పేలుడు పదార్థాల కేసులో.. ముగ్గురు అరెస్ట్
ABN, Publish Date - Apr 22 , 2025 | 11:49 PM
అక్రమ పేలుడు పదార్థాలను నిల్వ ఉంచడం, వాటి కొనుగోలు, అమ్మకాలు చేసిన కేసులో మంగళవారం ముగ్గురిని అరెస్టు చేశారు. ప్రత్యేక పోలీసు బృందాలు మంగళవారం తెలంగాణలో నాగండ్ల ప్రసన్న, బత్తుల సాంబశివరావు, ప్రతాప్ రెడ్డి అనే ముగ్గురిని అదుపులోకి తీసుకోగా అరెస్టు చేసిన వారి సంఖ్య మొత్తం ఐదుగురికి చేరింది.
ఐదు టన్నుల సరుకు స్వాధీనం
తెలంగాణలోని చౌటుప్పల్ కోర్టులో తొలుత హాజరు
నేడు అద్దంకి కోర్టుకు
మార్టూరు, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి) : అక్రమ పేలుడు పదార్థాలను నిల్వ ఉంచడం, వాటి కొనుగోలు, అమ్మకాలు చేసిన కేసులో మంగళవారం ముగ్గురిని అరెస్టు చేశారు. ప్రత్యేక పోలీసు బృందాలు మంగళవారం తెలంగాణలో నాగండ్ల ప్రసన్న, బత్తుల సాంబశివరావు, ప్రతాప్ రెడ్డి అనే ముగ్గురిని అదుపులోకి తీసుకోగా అరెస్టు చేసిన వారి సంఖ్య మొత్తం ఐదుగురికి చేరింది. ఇప్పటికే ఈ కేసులో కీలకసూత్రధారి మండలంలోని నాగరాజుపల్లి గ్రామానికి చెందిన వైసీపీ నేత దాసం హనుమంతురావుతోపాటు, అతని బంధువు దాసం వీరాంజనేయులను మార్టూరు పోలీసులు అరెస్టు చేసి అద్దంకి కోర్టులో హాజరుపరచి దర్శి జైలుకు తరలించారు. అదేవిధంగా ఈ కేసులో కీలకమైన వ్యక్తులను అదుపులోకి తీసుకోవాలని, హనుమంతరావు దగ్గర కొనుగోలు చేసిన అక్రమ పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకోవాలనే కారణంతో ఎస్పీ తుషార్ డూడీ ఆదేశాల మేరకు ఆదివారం ప్రత్యేక బృందాలు తెలంగాణ రాష్ట్రానికి వెళ్లారు. ఈ ప్రత్యేక బృందాలు పూర్తిస్థాయిలో విచారణ చేసి సోమవారం రాత్రి యాదాద్రి భువనగిరి జిల్లాలో పోచారం మండలం దేశ్‌ముఖ్ గ్రామ పంచాయతీలో ముగ్గురు నిందితులు నాగరాజుపల్లి గ్రామానికి చెందిన నాగండ్ల ప్రసన్నను, మిగిలిన ఇద్దరు బత్తుల సాంబశివరావు, ప్రతా్‌పరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు. ప్రతాప్ రెడ్డి కొనుగోలు చేసి భూమిలో దాచి ఉంచిన ఐదు టన్నుల పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం చౌటుప్పల్ పరిధిలో కోర్టులో ముగ్గురు నిందితులను, సరుకును హాజరుపరచారు. అనంతరం ముగ్గురు నిందితులను ట్రాన్సిట్ వారెంట్‌పై మార్టూరు స్టేషన్‌లో నమోదు చేసిన కేసులో బుధవారం అద్దంకికి తీసుకువచ్చి కోర్టులో హాజరుపరచనున్నారు.
సూత్రధారి ప్రతాప్ రెడ్డి
తెలంగాణలో కొండలను పగులగొట్టి నేలను చదును చేసే కాంట్రాక్టర్‌గా ఉన్న ప్రతాప్ రెడ్డి నాగరాజుపల్లి గ్రామంలోని దాసం హనుమంతరావు దగ్గర ప్రేలుడు పదార్థాలను కొనుగోలు చేయడానికి బత్తుల సాంబశివరావు సహకరించారు. అక్రమ పేలుడు పదార్థాలను తక్కువ ధరకు హనుమంతరావు నుంచి ప్రతాప్ రెడ్డి కొనుగోలు చేసే విధంగా బత్తుల సాంబ శివరావు కథ నడిపారు. ఈ మేరకు ఇప్పటికి రెండుసార్లు ఈ విధంగా ప్రతా్‌పరెడ్డి సరుకును కొనుగోలు చేశారు. అందులో భాగంగానే ఈ నెల 18 వతేదీన తెలంగాణ రాష్ట్రం నుంచి కొనుగోలు చేసి నాగరాజుపల్లి గ్రామానికి తీసుకువస్తున్న పేలుడు పదార్థాలలో కొంత భాగాన్ని ప్రతా్‌పరెడ్డి కొనుగోలు చేసే విధంగా సాంబశివరావు సహకరించారు. అదేవిధంగా లారీలో పేలుడు పదార్థాలను రవాణా చేయడం, సరుకును తీసుకువెళ్లడంలో సహకరించిన నాగండ్ల ప్రసన్నను పోలీసులు నిందితునిగా చేర్చారు. ఇదిలావుండగా శనివారం నాగరాజుపల్లిలోని హనుమంతురావు గోడౌన్‌పై పోలీసులు తనిఖీలు చేయడంతో, ఈవిషయం తెలుసుకున్న ప్రతాప్ రెడ్డి అప్రమత్తమై సరుకును భూమిలో దాచి ఉంచారు. అయితే తెలంగాణ వెళ్లిన ప్రత్యేక బృందాలు సరుకుతోపాటు, ముగ్గురు నిందితులను కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ విషయమై సీఐ ఎం.శేషగిరిరావుతో ఆంధ్రజ్యోతి మాట్లాడగా తెలంగాణలో ముగ్గురు నిందితులను అరెస్ట్ట్ చేశామన్నారు. వారిని బుధవారం అద్దంకి కోర్టులో హాజరుపరచడానికి తెలంగాణ నుంచి మార్టూరు స్టేషన్‌కు తీసుకువస్తున్నాయన్నారు. ఈ కేసులో 6 గురు నిందితులల్లో ఇప్పటికి ఐదుగురిని అరెస్ట్ట్ చేశామని తెలిపారు.
Updated Date - Apr 22 , 2025 | 11:49 PM