జిల్లాలోకి ప్రవేశించిన సాగర్‌జలాలు
ABN, Publish Date - Jul 31 , 2025 | 11:40 PM
జిల్లా ప్రజల తాగు సాగునీటి అవసరాలు తీర్చేందుకు సాగర్ కుడికాలువ ద్వారా విడుదలైన నీరు బుధవారం అర్ధరాత్రి జిల్లా సరిహద్దు పుల్లలచెరువు మండలం మానేపల్లి సమీపంలోని 85/3 మైలు వద్దకు చేరాయి.
2,500 క్యూసెక్కుల నీరు రాక
కాలువపై పర్యటించిన సీఈ శ్యాంప్రసాద్
సీఎం పర్యటన నేపథ్యంలో ఆరా తీసిన మంత్రి
అప్రమత్తమైన ఇరిగేషన్ అధికారులు
త్రిపురాంతకం, జూలై 31 (ఆంధ్రజ్యోతి) : జిల్లా ప్రజల తాగు సాగునీటి అవసరాలు తీర్చేందుకు సాగర్ కుడికాలువ ద్వారా విడుదలైన నీరు బుధవారం అర్ధరాత్రి జిల్లా సరిహద్దు పుల్లలచెరువు మండలం మానేపల్లి సమీపంలోని 85/3 మైలు వద్దకు చేరాయి. ప్రారంభంలో దాదాపు 1,900 క్యూసెక్కులు వచ్చిన నీరు క్రమేపి పెరిగి 2,500 క్యూసెక్కులు తగ్గకుండా వస్తున్నాయి. గురువారం ఉదయం త్రిపురాంతకం చేరిన సాగర్‌నీరు సాయంత్రానికి దూపాడు వద్దకు చేరాయి. ఈ నెల 2వ తేదీన జిల్లాకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రానున్న నేపధ్యంలో నీటి సరఫరా విషయంలో అఽధికారులు అప్రమత్తమయ్యారు. దూపాడు వద్ద ప్రధాన కాలువపై ఎన్నెస్పీ అధికారులు ఛీఫ్ ఇంజనీర్ బి.శ్యాంప్రసాద్‌తో కలిసి డీఈ విజయలక్ష్మి, ఏఈ శివన్నారాయణ పర్యటించారు. సీఈ శ్యాంప్రసాద్ అధికారులతో మాట్లాడుతూ ప్రస్తుతం వస్తున్న 2,500 క్యూసెక్కుల నీరు తగ్గకుండా చివరివరకు అందేలా చూడాలని సూచించారు. సీఎం పర్యటన నేపథ్యంలో నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కూడా సాగరునీటి సరఫరాపై ఆరా తీసినట్టు ఆయన చెప్పారు. ప్రజలకు సాగునీటితో పాటు ఎక్కడెక్కడ తాగునీటి అవసరాలు ఉన్నాయో అన్నింటికీ సరిపడా నీటిని వినియోగించుకోవచ్చని ఆయన సూచించారు. కాగా గురువారం రాత్రికి కురిచేడు వరకు నీరు వెళ్లవచ్చని, శుక్రవారం ఉదయం 11 గంటలకు దర్శికి సాగరునీరు చేరుతుందని అధికారులు తెలిపారు. జిల్లా సరిహద్దు వద్ద గుంటూరు నుంచి వచ్చే నీటిలో 2500 క్యూసెక్కులు తగ్గకుండా ఉండేలా చూసుకోవాలని సీఈ అధికారులకు సూచనలు చేశారు. వారితోపాటు జేఈ భరత్, వాటర్ డిస్ర్టిబ్యూటరీ కమిటీ చైర్మన్ దేవినేని చలమయ్య ఉన్నారు.
Updated Date - Jul 31 , 2025 | 11:40 PM