ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ట్రాన్స్‌‘ఫార్మర్‌’ వెతలు

ABN, Publish Date - May 27 , 2025 | 01:34 AM

ఖరీఫ్‌ సీజన్‌ తరుముకొస్తోంది. వచ్చే నెల ప్రారంభం నుంచి రైతులు సాగుకు సమాయత్తమవుతారు. ఈ సమయంలో వారిని ట్రాన్స్‌ఫార్మర్‌ కష్టాలు వెంటాడుతున్నాయి. వేలాది సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నా ప్రభుత్వం వందల సంఖ్యలో మాత్రమే మంజూరు చేస్తోంది.

మార్కాపురం సబ్‌స్టేషన్‌లో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌లు

ఏడాది క్రితం డీడీలు తీసినా అరకొరగానే మంజూరు

పశ్చిమ రైతుల ఎదురుచూపులు

రెండు వేలకు పైగానే పెండింగ్‌

పూర్తిస్థాయిలో మెటీరియల్‌ ఇవ్వకపోవడంతో మరింత భారం

శ్రుతిమించుతున్న అధికారులు, కాంట్రాక్టర్ల చేతివాటం

ఖరీఫ్‌ ప్రారంభానికి ముందు ఏర్పాటు చేయకుంటే సాగు కష్టమే!

ఖరీఫ్‌ సీజన్‌ తరుముకొస్తోంది. వచ్చే నెల ప్రారంభం నుంచి రైతులు సాగుకు సమాయత్తమవుతారు. ఈ సమయంలో వారిని ట్రాన్స్‌ఫార్మర్‌ కష్టాలు వెంటాడుతున్నాయి. వేలాది సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నా ప్రభుత్వం వందల సంఖ్యలో మాత్రమే మంజూరు చేస్తోంది. క్షేత్రస్థాయిలో వాటిని ఏర్పాటు చేసే క్రమంలో మెటీరియల్‌ కూడా పూర్తిస్థాయిలో ఇవ్వకపోతుండడంతో రైతులు మరికొంత మేర ఆర్థిక కష్టాలు పడాల్సివస్తోంది. అధికారులు, కాంట్రాక్టర్ల చేతివాటం కూడా అదనపు భారమవుతోంది. దీంతో దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఒక నెల దాటిన తర్వాత ప్రభుత్వం ట్రాన్స్‌ఫార్మర్‌లు మంజూరు చేసినా పంటల సాగు ప్రారంభమై వాటిని పొలాల్లోకి తీసుకెళ్లడం కష్టమవుతుంది. సాధ్యమైన మేర ఖరీఫ్‌ ప్రారంభానికి ముందే ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేస్తేనే ఈ సంవత్సరమైనా డీప్‌బోర్ల ద్వారా వ్యవసాయం చేయగలుగుతామని రైతులు అంటున్నారు.

మార్కాపురం, మే 26 (ఆంధ్రజ్యోతి) : పశ్చిమ ప్రకాశం.. జిల్లాలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతం. రైతులు వర్షాధారంపై ఆధారపడి వ్యవసాయం చేస్తుంటారు. లేకుంటే పొట్టచేతపట్టుకొని వలసబాట పడతారు. దశాబ్దాల నుంచి ఇదే పరంపర కొనసాగుతోంది. ఇతర వనరులు కూడా ఈ ప్రాంతంలో మృగ్యమే. ముఖ్యంగా వ్యవసాయం చేయాలంటే డీప్‌ బోరు బావులే దిక్కు. అది కూడా ఆరు వందల నుంచి వెయ్యి అడుగుల లోతులో ఉండే భూగర్భ జలాలను డీప్‌బోర్ల ద్వారా ఒడిసిపట్టి ముందుకు సాగాల్సిందే. గిట్టుబాటు ధరల మాట అటుంచితే.. కష్ట, నష్టాల సాగు ఈ ప్రాంత కర్షకులను ఏటా కన్నీరే పెట్టిస్తోంది. ఇన్ని ప్రతికూలతల మధ్య కాడి పడేయలేక సాగుకోసం అష్టకష్టాలు పడుతుంటే.. విద్యుత్‌ శాఖ పశ్చిమ రైతులపై శీతకన్ను వేస్తోంది. బోరుబావుల ద్వారా వ్యవసాయం చేసుకునేందుకు విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ల కోసం సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నా కనికరం కరువవుతోంది.

డీడీలు కట్టినా మంజూరుకాని వైనం

వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్ల కోసం జిల్లావ్యాప్తంగా 3,500 మంది రైతులు డీడీలు తీసి ఏడాదిగా ఎదురుచూస్తున్నారు. వాటిల్లో పశ్చిమ ప్రకాశంలోనే రెండు వేలకుపైగా ఉన్నాయి. ఈ మధ్యనే జిల్లాకు 300 ట్రాన్స్‌ఫార్మర్లు మంజూరయ్యాయి. వాటిల్లో 150 వరకు మాత్రమే మార్కాపురం డివిజన్‌కు కేటాయించారు. ఇంకా వేల సంఖ్యలోనే దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. గతంలో హెచ్‌వీడీఎ్‌స పథకంలో 100, 60 కేవీ ట్రాన్స్‌ఫార్మర్ల స్థానంలో 16, 25 కేవీ ట్రాన్స్‌ఫార్మర్లు రైతులకు ఎలాంటి ఆర్థిక భారం లేకుండా ఏర్పాటు చేశారు. కేవలం పాత వ్యవసాయ వినియోగదారులకే ఈ పథకం వర్తించింది. నూతనంగా డీప్‌బోర్లు వేసుకుని కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు కావాల్సిన వాళ్లు రూ.9,500 వరకు విద్యుత్‌శాఖకు డీడీ తీయాల్సివుంది. 16 కేవీ కావాలంటే రెండు డీడీలు, 25 కేవీకి మూడు డీడీలు తీయాలి. ఈ లెక్కన ఒక్క పశ్చిమ ప్రకాశంలోనే విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్ల కోసం దాదాపు రెండువేల మందికి వరకూ రైతులు రూ.30 కోట్లకుపైగా డీడీల రూపంలో విద్యుత్‌శాఖకు చెల్లించి ఏడాదిగా నిరీక్షిస్తున్నారు. ప్రభుత్వం నుంచి అవసరమైన మేర ట్రాన్స్‌ఫార్మర్‌లు సరఫరా కావడం లేదు. సరైన సమయంలో మెటీరియల్‌ అందకపోవడంతో జిల్లా అధికారులు సైతం రైతులకు న్యాయం చేయలేకపోతున్నారు.

అదనపు వసూళ్లతో మరింత భారం

రైతులకు విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ కావాలంటే కేవలం డీడీలు తీస్తేనే సరిపోదు. కిందిస్థాయి నుంచి పై స్థాయి వరకు అందరికీ చేతులు తడపాల్సిందే. రమారమి ఒక్కో ట్రాన్స్‌ఫార్మర్‌కు డీడీలకు చెల్లించింది కాక మరో రూ.20వేల వరకు లంచాలు ఇస్తేనే పొలంలోకి చేరుతుంది. గ్రామస్థాయిలో ఉండే లైన్‌మన్‌ నుంచి మొదలుకొని అందరికీ అదనపు చెల్లింపుల్లో వాటాలు సర్వసాధారణం. అన్నీ సజావుగా ఉండి ట్రాన్స్‌ఫార్మర్‌ మంజూరైనా మెటీరియల్‌ పూర్తిస్థాయిలో రాలేదని కాంట్రాక్టర్‌లు కొర్రీలు వేస్తున్నారు. కొంత సామగ్రి ప్రైవేటుగా కొనుగోలు చేయాలని రైతులపై అదనపు భారాన్ని వేస్తున్నారు. అదనపు మెటీరియల్‌ పేరుతో ఎంతలేదన్నా మరో రూ.5వేల వరకు అధికంగా రైతులు ఖర్చు పెట్టాల్సివస్తోంది.

Updated Date - May 27 , 2025 | 01:34 AM