పిడుగుపాటుకు గొర్రెలకాపరులు ఇద్దరు మృతి
ABN, Publish Date - May 04 , 2025 | 11:27 PM
నాగులుప్పలపాడు, చినగంజాం మండలాల్లో పిడుగుపాటుకు గొర్రెలకాపరులు మృతి చెందారు
నాగులుప్పలపాడు, చినగంజాం మండలాల్లో ఘటన
నాగులుప్పలపాడు, మే 4(ఆంధ్రజ్యోతి): పిడుగుపాటుకు గొర్రెలకాపరి మృతి చెందిన సంఘటన ఈదుమూడిలో చోటుచేసుకొంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు... ఈదుమూడి గ్రామానికి చెందిన దివ్యాంగుడు కొండేపి నాగమల్లేశ్వరరావు(42) రోజులాగే ఆదివారం కూడా మేకలను తోలుకొని గ్రామ సమీపంలోని పొలానికి వెళ్లాడు. మధ్యాహ్నం ఒక్కసారిగా పిడుగుపడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఇన్‌చార్జ్ వీఆర్వో నల్లూరి శ్యాం, పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని వివరాలు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు జీజీహెచ్‌కు తరలించారు. మృతుడికి భార్య, పదేళ్ల వయసు కలిగిన ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబానికి జీవనాధారమైన నాగమల్లేశ్వరరావు మృతి చెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.
చినగంజాంలోనూ...
చినగంజాం, మే 4(ఆంధ్రజ్యోతి) : గేదెలు, గొర్రెలను మేపుకొనే సమయంలో పిడుగు పడడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన ఆదివారం చోటుచేసుకుంది. ఈ ఘటన చినగంజాం ప్రాంతంలోని కొమ్మమూరు కాలువ సమీపంలోని ఎత్తిపోతుల పఽథకం వద్ద చోటుచేసుకొంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. చినగంజాం గ్రామ పంచాయతీ పరిఽధిలోని రామకోటేశ్వరకాలనీకి చెందిన గడ్డం బ్రహ్మయ్య(47) తన గేదెలు, గొర్రెలను పొలాల్లో మేత మేపుకునేందుకు తోలుకొని వెళ్లాడు. కొమ్మమూరు కాలువ వద్ద ఉన్న చినగంజాం ఎత్తిపోతుల పథకం బావుల వద్ద బ్రహ్మయ్య గేదేలు మేపుతున్న సమయంలో మెరుపులు, ఉరుములతో కూడిన భారీ వర్షం పడి పిడుగుపడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వీఆర్వో సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించినట్లు తెలిపారు. బ్రహ్మయ్యకు భార్య సుజాత, కుమారుడు బాలమణికంఠ, కుమార్తె లలిత ఉన్నారు.
Updated Date - May 04 , 2025 | 11:27 PM