రవాణా అధికారులపై దౌర్జన్యం
ABN, Publish Date - Jul 29 , 2025 | 01:23 AM
‘మా బండిపైనే కేసు రాస్తారా’ అంటూ రవాణాశాఖ అధికారులపై టిప్పర్ యజమాని దౌర్జన్యం చేశారు. ఈ ఘటన అటు గ్రానైట్ వర్గాలు, ఇటు అధికార యంత్రాంగంలో చర్చనీయాంశమైంది.
ఫిట్‌నెస్ కేసు నమోదు చేసినందుకు బ్రేక్‌ఇన్‌స్పెక్టర్‌ను అడ్డగించిన లారీ యజమాని
పోలీసు స్టేషన్‌లో అప్పగించిన అధికారులు
ఒంగోలు క్రైం, జూలై 28 (ఆంధ్రజ్యోతి): ‘మా బండిపైనే కేసు రాస్తారా’ అంటూ రవాణాశాఖ అధికారులపై టిప్పర్ యజమాని దౌర్జన్యం చేశారు. ఈ ఘటన అటు గ్రానైట్ వర్గాలు, ఇటు అధికార యంత్రాంగంలో చర్చనీయాంశమైంది. ‘ఓవర్ లోడ్ వద్దు.. పాసింగ్ ముద్దు’ అంటూ 10 రోజులుగా నిరసనకు దిగిన ఒంగోలు టిప్పర్ యజమానుల అసోసియేషన్ వైస్‌ప్రెసిడెంట్ వల్లెపు ఆంజనేయులుకు చెందిన టిప్పర్‌ను సోమవారం ఉదయం సంతనూతలపాడు చెరువు కట్ట సమీపంలో రవాణా శాఖ అధికారులు తనిఖీ చేశారు. టిప్పర్‌కు ఫిట్‌నెస్ చేయించలేదు. కేసు నమోదు చేసిన బ్రేక్ ఇన్‌స్పెక్టర్ జరిమానా విధించారు. దీంతో లారీ యజమాని ఆంజనేయులు కోపోద్రిక్తుడై బ్రేక్ ఇన్‌స్పెక్టర్ కారుకు అడ్డుగా కూర్చున్నాడు. తమ టిప్పర్లపైనే కేసులు ఎందుకు రాస్తున్నారంటూ వాదులాటకు దిగారు. దీంతో టిప్పర్‌ను స్వాధీనం చేసుకున్న రవాణా శాఖ అధికారులు లారీ యజమాని ఆంజనేయులు, మరో వ్యక్తిని సంతనూతలపాడు పోలీసులకు అప్పగించారు. అనంతరం టిప్పరు యజమానులు రవాణా శాఖ అధికారులతో మాట్లాడి తాము తప్పుచేశామని క్షమాపణలు కోరారు.
Updated Date - Jul 29 , 2025 | 01:23 AM