సౌకర్యాలు సరే.. వైద్యులేరి..?
ABN, Publish Date - Jul 18 , 2025 | 11:25 PM
జిల్లాలో అత్యంత వెనుకబడిన ప్రాంతం మార్కాపురం డివిజన్. ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం కావాలంటే ఎటుచూసినా 100 కిలోమీటర్లకుపైగా దూరం వెళ్లాల్సిందే.
త్రిశంకుస్వర్గంలో మార్కాపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి
బదిలీపై వెళ్లిపోయిన మెడికల్ కాలేజీ సిబ్బంది
మార్కాపురం, జూలై 18(ఆంధ్రజ్యోతి): జిల్లాలో అత్యంత వెనుకబడిన ప్రాంతం మార్కాపురం డివిజన్. ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం కావాలంటే ఎటుచూసినా 100 కిలోమీటర్లకుపైగా దూరం వెళ్లాల్సిందే. ఇంతటి కీలకమైన డివిజన్ కేంద్రం మార్కాపురంలోని ప్రభుత్వ వైద్యశాలలో వైద్యుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఏరియా వైద్యశాల నుం చి జిల్లా వైద్యశాలగా గత టీడీపీ ప్రభుత్వంలో అప్‌గ్రేడ్ చేశారు. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వంలో మెడికల్ కాలేజీ మంజూరు కావడంతో దానికి అనుబంధంగా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిగా రూపాంతరం చెందింది. అప్పట్లో సౌకర్యాలపరంగా ఇబ్బంది ఉన్నా పూ ర్తిస్థాయిలో వైద్యుల బృందం ఉంది. వైసీపీ ప్రభుత్వంలో కాలేజీకి భవనాలు, ఇతర వసతులు సమకూర్చకపోవడంతో ఎన్‌ఎమ్‌సీ (నే షనల్ మెడికల్ కౌన్సిల్) తరగతుల ప్రారంభానికి అనుమతులను నిరాకరించింది. దీంతో బోధన వైద్యశాల సిబ్బంది మొత్తం వెనక్కి వెళ్లిపోయారు. ప్రసుత్తం 23మంది వైద్యులతోనే రోగులకు సేవలందించాల్సిన దుస్థితి నెలకొంది. 350 బెడ్లు, తగినన్ని అధునాతన సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నా స్పెషలిస్తు వైద్యుల కొరత తీవ్రంగా వేఽధిస్తోంది. ఎమర్జెన్సీ కేసులు వస్తే ప్రాథమిక చికిత్స తప్ప ఇక్కడ మెరుగైన వైద్యం అందే పరిస్థితి లేదు. అందుకోసం వందల కిలోమీటర్ల దూరంలోని ఒంగోలు, గుంటూరు, కర్నూలు, విజయవాడలాంటి నగరాలకు వెళ్లాల్సిందే. ప్రజాప్రతినిధులు ఈ సమస్యపై దృష్టిసారించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వైద్యశాలను బలోపేతం చేయాలని డివిజన్ ప్రజలు కోరుతున్నారు.
113 మందికి ప్రస్తుతం ఉంది 23 మంది
వాస్తవానికి మార్కాపురం ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో 350 బెడ్లు, 113 మంది వివిధ విభాగాలకు చెందిన డాక్టర్లు ఉండాలి. కానీ ప్రస్తుతం పనిచేస్తుంది కేవలం 23 మంది మాత్రమే. వారిలో కూడా ముగ్గురు డెంటల్ డాక్టర్లు ఉన్నారు. ప్రతి విభాగానికి సంబందించి 3 నుంచి ఆరుగురు వరకు వైద్యులు ఉండాలి. అంతేకాక జనరల్ మెడిసిన్‌కు తొమ్మిది మంది, జనరల్ సర్జన్‌లు తొమ్మిది మంది చొప్పున ఉండాలి. కానీ ప్రస్తుతం కీలకమైన ఈ విభాగాలకు సంబంధించి ఐదుగురు మాత్రమే అందుబాటులో ఉన్నారు. స్పెషలిస్టు వైద్యుల కొరత ఎక్కువగా ఉండటంతో రాత్రివేళల్లో డ్యూటీ చేస్తే మరుసటి రోజు పగలు ఓపీలో ఉండలేని దుస్థితి ఏర్పడుతోంది. కొన్ని విభాగాలకు సంబంధించి ఒక్కొక్కరు చొప్పున మాత్రమే ఉన్నారు. అత్యంత కీలకమైన ఆర్థోపెడిక్ సర్జన్ ఒక్కరే ఉన్నారు. ప్రమాదాల్లో దెబ్బలు తగిలి ప్రభుత్వ వైద్యశాలకు వస్తే ఆర్థోపెడిక్ అందుబాటులో లేకుంటే ప్రైవేటు వైద్యానికి పరుగులు పెట్టాల్సిన దుస్థితి నెలకొంది.
మొదట్లో 64 మంది అందుబాటులో..
మార్కాపురానికి మెడికల్ కాలేజీ 2021లో మంజూరైంది. అప్పట్లో ఎన్‌ఎంసీ నియమాల మేరకు 350 బెడ్లను 2022కల్లా ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి సుమారు రెండేళ్లపాటు బోధన, వైద్యశాలకు సంబందించిన డాక్టర్లు సుమారు 64మంది అందుబాటులో ఉన్నారు. సౌకర్యాలు లేకపోయినా కనీసం నాడిపట్టే వైద్యుడైనా ఆసుపత్రిలో ఉన్నారు. ఎన్‌ఎంసీ అనుమతులు ఇవ్వక మెడికల్ కాలేజీ వ్యవహారం సందిగ్ధంలో పడటంతో వైద్యారోగ్యశాఖ ఇక్కడి వైద్యులను పలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు బదిలీ చేసింది. దీంతో ప్రస్తుతం వైద్యుల కొరత ఏర్పడింది.
నూతన సౌకర్యాలు ఉన్నా..
ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక ఐసీయూ విభాగం లేకపోవడంతో రోగులు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. ఈ సమస్యను గమనించిన స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. స్వచ్ఛంద సంస్థలు, దాతల సహకారంతో ఒక ఐసీయూ యూనిట్, థైరాయిడ్ మిషన్‌లను ఏర్పాటు చేయించారు. ఇంతవరకు బాగానే ఉన్నా వైద్యుల కొరత నేపథ్యంలో వాటిని ఉపయోగించుకోవడం కష్టతరంగా మారే పరిస్థితి ఉంది. థైరాయిడ్ మిషన్ వద్ద కనీసం ఇద్దరు డాక్టర్లు ఉండాలి. అదేవిధంగా 10 బెడ్ల ఐసీయూ యూనిట్‌కు స్పెషలిస్టు వైద్యులు 10 మంది వరకు కావాల్సి ఉంది. ఇతర నర్సింగ్ స్టాఫ్‌ను ఏదోవిధంగా సర్దుబాటు చేసుకోవచ్చు. వైద్యశాలకు సౌకర్యాలు ఏర్పాటు చేసినా వాటిని సక్రమంగా ఉపయోగించుకోవాలంటే తప్పక తగినంత మంది డాక్టర్లు ఉండాల్సిందే.
Updated Date - Jul 18 , 2025 | 11:25 PM