బాల్యవివాహ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి
ABN, Publish Date - Apr 16 , 2025 | 10:48 PM
బాల్య వివాహ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా చెప్పారు.
కలెక్టర్ తమీమ్ అన్సారియా
ప్రభుత్వ గృహ నిర్మాణ కాలనీని సందర్శించిన కలెక్టర్, ఎమ్మెల్యే
కనిగిరి, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి) : బాల్య వివాహ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా చెప్పారు. పౌష్టికాహార పక్షోత్సవాల్లో భాగంగా కనిగిరి ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం జరిగే సామూహిక సీమంతాల కార్యక్రమంలో కలెక్టర్‌తోపాటు ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి, ఏపీ టూరిజం చైర్మన్ నూకసాని బాలాజీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె గర్భిణులకు సీమంతం చేసి పూలు, పండ్లు, సారె అందించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రాష్ట్రలోనే ప్రకాశం జిల్లాలో ఎక్కువగా బాల్య వివాహాలు జరుగుతున్నట్లు ఆధారాలుఉన్నాయన్నారు. చిన్న వయస్సులోనే వివాహాలు మంచిదికాదని చెప్పారు. ఈ నెల 8 నుంచి 22వ తేదీ వరకు 15రోజులు పాటు పౌష్టికాహార పక్షోత్సవాలు (పోషణ్ పక్వాడ) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రకాశం, మున్సిపల్ చైర్మన్ గఫార్, డీఎ్‌సడీవో, ఎంపీడీవో హనుమంతరావు, సీడీసీవో సరోజిని, సూపర్‌వైజర్ పార్వతమ్మ పాల్గొన్నారు.
ఎస్సీ, బీసీ, ఎస్టీలకు గృహ నిర్మాణ వ్యయం పెంపు : జిల్లా కలెక్టర్
ఎస్సీ, బీసీ, ఎస్టీ వర్గాల వారికి అందించే గృహ నిర్మాణ వ్యయాన్ని ప్రభుత్వం పెంచిందని కలెక్టర్ తమీమ్ అన్సారియా చెప్పారు. పట్టణ పరిధిలోని అర్బన్ హౌసింగ్ కాలనీని ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డితో కలసి సందర్శించారు. గృహ నిర్మాణాల పురోగతి వివరాలను హౌసింగ్ శాఖ అధికారులు నుంచి అడిగి తెలుసుకున్నారు. అర్బన్ హౌసింగ్ కాలనీలో 1390 ప్ల్లాట్లను వేయగా, 544 మందికి ఇళ్లు మంజూరు చేసినట్లు కలెక్టర్‌కు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె లబ్ధిదారులతో మాట్లాడుతూ గృహ నిర్మాణ లబ్దిదారులకు యూనిట్ విలువ రూ.1.80లక్షలకు అదనంగా ఎస్సీ, బీసీలకు రూ.50వేలు, ఎస్టీలకు రూ75వేలు, పీవీటిజి (ఆదివాసి గిరిజనులకు) రూ.1లక్ష చొప్పున ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అదనంగా అందిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో కేశవర్దన్‌రెడ్డి, హౌసింగ్ పీడీ శీనివాసప్రసాద్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు, తహసీల్దార్ రవిశంకర్ పాల్గొన్నారు.
Updated Date - Apr 16 , 2025 | 10:48 PM