. అనర్హుడిని అందలమెక్కించారు.. వైసీపీ ప్రభుత్వ హయాంలో అగ్నిమాపక శాఖలో జరిగిన ఈ వివాదాస్పద వ్యవహారం ఇప్పుడు కూటమి ప్రభుత్వ దృష్టికి వెళ్లింది. ఈ పదోన్నతి కల్పించింది వివాదాస్పద ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ కాగా, వెంటనే విచారణ చేయాలని ఫైర్ డీజీని సీఎంవో ఆదేశించింది.
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : అర్హతలు లేకపోయినా అగ్నిమాపక శాఖ పూర్వ విభాగాధిపతి పీవీ సునీల్ కుమార్ తన అనుయాయుడిని విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ (వీఎంసీ)లో రీజనల్ ఫైర్ ఆఫీసర్ (ఆర్‌ఎఫ్‌వో) పీఠంపై కూర్చోబెట్టారు. వైసీపీకి చెందిన మాజీమంత్రి మేరుగు నాగార్జున సిఫార్సుతో ప్రభుత్వ ఆదేశాలు లేకుండానే, ఆర్థిక శాఖ ఆమోదం పొందకుండానే ఆ పదవిని కట్టబెట్టారు. నిబంధనలకు విరుద్ధంగా జరిగిన ఈ నియామకానికి సంబంధించి ఆర్‌ఎఫ్‌వోకు కార్పొరేషన్ జీతభత్యాలను ఇస్తోంది. ఈ వివాదం తాజాగా ముఖ్యమంత్రి కార్యాలయం దృష్టికి వెళ్లింది. దీనిపై విచారణ జరపాల్సిందిగా సీఎంవో.. అగ్నిమాపక శాఖ డీజీని ఆదేశించడంతో కార్పొరేషన్‌లో చర్చనీయాంశంగా మారింది.
అక్రమ పోస్టింగ్ ఇలా..
అగ్నిమాపక శాఖలో జిల్లా ఫైర్ ఆఫీసర్లు (డీఎఫ్‌వో)లు మంజూరైన పోస్టుల కంటే అధికంగా ఉన్నారు. మొత్తం 13 ఉమ్మడి జిల్లాలకు కలిపి 19 పోస్టులు మంజూరు కాగా, ప్రస్తుతం 22 మంది పనిచేస్తున్నారు. ఇలాంటపుడు అదనంగా ఉన్న ముగ్గురికి రివర్షన్‌లో ఏడీఎఫ్‌సీలుగా పోస్టింగ్ ఇవ్వాలి. కానీ, ఇలా రివర్షన్ ఇవ్వాల్సిన వారిలో ఒకరికి నిబంధనలకు విరుద్ధంగా విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ (వీఎంసీ)లో ఆర్‌ఎఫ్‌వోగా పదోన్నతి ఇచ్చారు. ఆర్‌ఎఫ్‌వోగా నియమించాలంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తప్పనిసరి. కానీ, గుంటూరు జిల్లా డీఎఫ్‌వోగా ఉన్న అగ్నిమాపక శాఖ అధికారిని ఏడీఎఫ్‌వోగా రివర్షన్ చేయకుండానే, నేరుగా ఆర్‌ఎఫ్‌వోగా నియమించారు. సెకండ్ లెవల్ గజిటె డ్ ఆఫీసర్‌గా ఉన్న వ్యక్తిని ఫస్ట్ లెవల్ గజిటెడ్ ఆఫీసర్‌గా మార్చాల్సిన పోస్టుకు ఏకంగా మూడో లెవల్ గజిటెడ్ ఆఫీసర్ పోస్టును కల్పించారు. ఆర్థికశాఖ అనుమతులు లేకుండా ఆర్‌ఎఫ్‌వోగా పనిచేస్తున్న వ్యక్తికి 2023 మే నెల నుంచి జీతాలు ఇస్తున్నారు.
కావాలనే అందలం
విజయవాడ కార్పొరేషన్‌లో ఆర్ ఎఫ్‌వో పోస్టు అంటే.. మూడో లెవల్ గజిటెడ్ ఆఫీసర్ హోదా కిందకు వస్తుంది. ఈ పోస్టుకు ప్రభుత్వం డీపీసీ జరిపి ఆదేశాలు ఇవ్వాలి. అలా కాకుండా అప్పటి డైరెక్టర్ జనరల్ ఫైర్ సర్వీసెస్ అధికారిగా ఉన్న పీవీ సునీల్ కుమార్ ఏకపక్షంగా ఫస్ట్ లెవల్ గజిటెడ్ అధికారిని మూడో లెవల్ గజిటెడ్ అధికారి స్థానంలో కూర్చోబెట్టారు. వివాదాస్పద సునీల్ కుమార్‌పై పలు అవినీతి ఆరోపణలు ఉండటంతో కూటమి ప్రభుత్వంలో సస్పెండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆయన హవా సాగించారు. మాజీమంత్రి మేరుగు నాగార్జున సిఫార్సు చేయటంతో నిబంధనలు అంగీకరించవని తెలిసినా ఆ అధికారిని అందలమెక్కించారు. ప్రస్తుతం విజయవాడ కార్పొరేషన్‌లో ఆర్‌ఎఫ్‌వోగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆ అధికారి ఈ ఏడాది నవంబరులో పదవీ విరమణ చేయనున్నారు. పదోన్నతిలో భాగంగా ఆయన తీసుకున్న రెండు ఇంక్రిమెంట్లను తగ్గించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ వివాదాస్పద పదోన్నతి వ్యవహారంపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.
సీనియారిటీని కాదని..
ఆర్‌ఎఫ్‌వోగా పదోన్నతి పొందడానికి ఆయన కంటే ముందు వరుసలో ఆరేడుగురు సీనియర్లు ఉన్నారు. వారిని కాదని.. సదరు అధికారినే అందలమెక్కించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా సదరు ఆర్‌ఎఫ్‌వోగా వచ్చిన అధికారి బదిలీపై మరోచోటకు వెళ్లేందుకు పైరవీలు చేసుకుంటున్నారని సమాచారం. పామర్రుకు చెందిన వైసీపీ మాజీ ప్రజాప్రతినిధి, మరో మాజీమంత్రి ద్వారా అగ్నిమాపక శాఖ ఉన్నతాధికారుల దగ్గర చక్రం తిప్పుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.
Updated Date - May 12 , 2025 | 12:17 AM