‘గుండె’కు భరోసా
ABN, Publish Date - May 17 , 2025 | 12:50 AM
ఒంగోలు లోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్)లో గుండె సంబంధిత వ్యాధులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని, ఎంతో ఖరీదైన యాంజియో ప్లాస్టీని విజయవంతంగా చేశామని ఇన్‌చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ ఏడుకొండలు తెలిపారు.
ఒంగోలు జీజీహెచ్‌లో యాంజియో ప్లాస్టీ విజయవంతం
సూపరింటెండెంట్ ఏడుకొండలు, కార్డియాలజిస్ట్ వెంకటేశ్వరరావు వెల్లడి
ఒంగోలు, కార్పొరేషన్, మే 16 (ఆంధ్రజ్యోతి): ఒంగోలు లోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్)లో గుండె సంబంధిత వ్యాధులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని, ఎంతో ఖరీదైన యాంజియో ప్లాస్టీని విజయవంతంగా చేశామని ఇన్‌చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ ఏడుకొండలు తెలిపారు. ఇది జీజీహెచ్ చరిత్రలోనే నూతన అధ్యాయం అన్నారు. శుక్రవారం ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జీజీహెచ్‌లో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. పూర్తిస్థాయిలో గుండె వ్యాధులకు వైద్యం అందించడంతోపాటు యాంజియో ప్లాస్టీ, ఇతర ఆపరేషన్‌లు చేస్తామని తెలిపారు. జీజీహెచ్ కార్డియాలజీ హెచ్‌వోడీ, గుండె వైద్యనిపుణులు డాక్టర్ కె.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గతనెల రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్, మంత్రి డాక్టర్ స్వామి, కలెక్టర్ తమీమ్ అన్సారియాతోపాటు, స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌లు కార్డియాలజీ విభాగంలో ముఖ్యమైన క్యాథ్‌ల్యాబ్‌ను ప్రారంభించారని తెలిపారు. నాటి నుంచి కార్డియాలజీ సేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు. గుండె సంబంధిత వ్యాధులకు యాంజియోప్లాస్ట్ చేయడం సంతోషంగా ఉందన్నారు. దక్షిణ భారతదేశంలో గుండె విభాగానికి ప్రఖ్యాతిగా పేరుగాంచిన బెంగళూరు జయదేవ హాస్పిటల్, చెన్నైలోని విజయ హాస్పిటల్‌లో వాడే ఖరీదైన స్టంట్లను ఇక్కడ వినియోగిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రి అనే అపోహ లేకుండా నాణ్యమైన స్టంట్లను జీజీహెచ్‌లో వినియోగిస్తామని తెలిపారు. తాజాగా చీమకుర్తికి చెందిన ప్రసాద్ అనే వ్యక్తి ఆరోగ్య పరీక్షలు చేయించుకోగా గుండె వ్యాధి ఉన్నట్లుగా గుర్తించామన్నారు. ఆయన ఈనెల 12న హాస్పిటల్‌లో చేరారన్నారు. ఈసీజీ, టుడీ ఎకో చేసి, స్టంట్ వేయాల్సిన అవసరం రావడంతో 13న యాంజియో చేశామన్నారు. రెండు బెలూన్లు, ఒక స్టంట్‌ను అమర్చి గుండెలోని రక్తనాళ పూడికలను తొలగించామన్నారు. తద్వారా పేషెంట్ ఆరోగ్యంగా ఉన్నారన్నారు. ఈ ఆపరేషన్‌కు ప్రైవేటు వైద్యశాలలోరూ. 2.5లక్షలు ఖర్చు అవుతుందని, అయితే జీజీహెచ్‌లో ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పూర్తి ఉచితంగా చేసినట్లు తెలిపారు. జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. సమావేశంలో ఆర్‌ఎంవో డాక్టర్ మాధవీలత, ఇతర డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - May 17 , 2025 | 12:50 AM