ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

శభాష్‌ కలెక్టర్‌

ABN, Publish Date - Jun 25 , 2025 | 10:21 PM

విధి నిర్వహణలో ప్రభుత్వ ప్రాధాన్యతా అంశాల్లో కొన్నింటికి సొంత ఆలోచనలు జోడించి సరికొత్త కార్యక్రమాలుగా రూపకల్పన చేసి విజయవంతమయ్యారు.. నిజాయితీ, నిబద్ధతతో వ్యవహరిస్తూ అటు రాజకీయ నాయకులు, ఇటు అధికార వర్గాలతో సమన్వయం చేసుకుంటూ ముందుకెళుతున్నారు..

ఏడాది పాలనలో అన్ని వర్గాల నుంచి మంచి మార్కులు

ప్రభుత్వ ప్రాధాన్యతలపై ప్రత్యేక దృష్టి

స్థానిక సమస్యల ఆధారంగా వినూత్న ఆలోచనలు

నిజాయితీ, నిబద్ధత, బంగారు బాల్యం, కంగారు ఏర్పాటు, స్కోచ్‌ అవార్డు ఉపయుక్తం

ప్రభుత్వం దృష్టికి కీలక అంశాలు

ప్రజలకు చేరువగా పాలనా యంత్రాంగం, ప్రజాప్రతినిధులతో సమన్వయం

రాష్ట్రంలోనూ, జిల్లాలోనూ గుర్తింపు

కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించి నేటితో ఏడాది పూర్తి

ఒంగోలు, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి) : విధి నిర్వహణలో ప్రభుత్వ ప్రాధాన్యతా అంశాల్లో కొన్నింటికి సొంత ఆలోచనలు జోడించి సరికొత్త కార్యక్రమాలుగా రూపకల్పన చేసి విజయవంతమయ్యారు.. నిజాయితీ, నిబద్ధతతో వ్యవహరిస్తూ అటు రాజకీయ నాయకులు, ఇటు అధికార వర్గాలతో సమన్వయం చేసుకుంటూ ముందుకెళుతున్నారు.. కార్యాలయానికే పరిమితం కాకుండా విస్తృతంగా ప్రజల మధ్యకు వెళ్లడం, తద్వారా వారి సమస్యలకు పరిష్కారం సులభతరం చేయడం, తన దృష్టికి వచ్చే ఏ సమస్య అయినా వేగంగా స్పందించడం, నిర్ధిష్ట చర్యలు తీసుకోవడం, అవసరమైన వాటిని ఉన్నత స్థాయి వరకు తీసుకెళ్లడంలో ఆమె కీలకంగా వ్యవహరించారు. తద్వారా ఇటు జిల్లాలోని రాజకీయ, అధికార వర్గాలతో పాటు రాష్ట్రస్థాయిలో పాలక పెద్దల చేత శభాష్‌ అనిపించుకొనే విధంగా కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా ఏడాది పాలన జిల్లాలో సాగింది. జిల్లా కలెక్టర్‌గా గత ఏడాది జూన్‌ 27న బాధ్యతలు స్వీకరించగా గురువారంతో ఏడాది పాలన పూర్తి చేసుకోనున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో పనిచేసిన కలెక్టర్లలో దాదాపు సగం మంది ఏడాది కూడా ఆ బాధ్యతలలో పనిచేయలేక పోగా ఐదారుగురు మాత్రమే రెండేళ్లు, ఆపైన పూర్తి చేశారు. అలాంటి బాధ్యతలను ఏడాది కాలం సమర్ధవంతంగా నిర్వహించడంలో ప్రస్తుత కలెక్టర్‌ కృతకృత్యులయ్యారు.

కలెక్టర్‌గా తొలి పోస్టింగ్‌...

కలెక్టర్‌గా అన్సారియాకు తొలి పోస్టింగ్‌ అయినప్పటికీ విశేష అనుభవం ఉన్న స్థాయిలో ఆచరణలో చూపించగలిగారు. చెన్నైకి చెందిన అన్సారియా తొలుత ఉత్తర భారత దేశంలో కొద్దికాలం పనిచేసి 2021లో రాష్ర్టానికి వచ్చారు. కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించే నాటికి రాష్ట్రంలో పాలనా వ్యవస్థ, పనితీరు, ప్రజా సమస్యలు ఇతరత్రా అంశాలలో అనుభవం తక్కువే. అయినప్పటికీ నిబద్ధత, నిజాయితీతో కష్టించి పనిచేస్తూ ముందుకు సాగారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల స్వీకరణను మరింత పకడ్బందీగా నిర్వహించడమే కాక ఈ కార్యక్రమాన్నినియోజకవర్గ స్థాయి వరకు వెళ్లి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వచ్చే అర్జీల పరిష్కారంపై దృష్టిపెట్టి గట్టి కృషిచేశారు. తాగునీరు, ఉపాధి పనులు, వ్యవసాయ, ఉద్యాన రంగాలలోని పథకాల పరిశీలన, ఏ ప్రాంతానికి వెళ్లినా అంగన్‌వాడీ కేంద్రాలు, స్థానిక వైద్యశాలలు, హాస్టళ్లను సందర్శించి సమస్యలను ఆకళింపు చేసుకొని పరిష్కారానికి కృషి చేపట్టారు.

బంగారుబాల్యం, కంగారూ ప్రాజెక్ట్‌లపై ప్రత్యేక దృష్టి...

ప్రత్యేకించి బాలిక విద్య, బాల్య వివాహాల నియంత్రణ, బాల కార్మికవ్యవస్థ నిర్మూలన, గర్భిణులు, బాలింతలకు పోషక ఆహారం, తల్లీబిడ్డలకు మెరుగైన వైద్యం అందించడంపై దృష్టి సారించారు. ఈ క్రమంలోనే బంగారు బాల్యం, కంగారు ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. పశ్చిమ ప్రాంతంలో చిన వయస్సులోనే బాలికలకు వివాహాలు చేయడం, మైనర్‌ తీరక ముందే గర్భిణులు కావడం, పౌష్టికాహారం అందక రక్తస్రావంతో వారు అవస్థలు పడటం, పుట్టే పిల్లలు అనేక లోపాలతో ఉండటం గుర్తించారు. అలాగే అనాధ బాలబాలికలు, బాలకార్మికులు జిల్లాలో అధికంగా ఉండటాన్ని గమనించి వారి సంక్షేమం కోసం బంగారు బాల్యం పేరుతో ప్రత్యేక ప్రాజెక్టును రూపకల్పన చేశారు. స్ర్తీ శిశు సంక్షేమ శాఖ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి వారి ద్వారా అన్ని శాఖల అధికారులు సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో బిడ్డల భవిష్యత్‌ బంగారంలా ఉండాలన్న లక్ష్యంతో చేపట్టిన బంగారు బాల్యం ప్రాజెక్టుపై లక్షలాది మందికి అవగాహన కల్పిండంతో మంచి ఫలితాలు రాబట్టగలిగారు. ఇందుకు సంబంధించి చేసిన కృషికి ఈ ఏడాది మార్చి 29న ఢిల్లీలో దేశస్థాయిలో అత్యున్నత అవార్డుగా భావించే స్కోచ్‌ అవార్డును అందుకున్నారు. ప్రస్తుత ప్రాజెక్టును మరింత విస్తృతపరిచే చర్యలు చేపట్టారు. ప్రభుత్వ వైద్యశాలల్లో పేదబాలింతలు, గర్భిణులు, నవజాత శిశువులకు సరైన వైద్యం, పోషకాహారం అందించేందుకు ప్రత్యేకంగా కంగారూ పేరుతో ఒంగోలు, కనిగిరి ప్రభుత్వాసుపత్రుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేశారు.

జలకేంద్రం పేరుతో ప్రత్యేక విభాగం

జిల్లాలో కరువు తీవ్రత, భూగర్భ జల్లాల పెంపు అవసరం నేపథ్యంలో సంబంధిత శాఖలైన డ్వామా, గ్రౌండ్‌ వాటర్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌, ఇరిగేషన్‌ అన్ని శాఖల పరిఽధలో నీటి సమస్య ఏదైనా తలెత్తితే దానిని ఈ శాఖలన్నీ సమన్వయం చేసేలా డ్వామా కార్యాలయంలో ప్రత్యేకంగా జలశక్తి కేంద్రం పేరుతో 24 గంటలు పనిచేసేలా ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి సోమవారం అర్జీలు ఇచ్చేందుకు కలెక్టరేట్‌కు వచ్చే వారికి మధ్యాహ్న భోజన సౌకర్యం ఏర్పాటుచేశారు.

అవినీతిపైనా చర్యలు

తన దృష్టికి వచ్చే అవినీతి వ్యవహారాల కట్టడిలోనూ కఠినంగానే వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో పలువురు రెవెన్యూ అధికారులపై వేటు వేయడంతో పాటు డ్వామాలో, డీసీసీబీ, పంచాయతీ కార్యాలయాల్లో అవినీతిపై విచారణలు చేయించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.

జిల్లా సమగ్ర అభివృద్ధిలో కీలకమైన వెలిగొండ, ఒంగోలు డెయిరీ, ట్రిపుల్‌ ఐటీ, వర్సిటీ నిర్మాణాలు, పరిశ్రమలు ఏర్పాటు తదితర అంశాలపై ఎప్పటికప్పుడు సీఎం దృష్టికి తీసుకెళుతున్నారు. అలాగే జిల్లాలో నియోజకవర్గాల వారీ కీలక సమస్యలు పరిష్కారం, అభివృద్ధి అంశాలపై స్థానిక ప్రజాప్రతినిధులతో చర్చించి వారి సూచనలకు ప్రాధాన్యత ఇస్తూ సాగుతున్నారు.

Updated Date - Jun 25 , 2025 | 10:21 PM