వేర్వేరు ఘటనల్లో ముగ్గురు మృతి
ABN, Publish Date - May 20 , 2025 | 11:20 PM
వేర్వేరు ఘటనల్లో ముగ్గురు మృతిచెందారు
హైవేలో కారు బోల్తా ఒకరు మృతి
మేదరమెట్ల, మే 20 (ఆంధ్రజ్యోతి) : మేదరమెట్ల జాతీయ రహదారిపై తిరుమల వెళ్లి వస్తున్న కారు వే గం అదుపు కాక రోడ్డు మార్జిన్‌లో బోల్తా పడింది. మంగళవారం ఉదయం ఏలూరు జిల్లా దెందులూరు మండ లం కోవల్లి గ్రామానికి ఏడుగురు తిరుపతికి వెళ్లి తిరిగి వస్తూ మేదరమెట్ల ఫ్లైఓవర్ దాటాకా కారు వేగం అదుపు కాకా రోడ్డు మార్జిన్‌లో బోల్తాపడింది. కారులోని సుంకర నాగరాజు(21) అక్కడికక్కడే మృతి చెందాడు. కారు డ్రైవర్ పూజారా లక్ష్మణరావు, మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ఎస్‌ఐ షేక్ మహమ్మద్ రఫీ సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.
విద్యుత్ షాక్‌తో మహిళ మృతి
యద్దనపూడి/మార్టూరు మే 20 (ఆంధ్రజ్యోతి) : యద్దనపూడి మండలం యనమదల గ్రామంలో మేడిశెట్టి సుబ్బాయమ్మ(60) అనే మహిళ విద్యుత్ షాక్‌కు గురై మృతిచెందింది. మృతురాలికి భర్త యలమంద, ఒక కుమారుడు రాంబాబు ఉన్నారు. ఆమె భర్త, కుమారుడు, కోడలుతో కలిసి యనమదల గ్రామంలో ఒక రైస్ మిల్లును నడుపుతున్నారు. అదేవిధంగా ఉదయం మిల్లు నుంచి బయటకు వచ్చిన ఆమె కాలకృత్యాలకు ఒక ఇంటి ప్రహరీ పక్క నుంచి వెళుతూ అక్కడ ఉన్న ఇనుపరాడ్‌ను పట్టుకోగా విద్యుత్ రావడంతో షాక్‌కు గురై అక్కడకక్కడే చనిపోయింది. ఈ ప్రమాదంపై కుమారుడు రాంబాబు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా ఎస్సై రత్నకుమారి సంఘటనా స్థలానికి వచ్చి ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్టూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వాస్తవంగా యద్దనపూడి మండలం కటావారిపాలేనికి చెందిన సుబ్బాయమ్మ కుటుంబం ఎనిమిదేళ్ల క్రితం యనమదల గ్రామానికి వచ్చి ఒక రైస్‌మిల్లును అద్దెకు తీసుకొని నడుపుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అప్పుల భారంతో వ్యక్తి బలవన్మరణం
వేటపాలెం/చీరాల, మే20 (ఆంధ్రజ్యోతి) : మద్యానికి బానిసగా మారి వ్యక్తి బలవన్మరణం చెందిన సంఘటన మంగళవారం వేటపాలెం మండల పరిధిలోని కొత్తపేట టైలర్స్ కాలనీలో చోటుచేసుకుంది. రెండో పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కాలనీకు చెందిన బాలకృష్ణ(40) అప్పుడప్పుడు సోడా బండి నిర్వహిస్తూ ఈపూరుపాలెంలో ఓ టిఫిన్ హోటల్లో పనిచేస్తుంటాడు. ఇతనికి భార్య ధనలక్ష్మీ ఇరువురు కుమారులు ఉన్నారు. ఇటీవల ఇతను మద్యానికి బానిసగా మారాడు. ఈక్రమంలోనే అప్పుల పాలయ్యాడు. దీంతో ఇంటిని అమ్మాలని భార్యను అడగడంతో మనస్పర్థలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో సోమవారం అర్ధరాత్రి ఇంట్లో ఉరికి పాల్పడి బలవన్మరణం చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహానికి పోస్ట్‌మార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.
Updated Date - May 20 , 2025 | 11:20 PM