ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పశ్చిమాన జలకళ

ABN, Publish Date - Jul 22 , 2025 | 01:17 AM

కీలక సమయంలో వరుణుడు కరుణించాడు. జిల్లావ్యాప్తంగా భారీవర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాలలో ముంచెత్తుతున్నాయి. ప్రధానంగా పశ్చిమప్రాంతం జలకళను సంతరించుకుంది.

వర్షపు నీటితో నిండిన ఎర్రగొండపాలెం మండలం రామసముద్రం చెరువు

జిల్లావ్యాప్తంగా వర్షాలు

నాలుగు రోజుల్లో 73.70 మి.మీ సగటు వర్షపాతం

20 మండలాల్లో సాధారణం కన్నా అధికంగా నమోదు

అన్ని ప్రాంతాల్లోనూ సాగుకు మేలు

ఎండలు, నీటి ఇక్కట్ల నుంచి ప్రజలకు ఉపశమనం

మరో వారం కురిసే అవకాశం ఉందంటున్న వాతావరణ శాఖ

కీలక సమయంలో వరుణుడు కరుణించాడు. జిల్లావ్యాప్తంగా భారీవర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాలలో ముంచెత్తుతున్నాయి. ప్రధానంగా పశ్చిమప్రాంతం జలకళను సంతరించుకుంది. నీటి వనరుల్లో జలాలు చేరుతున్నాయి. పలుచోట్ల చెరువులు నిండాయి. భూగర్భ జలం కూడా పెరిగింది. చాలావరకు భూములన్నీ పదునెక్కాయి. దీంతో ఖరీఫ్‌ పంటల సాగు ఊపందుకోనుంది. ఇప్పటికే సాగు చేసిన పైర్లు కళకళలాడుతున్నాయి. నాలుగు రోజుల నుంచి వాతావరణం మారిపోయి ఒక్కసారిగా చల్లబడటంతో జనం సేదతీరుతున్నారు.

ఒంగోలు, జూలై 21 (ఆంధ్రజ్యోతి): జిల్లావ్యా ప్తంగా దాదాపు నెలన్నరకుపైగా చినుకు జాడ కోసం ఎదురుచేస్తున్న ప్రజానీకానికి ప్రత్యేకించి రైతులకు పెద్దఎత్తున ఊరట లభించింది. నాలుగు రోజులుగా విస్తారంగా వర్షాలు కురిశాయి. కొన్నిచోట్ల భారీ వర్షమే పడింది. ఈనెల 18 నుంచి సోమవారం వరకు నాలుగు రోజుల్లో ఏకంగా 73.70 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. జిల్లాలో ఈనెలలో 87.8 మి.మీ సాధారణ వర్షపాతం కాగా ఈ సమయానికి 59.5 మి.మీ కురవాలి. అయితే ఇప్పటికే 96.0 మి.మీ వర్షపాతం నమోదైంది. అంతేకాక పది మండలాల్లో రెట్టింపునకు పైగా వర్షం పడింది. మరో 20 మండలాల్లో సాధారణం కన్నా అధికంగా కురిసింది.

టంగుటూరు మండలంలో అత్యధికం

జిల్లాలో అత్యధిక వర్షపాతం టంగుటూరు మండలంలో నమోదైంది. ఈ సమయానికి కురవాల్సిన దాని కన్నా రెండున్నర రెట్లు ఎక్కువ పడింది. కొత్తపట్నంలో రెండు రెట్లు అధికంగా కురిసింది. కాగా ఈ వర్షాలు జిల్లా ప్రజానీకానికి అన్ని విధాలా మేలు చేశాయి. పశ్చిమప్రాంతం జలకళను సంతరించుకుంది. జూన్‌లో దాదాపు 35శాతం లోటు వర్షపాతంతోపాటు ఈనెల తొలిపక్షంలో చినుకు జాడ లేదు. పైగా దాదాపు నెలరోజులుగా జిల్లా అంతటా వేసవిని తలపిస్తూ ఎండలు, ఆపై వేడిగాలులతో ప్రజానీకం ఉక్కిరిబిక్కిరయ్యాయి. చాలాచోట్ల తాగునీటికే కాక సాధారణ నీటికి కూడా ప్రజలు అవస్థ పడ్డారు. పశుపక్షాదులు అల్లాడాయి. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమై నెలన్నర గడిచినా సాధారణ విస్తీర్ణంలో పదిశాతం కూడా పంటలు సాగు కాకపోగా వేసిన పైర్లు సైతం వాడుముఖం పట్టాయి. ఇక ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌కు కరువు తప్పదనుకునే వాతావరణం నుంచి ఒక్కసారిగా మార్పు వచ్చింది.

సాగుకు బాగా అనుకూలత

నాలుగు రోజుల్లో రెండు రోజులు జిల్లాలో భారీ వర్షమే కురిసింది. అన్ని ప్రాంతాల్లోనూ పంటల సాగుకు అనుకూలత ఏర్పడింది. ఇప్పటికే పొలంలో ఉన్న పైర్లు తిరిగి నవనవలాడుతుండగా దుక్కులు దున్ని సాగుకు వీలుగా సిద్ధం చేసిన భూముల్లో తక్షణం పంటలు వేసే అవకాశం ఏర్పడింది. ఇదిలా ఉండగా జిల్లా అంతటా తాజా వర్షాలతో నీరు కనిపిస్తున్నా పశ్చిమప్రాంతంలో జలకళను సంతరించుకొంది. అక్కడి పలు మండలాల్లోని వాగులు, వంకల్లో నీరు ప్రవహిస్తోంది. చెరువులకు నీరు చేరుతోంది. బోర్లు, బావుల్లోనూ భూగర్భ జలం పెరుగుతున్నట్లు సమాచారం. ఈ పరిస్థితితో పంటలకే కాక నీటి ఇక్కట్ల నుంచి కూడా ప్రజలకు ఉపశమనం కలిగింది. మరోవైపు రానున్న వారం రోజుల్లో జిల్లాలో వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.

Updated Date - Jul 22 , 2025 | 01:17 AM