సీజన్ సానుకూలం
ABN, Publish Date - Jun 11 , 2025 | 01:19 AM
జిల్లాలో ఈ ఏడాది ఏరువాక సాగుకు సానుకూల వాతావరణం కనిపిస్తోంది. పంటల సాగులో ఏరువాకకు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. ఏటా ఆ రోజున రైతులు సాగు ప్రారంభిస్తారు. ప్రస్తుతం మారిన కాలమాన పరిస్థితుల్లో ఏరువాక ఉత్సవానికి గతంలో వలే ప్రాభవం లేకపోయి నప్పటికీ ఆ సమయానికి సాగుకు సన్నద్ధం కావడం రైతులు ఇప్పటికీ పాటిస్తున్నారు.
సాగుకు రైతుల సన్నద్ధం
పలుచోట్ల దుక్కుల దున్నకం
మరో వర్షం కురిస్తే విస్తారంగా పైర్లు
నేడు ఏరువాక పౌర్ణమి
ఒంగోలు-2 పొగాకు వేలం కేంద్రం వద్ద ఉత్సవానికి ఏర్పాట్లు
మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరు
ఒంగోలు, జూన్ 10 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో ఈ ఏడాది ఏరువాక సాగుకు సానుకూల వాతావరణం కనిపిస్తోంది. పంటల సాగులో ఏరువాకకు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. ఏటా ఆ రోజున రైతులు సాగు ప్రారంభిస్తారు. ప్రస్తుతం మారిన కాలమాన పరిస్థితుల్లో ఏరువాక ఉత్సవానికి గతంలో వలే ప్రాభవం లేకపోయి నప్పటికీ ఆ సమయానికి సాగుకు సన్నద్ధం కావడం రైతులు ఇప్పటికీ పాటిస్తున్నారు. అలా ఈ ఏడాది ఏరువాక పౌర్ణమి బుధవారం రాగా ఇప్పటికే జిల్లాలో పంటల సాగుకు సానుకూల వాతావరణం ఏర్పడింది. హిందూమత విశ్వాసాల ప్రకారం జ్యేష్ట పౌర్ణమిని ఏరువాక పౌర్ణమిగా పరిగణిస్తారు.. ఆరోజు అత్యంత శుభప్రదంగా రైతులు భావించి పంటల సాగుకు ఉపక్రమిస్తారు. ఏరువాక నాడు ఎద్దులతో అరకలు కట్టి పొలాల దున్నకం ప్రారంభిస్తే పంటలు బాగా పండుతాయన్నది రైతుల నమ్మకం. శాస్త్రాలు, ఆచారాలు అలా ఉంచితే మారుతున్న వ్యవసాయ పద్ధతులు, రైతాంగంలో వచ్చిన మార్పులతో ఎద్దులు మాయమైపోవడంతో ఏరువాక సంబరాలు తగ్గాయి. అయితే జూన్‌లో వచ్చే పౌర్ణమి ఏరువాక పౌర్ణమి కాగా అప్పటి నుంచి ఖరీఫ్ సీజన్ పనులు ప్రారంభమవుతాయి. గత ఏడాది జూన్ 21న రాగా ఈసారి పదిరోజుల ముందుగానే వచ్చింది. జిల్లాలో ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం సుమారు 2.02 లక్షల హెక్టార్లు కాగా అందులో సుమారు 75వేల హెక్టార్లలో ప్రధాన పంట అయిన కంది వేస్తారు. 30వేల హెక్టార్లలో పత్తి సాగు చేస్తారు. ఆ రెండే సగం విస్తీర్ణం కాగా ఏరువాక నుంచి దుక్కులు దున్ని నెలాఖరు నుంచి విత్తనం వేస్తారు. అదేసమయంలో ఏరువాక సమీపించే వారం, పది రోజుల ముందు నుంచే జిల్లాలో కొద్దిపాటి జల్లులు పడితే తొలకరి పైర్లుగా పిలిచే నువ్వు, సజ్జ, పెసరలతోపాటు జీలుగ, జనుము, పిల్లిపెసర వంటి పచ్చిరొట్ట అలాగే పశుగ్రాస పంటలు వేస్తారు. ఒక్కో ఏడాది వాతావరణం అనుకూలించక వర్షాలు పడకపోతే ఆ పైర్లు ఆగిపోతాయి. అయితే ఈ ఏడాది జిల్లాలో ఏరువాక నాటికి పంటల సాగుకు వాతావరణం అనుకూలంగా ఉంది.
చాలావరకు నువ్వు చల్లారు..
పొగాకు విస్తారంగా సాగు చేసే కొండపి, సంతనూతలపాడు నియోజకవర్గాల్లో ప్రస్తుతం నువ్వు విత్తనం చల్లారు. దర్శి ప్రాంతంలో పెసర, పశ్చిమప్రాంతంలో సజ్జ విత్తనం కొంతమేర వేశారు. అలాగే పశ్చిమాన బోర్లు ఉన్న దగ్గర మరింతగా పంటలు వేస్తున్నారు. చాలాచోట్ల గతనెలలో కురిసిన వర్షాలతో దుక్కులు దున్ని భూములు సాగుకు సిద్ధం చేశారు. అలా ఏరువాక సమయానికి అనుకూల వాతావరణంతో రైతులలో సాగుపై కొంత ఉత్సాహం కనిపిస్తోంది. జిల్లాలోని పలుప్రాంతాల్లో బుధవారం ఏరువాకను నిర్వహించనున్నారు.
నేడు త్రోవగుంటకు మంత్రులు, ఎమ్మెల్యేలు
ఒంగోలు-2పొగాకు వేలం కేంద్రం వద్ద ఏటా ఏరువాక రోజున అరకలు కట్టి పొలం దున్ని ఉత్సవం చేస్తారు. అలా ఈ ఏడాది కూడా నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు డాక్టర్ స్వామి, గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, బీఎన్ విజయకుమార్, ఏలూరి సాంబశివరావు తదితరులు హాజరవుతున్నట్లు సమాచారం. పొగాకు రైతు సమస్యలపై రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించిన నేపథ్యంలో ఆ అంశాలను కూడా రైతులకు వివరించేందుకు వారంతా వస్తున్నట్లు సమాచారం.
Updated Date - Jun 11 , 2025 | 01:19 AM