నిల‘బడి’...!నిల‘బడి’...!
ABN, Publish Date - Jul 01 , 2025 | 11:03 PM
ప్రజాప్రభుత్వం విద్యాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు, సన్న బియ్యంతో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, ఉచిత పుస్తకాలు, యూనిఫాంతోపాటు తల్లికి వందనం పథకం ప్రభుత్వ పాఠశాలల పునరుజ్జీవనానికి ఊపిరిపోస్తున్నాయి. వీటికితోడు ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ పెడితే ఆ బడి దినదినప్రవర్థమానంగా విరాజిల్లుతోందనేదానికి బోడ పాడు ఎంపీపీపాఠశాలే ఉదాహరణ.
బోడపాడు ప్రభుత్వ పాఠశాలలో 30 నుంచి 130కి పెరిగిన సంఖ్య
మార్కాపురంలో ఈఏడాది కార్పొరేట్ స్కూళ్లు మానేసి అడ్మిషన్లు తీసుకున్న 45 మంది విద్యార్థులు
ప్రజాప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతోపాటు దాతల సాయంతో మరింత అభివృద్ధి
ఏటా నవోదయ సీట్లు
హౌస్‌ఫుల్ బోర్డు దిశగా అడ్మిషన్లు!
మార్కాపురం రూరల్, జూన్ 30 (ఆంధ్రజ్యోతి) : ప్రజాప్రభుత్వం విద్యాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు, సన్న బియ్యంతో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, ఉచిత పుస్తకాలు, యూనిఫాంతోపాటు తల్లికి వందనం పథకం ప్రభుత్వ పాఠశాలల పునరుజ్జీవనానికి ఊపిరిపోస్తున్నాయి. వీటికితోడు ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ పెడితే ఆ బడి దినదినప్రవర్థమానంగా విరాజిల్లుతోందనేదానికి బోడ పాడు ఎంపీపీపాఠశాలే ఉదాహరణ.
మార్కాపురం మండలం బోడపాడు గ్రా మంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులతో కళకళలాడుతోంది. గ్రామంలో ఉండే విద్యార్థులు అందరూ ఆ పాఠశాలలో చ దువుతుండడమేగాక మార్కాపురం పట్టణం నుం చి రోజూ 45 మంది ఆటోలో స్కూలుకు వస్తుండడం గమనార్హం. వీరందరూ కార్పొరేట్ పాఠశాలలను వదిలేసి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామీణ పాఠశాలకు వస్తుండడం, ప్రభుత్వ విద్యావ్యవస్థ మీద తల్లిదండ్రులకు నమ్మకం పెరుగుతుండడమేనని చెప్పవచ్చు.
బోడపాడు ఎంపీపీ పాఠశాలలో 2023 జూన్ 12న పెద్దారవీడు మండలం బోడిరెడ్డిపల్లి స్కూల్ నుంచి ఉపాధ్యాయుడు శ్రీనివాసులు బదిలీపై వచ్చారు. అప్పటి నుంచే ఈ పాఠశాలలో మార్పు మొదలైందని చెప్పవచ్చు. అప్పటికీ పాఠశాలలో ఉన్న విద్యార్థుల సంఖ్య 30. ఇద్దరు ఉపాధ్యాయులు మాత్రమే ఉండేవారు. ప్రస్తుతం పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 130 మందికి చేరింది. ఉపాధ్యాయులు ఐదుగురు ఉన్నారు. పాఠశాలలో హౌస్‌ఫుల్ బోర్డు పెట్టే పరిస్థితి ఉంది. ఏటా ఇక్కడ చదువుతున్న విద్యార్థులు నవోదయ సీట్లు సైతం సాధిస్తున్నారు.
దాతల సహకారంతో పాఠశాలలో అభివృద్ధి పనులు
పాఠశాలలో గ్రామస్థులు, దాతల సహకారంతో కార్పొరేట్ స్కూల్స్ స్థాయిలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. విద్యార్థులు చదువుకునేందుకు లక్ష రూపాయలతో రేకుల షెడ్‌ను నిర్మించారు. రూ.50వేలతో మరుగుదొడ్లను ఆధునికీకరించారు. రూ.లక్షతో సరస్వతీ దేవి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
సీఎం చంద్రబాబు నుంచి ప్రశంసలు
పాఠశాలలో జరిగే స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాలతో పాటు ప్రత్యేక కార్యక్రమాల సమయంలో విద్యార్థులు ప్రతిభ చాటుతున్నారు. ఈ ఏడాది మార్చి 8న మార్కాపురం వచ్చిన ముఖ్యమంత్రి సభా కార్యక్రమంలో బోడపాడు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఽధీర వనితల వేషధారణతో, సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చిన్నారులను గుర్తించి వారిని అభినందించారు.
అభినందించిన కలెక్టర్
గత ఏడాది డిసెంబర్ 26న బోడపాడు గ్రామంలో ప్రభుత్వ కార్యక్రమానికి వచ్చిన కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డిలు పాఠశాలను సందర్శించారు. విద్యార్థుల ప్రతిభ, అభివృద్ధి పనులను చూసి ఉపాధ్యాయులను అభినందించారు.
Updated Date - Jul 01 , 2025 | 11:03 PM