చేపల కోసం చెరువు ఖాళీ!
ABN, Publish Date - Jul 20 , 2025 | 11:24 PM
నిండు కుండలా ఉన్న సంతనూతలపాడు పెద్దచెరువు నెలరోజుల్లోనే ఖాళీ అయ్యింది. చెరువులో చేపలు పెంచే కాంట్రాక్టర్‌తో పాలకులు కుమ్మక్కవడమే కారణమన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
నీటిని బయటకు వదిలే విషయమై సమాచారం లేదంటున్న సర్పంచ్
షట్టర్‌లు ఎవరు ఎత్తారో తెలియదంటున్న ఇరిగేషన్ జేఈ
లక్షల్లో చేతులు మారినట్లు ఆరోపణలు
సంతనూతలపాడు, జూలై 20 (ఆంధ్రజ్యోతి) : నిండు కుండలా ఉన్న సంతనూతలపాడు పెద్దచెరువు నెలరోజుల్లోనే ఖాళీ అయ్యింది. చెరువులో చేపలు పెంచే కాంట్రాక్టర్‌తో పాలకులు కుమ్మక్కవడమే కారణమన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంలో రూ.లక్షలు చేతులు మారినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నీటిని బయటకు వదిలే విషయం తమకు తెలియదని అటు పంచాయతీ సర్పంచ్, ఇటు ఇరిగేషన్ అధికారి చెప్తుండటం విస్మయం కలిగిస్తోంది. పెద్దచెరువులోని నీరు సాగుకోసమే అయినా మత్స్యశాఖ అనుమతితో ప్రభుత్వ నిబంధనల ప్రకారం టెండర్ ద్వారా లీజు పొంది చేపల పెంచుకునే అవకాశం ఉంది. అవసరమైనప్పుడు పంటల సాగుకు నీటిని విడుదల చేయాలి. ఇదే చెరువు కింద నాలుగు పెద్ద ఊట బావులు ఉన్నాయి. వీటి ఆధారంగా సంతనూతలపాడు ప్రజలకు తాగునీటిని సరఫరా చేస్తున్నారు.
లీజుదారుడి ఇష్టారాజ్యం
పెద్దచెరువులో చేపల పెంపకం లీజు దక్కించుకున్న కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడు. చెరువు షట్టర్‌లకు సంబంధించిన లాక్‌ను తన వద్దనే ఉంచుకొని అవసరమైన సమయంలో యథేచ్ఛగా నీటిని బయటకు వదులుతున్నారు. నెల క్రితం నిండుగా ఉన్న చెరువు దశల వారీగా ఖాళీ చేశాడని ప్రజలు చెబుతున్నారు.
ప్రజలకు నీటి ఇక్కట్లు
పెద్దచెరువులో నీరు ఖాళీ అవడంతో ప్రజలకు తాగునీటి ఇక్కట్లు ఏర్పడ్డాయి. బావుల్లో ఊట రాక 15 రోజులకు ఒకసారి కూడా నీటిని విడుదల చేయడంలేదు. చెరువులోని నీటిని బయటకు వదిలిన విషయమై పంచాయతీ పాలకులు, సంబంధిత అధికారులను ప్రశ్నిస్తే నీళ్లు నములుతున్నారు.
రాత్రివేళ ఎవరు వదులుతున్నారో తెలియదు
వి.వెంకటేశ్వరరెడ్డి, ఇరిగేషన్ జేఈ
చెరువులో నీటిని బయటకు పంపుతున్న విషయం తెలిసిన వెంటనే వెళ్లి లాకులను దించాం. రాత్రివేళ ఎవరు చెరువు షట్టర్‌లను ఎవరు ఎత్త్తుతున్నారో తెలియదు. లీజుదారుడిపై అనుమానంతో మత్స్యశాఖ అధికారులకు ఫిర్యాదు చేశా. నీటి సంఘం వాళ్లకు చెబితే తెలియని సమాధానం ఇచ్చారు.
నాకు తెలియదు
దరిశి నాగమణి, సర్పంచ్
చెరువులోని నీటిని బయటకు పంపిన విషయం తెలియదు. ప్రజల ద్వారా నా దృష్టికి వచ్చింది. పంచాయతీ కార్యదర్శికి చెప్పా. ఆయన అసలు చెరువులో చేపలు పట్టే విషయమే తెలియదని సమాధానమిచ్చారు.
Updated Date - Jul 20 , 2025 | 11:24 PM