నేటి నుంచి పసుపు పండుగ
ABN, Publish Date - May 27 , 2025 | 01:31 AM
తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే మహానాడు వేడుక మంగళవారం నుంచి ప్రారంభంకానుంది. కడప నగర సమీపంలోని సీకేదిన్నె వేదికగా ఈనెల 29 వరకూ మూడు రోజులపాటు జరగనున్న పసుపు పండుగ కోసం అక్కడ అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
కడప వేదికగా మహానాడు
భారీగా తరలివెళ్లిన పార్టీ నేతలు
మూడు రోజులు ముఖ్యులంతా అక్కడే
ప్రతినిధుల సభకు జిల్లా నుంచి రెండువేల మంది
29న బహిరంగ సభకు పాతికవేల మందిపైనే
ఒంగోలు, మే 26 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే మహానాడు వేడుక మంగళవారం నుంచి ప్రారంభంకానుంది. కడప నగర సమీపంలోని సీకేదిన్నె వేదికగా ఈనెల 29 వరకూ మూడు రోజులపాటు జరగనున్న పసుపు పండుగ కోసం అక్కడ అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. తొలుత రెండు రోజులు ప్రతినిధుల సభలు, మూడో రోజు భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ప్రతినిధుల సభలో టీడీపీ రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, విభిన్నవర్గాల ప్రజా సమస్యలు, జాతీయ, రాష్ట్రస్థాయిలో వివిధ అంశాలపై పార్టీ విధివిధానాలు తదితర అంశాలపై చర్చించనున్నారు. ఈ రెండ్రోజులు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల నుంచి పరిమిత సంఖ్యలో నాయకులు పాల్గొంటారు. ప్రతినిధుల సభకు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిల నేతృత్వంలో సగటున ఒక్కో నియోజకవర్గం నుంచి 250 మంది వంతున సుమారు 2వేల మంది వరకూ నాయకులు జిల్లా నుంచి హాజరవుతున్నట్లు పార్టీవర్గాల సమాచా రం. అలాగే మహానాడు ముగింపు రోజైన 29వతేదీన కడపలో భారీ బహిరంగ సభను టీడీపీ నిర్వహిం చనుంది. ఆ సభకు కూడా జిల్లా నుంచి వేలాదిగా పార్టీశ్రేణులు తరలివెళ్లనున్నారు. ప్రధానంగా పశ్చిమప్రాంతం నుంచి అధికంగా పార్టీ కార్యకర్తలు వెళ్లనున్నారు. అక్కడి ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలు ఇందుకోసం బస్సులు, కార్లు, ఇతర వాహనాలను కూడా సిద్ధం చేశారు. అలాగే ఇతర ప్రాంతాల నుంచి సొంత వాహనాల్లోనూ భారీగానే శ్రేణులు వెళ్లే అవకాశం ఉంది. మొత్తంగా చివరిరోజు బహిరంగ సభకు జిల్లా నుంచి పాతికవేల మంది వరకూ వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. జిల్లాకు చెందిన మంత్రి డాక్టర్ స్వామి, ఇతర నియోజకవర్గాల ఎమ్మల్యేలు, ఇన్‌చార్జిలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఇతరత్రా కీలక నేతలంతా సోమవారం రాత్రికే కడప చేరుకున్నారు. మూడు రోజులు వారంతా అక్కడే ఉండనున్నారు. యువనేత దామచర్ల సత్య, ఎమ్మెల్యేలు ఉగ్రనరసింహారెడ్డి, అశోక్‌రెడ్డి వంటివారు ముందుగానే వెళ్లి అక్కడ ఏర్పాట్లలో భాగస్వాములయ్యారు.
Updated Date - May 27 , 2025 | 01:31 AM