వీడుతున్న రాజా హత్య కేసు చిక్కుముడి
ABN, Publish Date - Jun 08 , 2025 | 11:38 PM
ఒంగోలు రూరల్ మండలం ముక్తినూతలపాడులో జరిగిన కారు డ్రైవర్ బోడపాటి ద్రోణాచలం అలియాస్ రాజా దారుణ హత్య కేసులో చిక్కుముడి వీడుతోంది.
పోలీసుల అదుపులో ఇరువురు నిందితులు
బాలిక విషయంలో వివాదమే కారణం?
ఒంగోలు క్రైం, జూన్ 8 (ఆంధ్రజ్యోతి) : ఒంగోలు రూరల్ మండలం ముక్తినూతలపాడులో జరిగిన కారు డ్రైవర్ బోడపాటి ద్రోణాచలం అలియాస్ రాజా దారుణ హత్య కేసులో చిక్కుముడి వీడుతోంది. ఇప్పటికే ఇరువురిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మరో ముగ్గురు పాత్రపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బెంగళూరులో కారుడ్రైవర్‌గా పనిచేసే రాజాకు ముక్తినూతలపాడుకు చెందిన పాతపాటి శ్రీహరి మధ్య మనస్పర్థలు ఉన్నాయి. బుల్లెట్ షోరూంలో మెకానిక్‌గా పనిచేసే శ్రీహరి ఓ మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు సమాచారం. ఆ బాలిక తమ బంధువు కావడంతో రాజా పలుమార్లు శ్రీహరిని హెచ్చరించినట్లు తెలిసింది. దీంతో వీరి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయని సమాచారం. ఇటీవల స్వగ్రామం వచ్చిన రాజా ఈనెల 5న మద్యం సేవిస్తూ శ్రీహరిని కూడా పిలిచినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో శ్రీహరి తన నలుగురు స్నేహితులను కూడా వెంటబెట్టుకుని రాజా వద్దకు వెళ్లాడు. శ్రీహరి, అతని స్నేహితులను చూడగానే అనుమానంతో రాజా కొంతమందికి ఫోన్లు చేసినట్లు తెలిసింది. నన్ను కొట్టడానికి మనుషులను శ్రీహరి తీసుకొచ్చినట్లు కూడా చెప్పినట్లు సమాచారం. అప్పటికే మద్యం మత్తులో ఉన్న రాజా మాటలను ఫోన్‌లో ఉన్న వారు పట్టించుకోలేదు. అప్పటికే మద్యం తాగిన రాజాకు మరింతగా తాగించి అతను స్పృహ తప్పిపడిపోయేలా చేశారు. ఆ వెంటనే వారు రాజాపై పెట్రోలు పోసి తగులబెట్టినట్లు పోలీసుల విచారణలో ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం.
పోస్టుమార్టం అనంతరం మృతదేహం అప్పగింత
రాజా మృతదేహనికి ఒంగోలు రిమ్స్‌లో డాక్టర్లు పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం పోలీసులు.. రాజా మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. అయితే రాజా మృతదేహంపై కాల్చిన గాయాలు కూడా ఉన్నట్లు తెలిసింది. ఈ హత్య కేసులో ఎవరి పాత్ర ఎంత అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.
Updated Date - Jun 08 , 2025 | 11:38 PM