టెన్షన్.. టెన్షన్..
ABN, Publish Date - May 28 , 2025 | 01:38 AM
ఉమ్మడి జిల్లాలో జరుగుతున్న ఉపాధ్యాయుల బదిలీల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు టీచర్లను టెన్షన్‌కు గురిచేస్తున్నాయి. ఒకవైపు పాయింట్ల తిరకాసు, మరోవైపు కోరుకున్న స్థానం దక్కుతుందో లేదోనన్న బెంగతో ఒత్తిడికి గురవుతున్నారు.
సెలవు పెడితే నెగటివ్ పాయింట్!
స్టేషన్ పాయింట్లలోనూ తిరకాసు
టీచర్లను పరుగులు పెట్టిస్తున్న అధికారులు
బదిలీల్లో అంతా అయోమయం.. గందరగోళం
ఉమ్మడి జిల్లాలో జరుగుతున్న ఉపాధ్యాయుల బదిలీల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు టీచర్లను టెన్షన్‌కు గురిచేస్తున్నాయి. ఒకవైపు పాయింట్ల తిరకాసు, మరోవైపు కోరుకున్న స్థానం దక్కుతుందో లేదోనన్న బెంగతో ఒత్తిడికి గురవుతున్నారు. బదిలీల్లో కీలకమైన పాయింట్ల కేటాయింపు వ్యవహారం కూడా వారిని కలవరపెడుతోంది. అధికారుల అనుమతితో సెలవుపై వెళ్లిన ఒక గ్రేడ్-2 హెచ్‌ఎంకి నెగటివ్ పాయింట్ కేటాయించినట్లు తెలిసి నివ్వెరపోతున్నారు. స్టేషన్ పాయింట్ల కేటాయింపులో అధికారుల ద్వంద్వవైఖరి టీచర్లను ఆందోళనకు గురిచేస్తోంది. దీనికితోడు కమిషనర్ ప్రకటించిన షెడ్యూల్‌కు భిన్నంగా అధికారులు పరుగులు పెట్టిస్తుండటంతో తలలు పట్టుకుంటున్నారు.
ఒంగోలు విద్య, మే 27 (ఆంధ్రజ్యోతి) : ఒక జడ్పీ హైస్కూల్ హెచ్‌ఎం అధికారుల ముందస్తు అనుమతితో సెలవు పెట్టి విదేశాలకు వెళ్లారు. ప్రస్తుతం జరుగుతున్న బదిలీల కోసం ఆయన దరఖాస్తు చేశారు. అయితే అతనికి రావాల్సిన పాయింట్లతోపాటు ఒక నెగటివ్ పాయింట్‌ను కూడా విద్యాశాఖ అధికారులు కేటాయించారు. దీంతో కంగుతిన్న ఆ హెచ్‌ఎం తాను అధికారుల ముందస్తు అనుమతితోనే సెలవు పెట్టానని, విధులకు గైర్హాజరు కాలేదని మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది. టీచర్ల బదిలీల్లో ఈ సంవత్సరం కొత్తగా నెగటివ్ పాయింట్లు ప్రవేశపెట్టారు. నెలరోజులపాటు ఎటువంటి అనుమతులు లేకుండా విధులకు గైర్హాజరైతే ఒక నెగటివ్ పాయింట్ కేటాయిస్తున్నారు. అయితే ఈ హెచ్‌ఎంకు అన్ని అనుమతులూ ఉండి అధికారులు సెలవు మంజూరుచేసినా కేవలం ఏప్రిల్‌లో ముఖ హాజరు వేయలేదన్న కారణంతో నెగటివ్ పాయింట్ కేటాయించారు. ఈ విషయం తెలియడంతో ఉపాధ్యాయలోకంలో ఆందోళన నెలకొంది.
స్టేషన్ పాయింట్లలో తిరకాసు
టీచర్లకు స్టేషన్ పాయింట్ల కేటాయింపులో కూడా ప్రభుత్వం తిరకాసు పెట్టింది. ఈ ఏడాది బదిలీలకు విద్యా సంవత్సరాన్ని ప్రాతిపాదికగా తీసుకున్నారు. హెచ్‌ఎంలకు ఐదేళ్లు, ఇతర టీచర్లకు ఎనిమిది సంవత్సరాలు గరిష్ఠంగా పూర్తయితే వారు తప్పనిసరిగా బదిలీ కావాల్సిందే. ఒక విద్యా సంవత్సరంలో తొమ్మిది నెలలు పనిచేస్తే దానిని పూర్తి విద్యా సంవత్సరంగా పరిగణిస్తున్నారు. ఏడు సంవత్సరాల పది నెలలు పూర్తయినా ఎనిమిదేళ్లుగా పరిగణించి తప్పనిసరి బదిలీల జాబితాలో చేర్చారు. దీంతో వారు బదిలీకి దరఖాస్తు చేసుకున్నారు. అయితే మొదట ప్రకటించిన ప్రకారం ఎనిమిదేళ్లకు బదిలీ పాయింట్లు కేటాయించాలి. అందుకు భిన్నంగా వీరికి ఏడు సంవత్సరాల పది నెలలకు మాత్రమే స్టేషన్ పాయింట్లు కేటాయించడంతో ఆయా టీచర్లు గగ్గోలు పెడుతున్నారు. అయితే ఒకే స్థానంలో తొమ్మిదేళ్లు పనిచేసిన వారికి ఒక సంవత్సరం తగ్గించి గరిష్ఠంగా ఎనిమిదేళ్లకే పాయింట్లు కేటాయిస్తున్నారు. ఈ ద్వంద్వవైఖరిని టీచర్లు వ్యతిరేకిస్తున్నారు.
పరుగులు పెట్టిస్తున్నారు
బదిలీల కోసం దరఖాస్తు చేసుకున్న హెచ్‌ఎంలు, టీచర్లను అధికారులు పరుగులు పెట్టిస్తున్నారు. పాఠశాల విద్య కమిషర్ విడుదల చేసిన షెడ్యూల్‌కు భిన్నంగా పైఅధికారులు వెబ్ కాన్ఫరెన్స్ సమావేశాల్లో నోటి మాటగా చెప్పడం, అందుకు అనుగుణంగా ఇక్కడి అధికారులు ఆదేశాలు ఇస్తుండటంతో టీచర్లు అయోమయానికి గురవుతున్నారు. గ్రేడ్-2 హెచ్‌ఎంల బదిలీలకు సంబంధించి 27న తుది సీనియారిటీ జాబితా విడుదల చేయాలి. 28న వారు వెబ్ ఆప్షన్ పెట్టాలి. అందుకు భిన్నంగా 26వతేదీ సాయంత్రం నాలుగు గంటలకు హెచ్‌ఎంలు వెబ్ ఆప్షన్లు పెట్టేందుకు సిద్ధంగా ఉండాలని ఉపాధ్యాయ సంఘాల గ్రూపులో డీఈవో పేరుతో పోస్టింగ్‌లు వెలువడ్డాయి. తీరా సీనియారిటీ జాబితా 26వతేదీ అర్ధరాత్రి విడుదలైంది. 30వ తేదీన టీచర్ల బదిలీ ఉత్తర్వులు విడుదల కావాల్సి ఉండగా 28వ తేదీనే విడుదలవుతాయని ప్రచారం జరుగుతోంది. అధికారుల హడావుడిగా తమను పరుగులు తీయిస్తే ఆ ఒత్తిడిలో తాము వెబ్ ఆప్షన్‌లు సరిగా పెట్టుకోకపోతే నష్టపోతామని హెచ్‌ఎంలు, టీచర్లు వాపోతున్నారు. ఇదిలా ఉండగా హెచ్‌ఎంల ఉద్యోగోన్నతులకు సంబంధించిన సీనియారిటీ జాబితా తప్పులతడకగా ఉండటంతో యూటీఎఫ్ ఆధ్వర్యంలో పలువురు స్కూల్ అసిస్టెంట్లు డీఈవోను కలిసి ఫిర్యాదు చేశారు.
టీచర్ల బదిలీలకు 6,630 దరఖాస్తులు
ఉమ్మడి జిల్లాలో జరుగుతున్న ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి మంగళవారం సాయంత్రానికి 6,630 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తు గడువు మంగళవారంతో ముగిసింది. మొత్తం బదిలీల ప్రక్రియ జూన్ 11వతేదీతో ముగియనుంది. చివరిగా ఆ రోజు సెకండరీ గ్రేడ్ టీచర్ల బదిలీ ఉత్తర్వులు విడుదల కానున్నాయి.
కేటగిరీ వారీగా దరఖాస్తుల వివరాలు ఇవీ...
పోస్టు పేరు దరఖాస్తుల సంఖ్య
గ్రేడ్-2 హెచ్‌ఎంలు 141
స్కూలు అసిస్టెంట్ తెలుగు 416
స్కూలు అసిస్టెంట్ హిందీ 374
స్కూలు అసిస్టెంట్ ఇంగ్లీషు 427
స్కూలు అసిస్టెంట్ గణితం 514
స్కూలు అసిస్టెంట్ పీఎస్ 425
స్కూలు అసిస్టెంట్ బీఎస్ 282
స్కూలు అసిస్టెంట్ సోషల్ 275
స్కూలు అసిస్టెంట్ సంస్కృతం 05
స్కూలు అసిస్టెంట్ పీడీ 163
స్కూలు అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ 37
సెకండరీగ్రేడ్ టీచర్లు(తెలుగు) 3,366
సెకండరీ గ్రేడ్ (ఉర్దూ) 09
ఎల్‌పీ తెలుగు 05
ఎల్‌పీ హిందీ 03
ఎల్‌పీ సంస్కృతం 02
పీఈటీ 30
పీఎస్‌హెచ్‌ఎం 149
మ్యూజిక్ 01
ఎల్‌పీ ఉర్దూ 93
మొత్తం 6,630
Updated Date - May 28 , 2025 | 01:40 AM