ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఉద్యోగుల బదిలీలకు రంగం సిద్ధం

ABN, Publish Date - May 28 , 2025 | 01:35 AM

ప్రభుత్వ శాఖల్లో పనిచేసే ఉద్యోగుల బదిలీలకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే అఽధికారులు నియోజకవర్గాల వారీగా జాబితాలను సిద్ధం చేశారు. ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా బదిలీలను చేపట్టనున్నారు.

ఐదేళ్లు దాటితే తప్పనిసరి మార్పు

ఇప్పటికే ఆయా శాఖలకు సిఫార్సు లేఖలు

మహానాడు అనంతరం ప్రక్రియ జరిగే అవకాశం

తప్పులు దొర్లకుండా కలెక్టర్‌ ప్రత్యేక దృష్టి

వైద్యశాఖకు నేడో, రేపో మార్గదర్శకాలు

ఒంగోలు కలెక్టరేట్‌, మే 27 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ శాఖల్లో పనిచేసే ఉద్యోగుల బదిలీలకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే అఽధికారులు నియోజకవర్గాల వారీగా జాబితాలను సిద్ధం చేశారు. ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా బదిలీలను చేపట్టనున్నారు. రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గతేడాది సెప్టెంబరులో కొన్ని శాఖల్లో మాత్రమే ఉద్యోగుల బదిలీలను చేపట్టింది. అందులో కొన్ని డిపార్ట్‌మెంట్‌లలో అనేక అక్రమాలు చోటుచేసుకోవడంతో పెద్దఎత్తున దూమారం రేగింది. జిల్లా పంచాయతీ శాఖలో గ్రేడ్‌-5, 6 కార్యదర్శుల బదిలీల్లో జరిగిన అక్రమాలతో అప్పటి ఇన్‌చార్జి డీపీవోతోపాటు మరో ముగ్గురు ఉద్యోగులు సస్పెండ్‌ అయిన విషయం విదితమే. ఇప్పుడు ప్రభుత్వం పలు మార్గదర్శకాలతో బదిలీలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో అటువంటి తప్పిదాలకు తావులేకుండా ఆయా శాఖల అధికారులకు కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా దిశానిర్దేశం చేశారు. దీంతో తదనుగుణంగా బదిలీలు చేసేందుకు శ్రీకారం చుట్టారు. గతేడాది పరిమితంగా కేవలం 15 శాఖల్లో మాత్రమే బదిలీలు చేపట్టగా ప్రస్తుతం అన్నిశాఖల్లో ఈ ప్రక్రియ జరగనుంది.

సిఫార్సు లేఖల జోరు

ఒకేచోట ఐదేళ్లు పనిచేసిన ఉద్యోగులను తప్పనిసరిగా బదిలీ చేయాల్సి ఉంది. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల వారీగా ముఖ్యనాయకుల నుంచి సిఫార్సు లేఖలు కూడా అధికారులకు అందాయి. ఆయా శాఖల్లో ఏ ఉద్యోగి ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు, నూతన ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించకుండా ఉన్న వారి జాబితాలను సిద్ధం చేశారు. అటువంటి వారందరినీ కూడా ఈసారి బదిలీ చేయనున్నారు. ఇంకోవైపు ఉద్యోగులు తమకు అనుకూలమైన ప్రాంతాలకు బదిలీ అయ్యేందుకు ప్రజాప్రతినిఽధుల నుంచి ప్రత్యేకంగా సిఫార్సు లేఖలను కూడా తెచ్చుకొని అధికారులకు ఇస్తున్నారు.

పంచాయతీలపై ప్రత్యేక దృష్టి

పంచాయతీరాజ్‌, రెవెన్యూ, జిల్లా పరిషత్‌, ఇంజనీరింగ్‌, ఇరిగేషన్‌ వంటి శాఖల్లో బదిలీలు భారీగా జరగనున్నాయి. గతేడాది జరిగిన బదిలీల్లో జిల్లా పంచాయతీలో అప్పటి ప్రజాప్రతినిధుల సిఫార్సులకు అనుగుణంగా బదిలీలు జరక్కపోగా అప్పటి అధికారి, సిబ్బంది ఇష్టానుసారంగా బదిలీల ఉత్తర్వులు ఇచ్చారు. దీనిపై కలెక్టర్‌ సమగ్ర విచారణకు అదేశించారు. ఇందులో సుమారు 140మందికిపైగా ఉద్యోగులకు నిబంధనలకు విరుద్ధంగా స్థానచలనం కల్పించినట్లు తేలింది. ప్రస్తుత బదిలీల్లో అటువంటి తప్పిదాలు జరగకుండా ఆ శాఖ అధికారి ఇప్పుడు ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం.

మార్గదర్శకాలు అందలేదు

వైద్యారోగ్యశాఖలో గత ఏడాది బదిలీలు జరగ లేదు. ప్రస్తుతం ఆ శాఖలో కూడా భారీగా డాక్టర్లు, ఉద్యోగుల మార్పులు జరగనున్నాయి. ప్రభుత్వం బదిలీలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినా ఇంకా ఆ శాఖ నుంచి మార్గదర్శకాలు రాలేదు. అవి వచ్చిన వెంటనే ప్రక్రియ ప్రారంభించనున్నారు. ఇక రెవెన్యూలో కూడా తహసీల్దార్‌ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగుల బదిలీలు జరగనున్నాయి. ఇప్పటికే ఉద్యోగులు తమకు అనుకూలమైన స్థానాలు పొందేందుకు సిఫార్సు లేఖలను తెచ్చుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం అధికార పార్టీ ప్రజాప్రతినిధులంతా కడపలో జరుగుతున్న మహానాడులో ఉన్నారు. అది ముగిసిన అనంతరం ఉద్యోగుల బదిలీలకు సంబంధిత శాఖల అధికారులు శ్రీకారం చుట్టే అవకాశం కనిపిస్తోంది.

Updated Date - May 28 , 2025 | 01:35 AM