అన్నదాతకు అండగా..
ABN, Publish Date - May 06 , 2025 | 01:44 AM
రైతన్నలకు తీపికబురు. పంట సాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ‘అన్నదాత సుఖీభవ’ పేరుతో అర్హులైన కర్షకులకు రూ.20వేల ఆర్థిక సహాయాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు జమ చేయబోతోంది. ఎన్నికలకు ముందు టీడీపీ కూటమి అన్నివర్గాలకు మేలుచేసే మేనిఫెస్టోను విడుదల చేసింది.
ఈనెలలోనే సుఖీభవ
2.50 లక్షల మందికి లబ్ధి
మూడు విడతల్లో ఒక్కొక్కరికి రూ.20వేలు
కౌలు రైతులకూ వర్తింపు
ప్రభుత్వం మార్గదర్శకాలు
అమలులోకి మరో కీలక ఎన్నికల వాగ్దానం
రైతన్నలకు తీపికబురు. పంట సాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ‘అన్నదాత సుఖీభవ’ పేరుతో అర్హులైన కర్షకులకు రూ.20వేల ఆర్థిక సహాయాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు జమ చేయబోతోంది. ఎన్నికలకు ముందు టీడీపీ కూటమి అన్నివర్గాలకు మేలుచేసే మేనిఫెస్టోను విడుదల చేసింది. అందులో ప్రకటించిన పలు పథకాలను ఒక్కొక్కటిగా ఇప్పటికే అమలు చేస్తోంది. తాజాగా అన్నదాత సుఖీభవను ఈ నెలలో అందించనుంది. అందుకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. అవి సోమవారం జిల్లా వ్యవసాయశాఖ అధికారులకు చేరాయి. లబ్ధిదారుల జాబితాను ఈనెల 20వతేదీలోపు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని అందులో స్పష్టం చేసింది. జిల్లాలో సుమారు 2.5లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది.
ఒంగోలు, మే 5 (ఆంధ్రజ్యోతి): ఎన్నికలకు ముందు ఆయా వర్గాల ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తాజాగా లక్షలాది మంది రైతులకు ఆర్థిక సహకారం అందించే కీలక పథకం అమలుకు ఉపక్రమించింది. ఈనెలలోనే దాన్ని వర్తింపజేయనుంది. కేంద్ర ప్రభుత్వం ‘పీఎం కిసాన్‘ పేరుతో ఏటా ఒక్కో రైతుకు రూ.6వేలు ఇస్తుండగా ఆ పథకంతో రాష్ట్ర ప్రభుత్వం తమ వంతు ఆర్థిక సాయాన్ని కలిపింది. ఆ ప్రకారం అన్నదాత సుఖీభవ పేరుతో అందించే రూ.20వేలలో రూ.6వేలు కేంద్రం నుంచి రానుండగా మిగిలిన రూ.14వేలను రాష్ట్రప్రభుత్వం ఇవ్వనుంది. అలాగే కేంద్రం మూడు విడతలుగా ఆ మొత్తం ఇస్తుండగా రాష్ట్రప్రభుత్వం కూడా తాము ఇచ్చే రూ.14వేలను మూడు విడతలుగా రైతుల ఖాతాల్లో జమచేయనుంది.
4.78లక్షల రైతు కమతాలు
జిల్లాలో మొత్తం 4.78 లక్షల రైతు కమతాలు ఉన్నాయి. అందులో 2.62 లక్షల సన్నకారు, 1.29 లక్షల చిన్న రైతులు ఉన్నారు. మరో 87వేలు ఇతర కమతాలు ఉన్నాయి. జిల్లాలో సాధారణంగా సుమారు 6.80 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వివిధ రకాల పంటలు సాగు చేస్తారు. ఇదిలాఉండగా పీఎం కిసాన్ పథకం కింద జిల్లాలో 2.44 లక్షల మందికి ఆర్థిక సహాయం అందుతోంది. వారందరికీ రాష్ట్రప్రభుత్వం అమలు చేయనున్న అన్నదాత సుఖీభవ పథకం వర్తించనుంది. పీఎం కిసాన్‌లో కౌలు రైతులకు నగదు ఇవ్వడం లేదు. అయితే రాష్ట్రప్రభుత్వం ఈ పథకాన్ని అర్హులైన కౌలు రైతులకు కూడా వర్తించేలా ఉత్తర్వులు ఇచ్చారు. వారిని వ్యవసాయ, రెవెన్యూ అధికారులు గుర్తించాల్సి ఉంటుంది.
అంతా ఆన్‌లైన్‌లోనే..
అన్నదాత సుఖీభవ పథకం అమలులో గ్రామస్థాయిలోని వ్యవసాయ శాఖ అసిస్టెంట్లు, రెవెన్యూలోని వీఆర్వోలు కీలకం కానున్నారు. లబ్ధిదారుల ఎంపికను ప్రాథమికంగా వారు చేస్తారు. ఆ జాబితాను వారు ఆన్‌లైన్‌లో యాప్‌లో నమోదు చేస్తే మండల స్థాయిలోని తహసీల్దార్, వ్యవసాయ శాఖ అధికారి పరిశీలించి ఓకే చేయాలి. వాటిని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి (డీఏవో) పరిశీలించి వ్యవసాయశాఖ కమిషనర్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేస్తే సదరు జాబితాలోని రైతు ఖాతాలకు నగదు జమ అవుతుంది.
అధికారులకు ఆదేశాలు
ప్రభుత్వ నూతన మార్గదర్శకాల ప్రకారం జిల్లాలో తొలివిడత అన్నదాత సుఖీభవ పథకం 2.50 లక్షల మందికిపైగా రైతులకు అందే అవకాశం ఉంది. ఈ పథకంలో ఎవరెవరు అనర్హులు అనేది కూడా ప్రభుత్వం మార్గదర్శకాల్లో వివరించింది. తదనుగుణంగా లబ్ధిదారులైన రైతుల జాబితాలను సిద్ధం చేసి వ్యవసాయ శాఖ కమిషనర్ పోర్టల్‌లో నిక్షిప్తం చేయాలని జిల్లా అధికారులను ఆదేశించింది. కాగా అన్నదాత సుఖీభవ మార్గదర్శకాలు సోమవారం అందాయని జిల్లా వ్యవసాయ అధికారి ఎస్.శ్రీనివాసరావు తెలిపారు. తదనుగుణంగా అర్హులైన లబ్ధిదారుల జాబితాలను ప్రభుత్వం ఇచ్చిన గడువులోపు రూపొందించి నివేదిస్తామని ఆయన చెప్పారు.
Updated Date - May 06 , 2025 | 01:44 AM