ఇకనైనా ఆర్టీసీ బస్టాండ్‌ను నిర్మిస్తారా..?
ABN, Publish Date - May 05 , 2025 | 10:01 PM
దిగువ శ్రీశైలంగా పిలిచే దోర్నాలలో ఆర్‌టీసీ బస్టాండ్ నిర్మాణం కలగానే మిగిలిపోయింది. దక్షిణ కాశీగా ప్రఖ్యాతి గాంచిన పుణ్యక్షేత్రం శ్రీశైలంలో కొలువైన శ్రీభ్రమరాంబికా మల్లికార్జున స్వామివార్లను దర్శించుకునేందుకు రాష్ట్ర ప్రజలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, హర్యానా, గుజరాత్ వంటి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి వెళ్తుంటారు.
రోజూ రాష్ట్ర నలుమూలల నుంచి బస్సుల రాకపోకలు
వందల సంఖ్యలో యాత్రికుల ప్రయాణం
వసతుల కల్పనపై అధికారుల తాత్సారం
పెద్ద దోర్నాల, మే 5 (ఆంధ్రజ్యోతి) : దిగువ శ్రీశైలంగా పిలిచే దోర్నాలలో ఆర్‌టీసీ బస్టాండ్ నిర్మాణం కలగానే మిగిలిపోయింది. దక్షిణ కాశీగా ప్రఖ్యాతి గాంచిన పుణ్యక్షేత్రం శ్రీశైలంలో కొలువైన శ్రీభ్రమరాంబికా మల్లికార్జున స్వామివార్లను దర్శించుకునేందుకు రాష్ట్ర ప్రజలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, హర్యానా, గుజరాత్ వంటి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి వెళ్తుంటారు. శ్రీశైలం వెళ్లాలంటే దోర్నాల మీదుగా ప్రయాణించాల్సిందే.అంతేగాక మామూలు గానే విజయవాడ, పుట్టపర్తి, అనంతపురం, కర్నూలు, మహానంది, బెంగళూరు, రాయ్‌చూర్, విశాఖపట్నం, కాకినాడ, మచిలీపట్నం, తణుకు, విజయనగరం, కడప, తిరుపతి, ఎమ్మిగనూర్, హైదరాబాద్ తదితర ముఖ్య పట్టణాలకు దోర్నాల నుంచి నేరుగా బస్సు సర్వీసులు నడుస్తున్నాయి. రోజూ వందకు పైగా బస్సులు, వేల సంఖ్యల్లో యాత్రికులు ప్రయాణిస్తున్నారు. ఇంత రద్దీ, ఆదాయం ఉన్నప్పటికీ బస్టాండ్‌ను నిర్మించే విషయంలో ఆర్టీసీ అధికారులు ఎందుకు చొరవచూపడం లేదని ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. బస్టాండ్ లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని ప్రయాణికులు వాపోతున్నారు. వసతి, తాగునీరు, మరుగుదొడ్లు లేక పిల్లలు, వృద్ధులతో ఇక్కట్లకు గురవుతున్నట్లు చెప్తున్నారు. వర్షాకాలంలో బస్సులు నిలిపే చోట బురద, గుంతల్లో మురుగు నీరు చేరి బస్సు ఎక్కేందుకు పడుతున్న ఇబ్బందులు చెప్పలేనివి. ఎండాకాలం పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది.
రేకుల షెడ్డే దిక్కు
దోర్నాలలో ఆర్‌టీసీ బస్టాండ్ నిర్మాణం కోసం అనువైన స్థలం లభించందనే చెప్పవచ్చు. కేంద్రం నడిబొడ్డున నటరాజ్ కూడలిలో ఆర్‌అండ్‌బీ స్థలం అక్కరకు వచ్చింది. దోర్నాల పరిధిలోనిరోడ్లన్నీ జాతీయ రహదారులుగా మారడంతో ఎకరంపైగాఉన్న ఆర్‌అండ్‌బీ స్థలంలో 43సెంట్ల భూమిని ఆర్టీసీకి కేటాయించారు. అయితే బస్టాండ్ నిర్మాణానికి నిధులు కూడా మంజూరయ్యాయి. అయితే పట్టణానికి చెందిన కొందరు తమదంటూ కోర్టును ఆశ్రయించడంతో పనులునిలిచిపోయాయి. ఈ క్రమంలో అయినముక్కుల గ్రామానికి చెందిన కాంట్రాక్టర్ వెంకట రమణారెడ్డి యాత్రికుల సౌకర్యార్థం సొంత నిఽధులతో తాత్కాలికంగా రేకుల షెడ్డును నిర్మించారు. ఆ షేడ్డే కొంతవరకు ప్రయాణికులకు దిక్కయింది. ఎక్కువ మంది ఇక్కడ తలదాచుకునేందుకు వీలుపడదు. పలువురు బస్టాండ్ ఆవశ్యకతపై ఆర్టీసీ ఎండీకి, ప్రజాప్రతినిధులకు ఎన్నో సార్లు వినతి పత్రాలు అందజేశారు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు కలెక్టర్ అన్సారియా, సబ్ కలెక్టర్ వెంకట సహదిత్‌ను స్థలం చూపించి పరిస్థితిని వివరించారు. ఇకనైనా బస్టాండ్ నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
2
కొబ్బరికాయ కొట్టి డీప్ బోర్ పనులను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే నారాయణరెడ్డి
తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు
32వ వార్డులో డీప్ బోర్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే నారాయణరెడ్డి
మార్కాపురం, మే 5 (ఆంధ్రజ్యోతి): ప ట్టణ పరిధిలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి తెలిపారు. 32వ వార్డులో ని చర్చి వద్ద సోమవారం నూతన డీప్‌బోర్ పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ శివారు కాలనీల్లో తాగునీటికి ఇబ్బందులు పడుతున్నట్లు తెలిసిందన్నారు. ఆయా ప్రాం తాల్లో అవకాశం ఉన్న మేరకు నూతన డీప్‌బోర్లు వేయిస్తామన్నారు. అంతేకాక ట్యాంకర్ల ద్వారా కూడా నీటిని సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ సందర్భంగా వార్డులో నెలకొన్న పలు సమస్యలను మహిళలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ప్రాధాన్యతాక్రమంలో సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ము న్సిపల్ కమిషనర్ డీవీఎస్ నారాయణరావు, టీడీపీ నాయకులు మాలపాటి వెంకటరెడ్డి, షేక్ మౌళాలి, కౌన్సిలర్లు నాలి కొండయ్య యాదవ్, చిన్నషెక్షావలి, పఠాన్ హుసేన్‌ఖాన్ పాల్గొన్నారు.
3
పుల్లలచెరువు మండల టీడీపీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో
మాట్లాడుతున్న టీడీపీ ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబు
పార్టీ కోసం కష్టపడే వారికే పదవులు
గ్రామ కమిటీల ఎంపిక సమావేశంలో
టీడీపీ ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబు
ఎర్రగొండపాలెం, మే 5 (ఆంధ్రజ్యోతి) : పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతు న్న వారికే గ్రామ కమిటీ అధ్యక్ష, కార్యదర్శుల పదవులకు ఎంపిక చేయాలని మం డల కమిటీ నాయకులను టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు ఆదేశించా రు. షీలాస్కూల్ ఆవరణలో సోమవారం జరిగిన పుల్లలచెరువు మండల కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ మండల అధ్యక్షుడు పయ్యావుల ప్రసాద్ అధ్యక్షోపన్యాసం చేశారు. కుటుంబ సాధికారసారథలను నియమించడంలో జిల్లాలో ఎర్రగొండపాలెం ప్రథమస్థానంలో ఉందని ఎరిక్షన్‌బాబు అన్నారు. అన్ని గ్రామాల్లో పార్టీ సంస్థాగత పదవులకు మే 18వ తేదీలోపు కమిటీలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారని, ఆ మేరకు కమిటీను ఎంపిక చేస్తున్నట్లు తెలిపారు. గ్రామ కమిటీలు, అనుబంధ సంఘాలు, క్లస్టర్ యూనిట్, టీడీపీ మండల అధ్యక్ష, కార్యదర్శి పదవులకు కమిటీలను నియమిస్తున్నట్లు ఎరిక్షన్‌బాబు తెలిపారు. గ్రా మాల్లో కార్యకర్తల అభిప్రాయం మేరకు గ్రామ కమిటీలకు అభ్యర్థులను ఎన్నుకోవాలని మండల కమిటీ నాయకులకు ఆదేశించినట్లు చెప్పారు. అనంతరం గ్రామపంచాయతీలవారీగా గ్రామ కమిటీ కార్యవర్గాలను ఎంపిక చేశారు. కార్యక్రమంలో పుల్లలచెరువు మండల మాజీ అధ్యక్షుడు శనగా నారాయణరెడ్డి, కాకర్ల కోటయ్య, మేడికొండ లక్ష్మీనారాయణ, బీవీపుబ్బారెడ్డి, సంజీవరెడ్డి, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
4
బండలాగుడు పోటీలను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి
వైభవంగా పట్టాభిరాముని వార్షికోత్సవం
బండలాగుడు పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి
బేస్తవారపేట, మే 5 (ఆంధ్రజ్యోతి) : బేస్తవారపేట మండలంలోని జేసీ అగ్రహారం గ్రామంలో శ్రీ పట్టాభిరామ స్వామి 9వ వార్షికోత్సవం వైభవంగా జరుగుతోంది. ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ ఏర్పాటు చేసిన బండలాగుడు పోటీలను అశోక్‌రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, మండల పార్టీ అధ్యక్షుడు సోరెడ్డి మోహన్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు పూనూరు భూపాల్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి, ఏ ఇంద్రసేనారెడ్డి, రామకోటయ్య, గంగయ్య యాదవ్ పాల్గొన్నారు.
5
పెద్దపులి పాదముద్రలను పరిశీలిస్తున్న ఫారెస్టు అధికారులు
ఒంటరిగా అడవిలోకి వెళ్లొద్దు
కంభం, మే 5 (ఆంధ్రజ్యోతి) : నల్లమల అటవీ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు సాయంత్రం 5 నుంచి ఉదయం 7 గంటల వరకు ఒంటరిగా అడవిలోకి వెళ్లవద్దని మార్కాపురం డిప్యూటీ రేంజర్ ప్రసాద్‌రెడ్డి సూచించారు. అర్ధవీడు మండలంలో గత 3 నెలలుగా పలు ప్రాంతాలలో పెద్దపులి సంచరిస్తూ పశువులను చంపుతున్నదని తెలిపారు. ఆయా ప్రాంతాలలో పర్యటించి ప్రజలను అప్రమత్తం చేశారు. పెద్దపులి పాదముద్రలను అటవీ సిబ్బంది సేకరించినట్లు ఆయన తెలిపారు.
Updated Date - May 05 , 2025 | 10:01 PM