10లక్షల మందితో యోగాడే
ABN, Publish Date - May 29 , 2025 | 01:43 AM
ప్రభుత్వం వచ్చేనెల 21న తలపెట్టిన ప్రపంచ యోగా దినోత్సవాన్ని భారీగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఆ రోజున జిల్లావ్యాప్తంగా ఊరూవాడా పెద్దసంఖ్యలో ప్రజానీకం యోగాసనాలు చేసేలా ప్రణాళికలు రూపొందిస్తోంది.
సచివాలయ సిబ్బంది ద్వారా ప్రత్యేక యాప్‌లో రిజిస్ట్రేషన్ ప్రారంభం
31 వరకూ టీవోటీలకు.. అనంతరం వారి ద్వారా అందరికీ శిక్షణ
నాలుగు పర్యాటక ప్రదేశాల్లో వారానికి ఒకచోట అవగాహన కార్యక్రమం
ఇప్పటికే గుండ్లకమ్మ వద్ద పూర్తి
వచ్చేనెల 18న ఒంగోలులో ఐదువేల మందితో యోగాసనాలు
ఒంగోలు మే 28 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వం వచ్చేనెల 21న తలపెట్టిన ప్రపంచ యోగా దినోత్సవాన్ని భారీగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఆ రోజున జిల్లావ్యాప్తంగా ఊరూవాడా పెద్దసంఖ్యలో ప్రజానీకం యోగాసనాలు చేసేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. కలెక్టర్ తమీమ్ అన్సారియా దీనిపై ప్రత్యేక దృష్టిసారించగా మొత్తం పది లక్షల మంది యోగా దినోత్సవం రోజున ఆసనాలలో పాల్గొనేలా లక్ష్యం నిర్దేశించుకున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన యాప్ ద్వారా ఆసక్తి ఉన్న వారి పేర్లను రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఉండే సచివాలయ సిబ్బందికి ఈ బాధ్యత అప్పగించారు. మరోవైపు ఆసక్తి కనబరిచిన వారిని మోగాసనాలకు సన్నద్ధం చేసేందుకు మండల స్థాయిలో ట్రైనర్స్‌ను ఎంపిక చేసి వారికి శిక్షణ ఇస్తున్నారు. ఈ ప్రక్రియ మంగళవారం ప్రారంభమైంది. అనంతరం వారు గ్రామాలు, పట్టణాల్లోని వివిధ సచివాలయల పరిధిలో ఆసక్తి ఉన్న వారిని గుర్తించి ఆసనాలపై అవగాహన కల్పిస్తారు.
జిల్లాలో పది లక్షల మందితో..
ఈసారి ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ స్థాయి కార్యక్రమాన్ని విశాఖ పట్టణంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరవుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దీనిపై ప్రత్యేక దృష్టిసారించడంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కేవలం విశాఖకు పరిమితం కాకుండా యోగాంధ్ర-25 పేరుతో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఆరోజున రాష్ట్రంలో రెండు కోట్ల మంది యోగాసనాలలో పాల్గొనేలా చేయాలన్నది ప్రభుత్వ సంకల్పం. అందులోభాగంగా జిల్లాలో పది లక్షల మందిగా నిర్ణయించారు. ప్రధానంగా పొదుపు గ్రూపు మహిళలు, హౌసింగ్, ఉపాధి కూలీలు, ఇతరత్రా ప్రభుత్వ లబ్ధిదారులు, హైస్కూలు, కాలేజీల విద్యార్థులు ఇందులో పాల్గొనేలా చేయాలని భావిస్తున్నారు.
ఇంటింటికీ సచివాలయ సిబ్బంది
సచివాలయ సిబ్బందిని ఇంటింటికీ వెళ్లి యోగా ప్రాధాన్యతను వివరించి రిజిస్ట్రేషన్ చేయించుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. రెండు రోజుల నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కాగా జిల్లాలో 30వేల మంది చేయించుకున్నట్లు సమాచారం. మరోవైపు యోగాడే నిర్వహణపై విభిన్నవర్గాల ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం వచ్చేనెల 21లోపు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఒక్కో జిల్లాలో ఒక్కోరోజు మెగా యోగా అవగాహన కార్యక్రమాల ఏర్పాటుకు నిర్ణయించింది. అందులోభాగంగా ఒంగోలులో వచ్చేనెల 18న రాష్ట్రస్థాయి అవగాహన కార్యక్రమం జరగనుంది. సుమారు ఐదువేల మందితో నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు.
పర్యాటక ప్రాంతాల్లో అవగాహన
అన్ని జిల్లాల్లో ప్రధాన పర్యాటక, చారిత్రక ప్రాంతాల్లో వారానికి ఒకచోట అదేతరహాలో అవగాహన కార్యక్రమాల ఏర్పాటుకు ప్రభుత్వం ఆదేశించగా జిల్లాలో అలా నాలుగు చోట్ల నిర్వహణకు యంత్రాంగం నిర్ణయించింది. అందులోభాగంగా గత సోమవారం గుండ్లకమ్మ ప్రాజెక్టు వద్ద నిర్వహించగా కలెక్టర్ అన్సారియా, ఎమ్మెల్యే బీఎన్.విజయ్‌కుమార్ పాల్గొన్నారు. అలాగే వచ్చేనెల 2న త్రిపురాంతకం దేవాలయం వద్ద, 8వతేదీన కొత్తపట్నం బీచ్ వద్ద, 14వతేదీన పాకల బీచ్ వద్ద ఈ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. చివరకు అంతర్జాతీయ యోగా దినోత్సవమైన వచ్చేనెల 21న జిల్లాలోని అన్నిగ్రామాలు, పట్టణాలలో మొత్తం పది లక్షల మంది పాల్గొనేలా అధికార యంత్రాంగం కసరత్తు చేస్తున్నారు.
Updated Date - May 30 , 2025 | 03:05 PM