స్త్రీనిధి డబ్బులు స్వాహా
ABN, Publish Date - Jul 03 , 2025 | 10:51 PM
వ్యక్తిగత అవసరాల కోసం పేద మహిళలకు ఉపయుక్తంగా ఉండాలన్న సత్సంకల్పంతో ప్రభుత్వం ప్రవేశ పెట్టిన స్త్రీనిధి రుణం లక్ష్యాన్ని జరుగుమల్లి మండలంలోని వీవోఏలు, వెలుగు అధికారులు నీరుగార్చారు. జమ చేయాలని పలువురు లబ్ధిదారులు ఇచ్చిన డబ్బులను స్వాహా చేశారు. గురువారం వెలుగు కార్యాలయంలో స్త్రీనిధి రుణాల రికవరీ కోసం ఏర్పాటు చేసిన సమావేశంలో బయటపడ్డ అక్రమాన్ని చూసి రికవరీ అధికారులు విస్తుపోయారు.
జరుగుమల్లి మండలంలో వీవోఏలు, వెలుగు అధికారుల పాత్ర
రికవరీ అధికారుల సమావేశంలో బట్టబయలు
రెండు లక్షలు వాడుకున్నానన్న వీవోఏ భర్త
15వ తేదీలోగా రికవరీ పూర్తి చేయాలని ఆదేశం
జరుగుమల్లి, జూలై3 (ఆంధ్రజ్యోతి): వ్యక్తిగత అవసరాల కోసం పేద మహిళలకు ఉపయుక్తంగా ఉండాలన్న సత్సంకల్పంతో ప్రభుత్వం ప్రవేశ పెట్టిన స్త్రీనిధి రుణం లక్ష్యాన్ని జరుగుమల్లి మండలంలోని వీవోఏలు, వెలుగు అధికారులు నీరుగార్చారు. జమ చేయాలని పలువురు లబ్ధిదారులు ఇచ్చిన డబ్బులను స్వాహా చేశారు. గురువారం వెలుగు కార్యాలయంలో స్త్రీనిధి రుణాల రికవరీ కోసం ఏర్పాటు చేసిన సమావేశంలో బయటపడ్డ అక్రమాన్ని చూసి రికవరీ అధికారులు విస్తుపోయారు.
రామచంద్రాపురం గ్రామానికి చెందిన వీవోఏ దివ్య భర్త ఎర్మియా సమావేశంలో కూర్చుని అధికారులతో స్త్రీనిధి రుణాలు తీసుకున్న లబ్ధిదారులు జమ చేయమన్న డబ్బులు రూ.2 లక్షలు తాను ఆరోగ్యం బాగాలేక వాడుకున్నానని అనడంతో అధికారులు నిర్ఘాంతపోయారు. సొంత డబ్బులు మాదిరిగా ఎలా వాడుకుంటారని స్త్రీనిధి నెల్లూరు జోనల్ డీజీఎం ఎ.ఉమామహేశ్వరరావు, ఏజీఎం ఎం.ఉదయ్‌కుమార్ ఎర్మియాను ప్రశ్నించారు. ఈనెల 15వ తేదీలోపు వాడుకున్న డబ్బులు చెల్లించకపోతే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. వీవోఏలు, వెలుగు అధికారులు చేసిన నిర్వాకం వల్ల గడచిన మూడేళ్లుగా జరుగుమల్లి మండలంలో స్త్రీనిధి రుణాలు ఇవ్వడం లేదన్నారు. రూ.కోటీ 9 లక్షల స్త్రీనిధి రుణాల తీసుకున్న లబ్ధిదారుల నుంచి రికవరీ చేయాల్సి ఉందన్నారు. మొండిబకాయిల్లో జరుగుమల్లి ప్రథమ స్థానంలో ఉందని, వీవోఏల, వెలుగు అధికారుల అలసత్వం వల్ల పేద మహిళలకు వ్యక్తిగత అవసరాలకు ఉపయోగపడే స్త్రీనిధి రుణాలు అందకుండా పోయాయని, మరో మూడు నాలుగు కోట్లు రూపాయలు స్త్రీనిధి రుణాలు అవసరమైన పేద మహిళలకు ఉపయోగ పడేవి కాదా? అని రికవరీ అధికారులు ప్రశ్నించారు. గతంలో పనిచేసిన వెలుగు ఏపీఎం, సీసీలు వివిధ పథకాలలో రుణాలు పొందిన మహిళలు తిరిగి జమ చేసిన డబ్బులను తప్పుడు నమోదులు చేశారని పలువురు వీవోఏలు అధికారుల ఎదుట వాపోయారు. ఒకరు ఇచ్చిన డబ్బులను వేరొకరికి జమ చేశారని, కొంత డబ్బులను వాడుకున్నారని, కొందరికి డబ్బులు జమ చేయకుండానే జమ చేసినట్లు రశీదులు ఇచ్చారని అధికారులకు తెలిపారు. ఫోన్ పేల ద్వారా డబ్బులు జమ చేసిన వారి బకాయిలకు డబ్బులు జమ చేయలేదని, ఇపుడు పలు పొదుపు సంఘాల మహిళలు తాము డబ్బులు చెల్లించామని, ఇక చెల్లించబోమని తెగేసి చెబుతున్నారని పలువురు వీవోఏలు అధికారులకు తెలిపారు. గతంలో పనిచేసి ఇపుడు మానుకున్న పలువురు వీవోఏలు బకాయిల డబ్బులు వాడుకుని, ఇపుడు తమకు సంబంధం లేదని అంటున్నారని పలు గ్రామాల్లో ఏడాది క్రితం చేరిన వీవోఏలు అధికారులకు తెలిపారు. తాము కొత్తగా వచ్చామని, ఏమీ చేయలేకపోతున్నామని వీవోలు పలువురు తెలియజేయడంతో కొత్త, పాత ఏమీ ఉందని, ఎవరైనా బాధ్యత వహించాల్సిందేనని, సమాధానం చెప్పకపోతే క్రిమినల్ కేసులు నమోదు చేసి డబ్బులు వసూలు చేస్తామని ఏజీఎం ఉదయ్‌కుమార్ హెచ్చరించారు. జరిగిన విషయాలను ఆధారాలతో సహా లిఖితపూర్వకంగా వీవోఏలతో రాయించుకున్నారు. సమావేశంలో స్త్రీనిధి మేనేజర్ పద్మావతి, వెలుగు ఏపీఎం జయరాజ్,హెడి సుగుణమ్మ పాల్గొన్నారు.
Updated Date - Jul 03 , 2025 | 10:51 PM