రైతుల ఉసురు తీస్తున్న అకాల వర్షం
ABN, Publish Date - Apr 16 , 2025 | 10:45 PM
అకాల వర్షాలు రైతులు ఉసురుతీస్తున్నాయి. ఆరుగాలం కష్టించి లక్షలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి పండించిన పంటలు చేతి కందే సమయంలో ప్రకృతి ఆగ్రహానికి గురై నీటి పాలవుతున్నాయి.
పంటలకు అపార నష్టం
దర్శి మండలంలో కోతకొచ్చిన సుమారు 200 ఎకరాల్లో వరి నేలమట్టం
తాళ్లూరు మండలంలో మొక్కజొన్నకు నష్టం
కన్నీరుమున్నీరవుతున్న కర్షకులు
దర్శి మండలంలో...
దర్శి, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి): అకాల వర్షాలు రైతులు ఉసురుతీస్తున్నాయి. ఆరుగాలం కష్టించి లక్షలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి పండించిన పంటలు చేతి కందే సమయంలో ప్రకృతి ఆగ్రహానికి గురై నీటి పాలవుతున్నాయి. మంగళవారం రాత్రి దర్శిలో 40 మిల్లీమీటర్ల వర్షం పడింది. ఈ వర్షానికి కోతకొచ్చిన వరి పంట నేలమట్టమైంది. వరి వెన్నులు నీటి పాలయ్యాయి. రబీ సీజన్‌లో బొట్లపాలెం, చెరువుకొమ్ముపాలెం, తూర్పువీరాయపాలెం, పాపిరెడ్డిపాలెం తదితర గ్రామాల్లో సాగు చేసిన వరి ప్రస్తుతం కోతకు వచ్చింది. కొంతమంది కోతలు కోసి ఓదెలు వేశారు. మరికొంత పైరు కోతకు సిద్ధంగా ఉంది. ఈ పరిస్థితుల్లో అకాలవర్షం భారీగా కురవటంతో కోతకొచ్చిన సుమారు 200 ఎకరాల్లో పంట దెబ్బతిందని రైతులు చెబుతున్నారు. తూర్పువెంకటాపురం, చందలూరు, బసిరెడ్డిపల్లి, తూర్పుచౌటపాలెం మారెడ్డిపల్లి తదితర గ్రామాల్లో సాగుచేసిన మిర్చి, బొప్పాయి, మినుము పంటలు దెబ్బతిన్నాయి. మిర్చి పంట కోతకోసి ఆరబెట్టగా భారీ వర్షానికి తడిసి పోయింది. బొప్పాయి చెట్లు విరిగిపోవటమే కాక కాయలు కూడా రాలిపోయాయి. కోతదశలో ఉన్న మినుప పంట పూర్తిగా తడిసి పో యింది. అంతకుముందు రెండుసార్లు కురిసిన వర్షాలకు బొప్పాయి, మినుము వరి తదితర పంటలు దెబ్బతిన్నాయి. ప్రభుత్వం నష్టపోయిన రైతులకు పరిహరం అందించి ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
తాళ్లూరులో...
తాళ్లూరు, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి) : మండలంలో బుధవారం వేకువజామును ఈదురు గాలులతో కురిసిన భారీ వర్షానికి మొక్కజొన్న పంట దెబ్బతింది. 45.8 మి.మీ వర్షం కురిసింది. దీనివల్ల వరి, పొగాకు, మిరప పంటలకు కొంత మేర నష్టం వాటిల్లగా మొక్కజొన్న పంట దాదాపు 200 ఎకరాల్లో దెబ్బతింది. పంట చేతికి వచ్చి కండెలను కోసేందుకు రైతాంగం సన్నద్ధమవుతుండగా వర్షం వల్ల నేల వాలింది. కోత యంత్రాలతో కండెలు కోసేందుకు వీలులేకుండా పోయి ఖర్చు పెరిగిందని రైతులు వాపోతున్నారు. నేలవాలిన మొక్కజొన్న దిగుబడి తీసేందుకు ఎకరాకు అదనంగా రూ.10వేల వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తుందన్నారు. భూమి తడిగా ఉండటం, కండెపై నీరు పడినందున గింజ కొంత మేర తాలుగా వచ్చి రేటు కూడా తగ్గే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు. వరి, మిరప, పొగాకు పంటలకు స్వల్పంగా నష్టం వస్తుందని చెబుతున్నారు.
రోడ్లపైకి, ఇళ్లలోకి చేరుకున్న మురుగునీరు
గ్రామాల్లో మురుగు కాలువల నుంచి నీరు కిందకి వెళ్లే మార్గం లేక రోడ్లపై గుండా ప్రవహిస్తూ బురదమయంగా మారి దుర్గంధం వెదజల్లుతోంది. తాళ్లూరులో రాముల వారి మేడ ముందుబాగంతో మురుగు నీరు నిలిచిపోయింది. వెనుక వైపున గల గృహాల్లోకి మురుగునీరు ప్రవహించి గృహయజమానులు ఇబ్బందులు పడ్డారు. సుంకిరెడ్డి పాలెంలో ఇళ్లముందే నీరు నిల్వ వుండి రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పడ్డారు.
Updated Date - Apr 16 , 2025 | 10:45 PM