ప్రభుత్వ వైద్యశాలల్లో నాణ్యమైన వైద్యం
ABN, Publish Date - May 01 , 2025 | 11:03 PM
: ప్రభుత్వ వైద్యశాలల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందిస్తున్నట్లు వైద్యఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు చెప్పారు. గురువారం మద్దిపాడు, ఎన్‌జీపాడు మండలాల్లో ఆయన విస్తృతంగా పర్యటించారు
రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణబాబు
మద్దిపాడు, ఎన్‌జీపాడు మండలాల్లో విస్తృత పర్యటన
హాజరైన కలెక్టర్ అన్సారియా, ఎమ్మెల్యే బీఎన్
నాగులుప్పలపాడు, మే 1 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ వైద్యశాలల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందిస్తున్నట్లు వైద్యఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు చెప్పారు. గురువారం మద్దిపాడు, ఎన్‌జీపాడు మండలాల్లో ఆయన విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా కొత్తకోట గ్రామంలో కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఎమ్మెల్యే బీఎన్ విజయ్‌కుమార్‌తో కలిసి ఆయన లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందజేశారు. లబ్ధిదారుల కుటుంబ స్థితిగతులను అడిగి తెలుసుకొన్నారు. ఈ సందర్భంగా కృష్ణబాబు మాట్లాడుతూ ప్రజలకు ఉచితంగా వైద్యం అందించేలా ప్రభుత్వ వైద్యశాలలను బలోపేతం చేస్తున్నట్లు చెప్పారు. క్యాన్సర్ స్ర్కీనింగ్ సేవలు, 104, అంగన్‌వాడీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం గ్రామంలో పర్యటించి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందుతున్న తీరుపై అడిగి తెలుసుకొన్నారు. స్థానిక పాఠశాలలో డ్వాక్రా గ్రూపు మహిళలతో సమావేశమై పలు సూచనలు చేశారు. బి.నిడమానూరు గ్రామంలో ప్రభుత్వ వైద్యశాల ఏర్పాటు చేయాలని పలువురు గ్రామస్థులు అర్జీ అందజేశారు. కలెక్టర్ అన్సారియా, ఎమ్మెల్యే బీఎన్ విజయ్‌కుమార్, డీఆర్‌డీఏ పీడీ టి.నారాయణ, ఏసీ విజయమ్మ, డీఎంహెచ్‌వో టి.వెంకటేశ్వర్లు, ఎంపీడీవో వై.మహాలక్ష్మి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి అడకా స్వాములు, మండల ప్రధానకార్యదర్శి కాకర్ల లక్ష్మీవరప్రసాద్, నాయకులు గుమ్మడి సాయిబాబా, ఎంపీటీసీ వై.సుబాషిణి, నాయకులు కోనూరి ఆంజనేయులు పాల్గొన్నారు.
వైద్యశాలలో మందుల కొరత లేకుండా చర్యలు
మద్దిపాడు: ప్రభుత్వ వైద్యశాలల్లో మందులకు కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వైద్యఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు చెప్పారు. గురువారం మద్దిపాడు మండలంలోని గుండ్లాపల్లి పరిశ్రమల కేంద్రం, మల్లవరం రిజర్వాయర్, మద్దిపాడులోని పీహెచ్‌సీలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కృష్ణబాబు వైద్యులకు దిశా నిర్దేశం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో సరైన ఆరోగ్య సేవలు నిర్ధారించడంలో వైద్యులు కీలక పాత్రపోషించాలని చెప్పారు. వైద్య సేవలపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించినట్లు తెలిపారు. గర్భిణులు, బాలింతలు, శిశువులలో రక్తహీనత పరిస్థితులపై వైద్యులు దృష్టిపెట్టేలా చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్‌వో డాక్టర్ టి.వెంకటేశ్వర్లును ఆదేశించారు. అదేవిధంగా గుండ్లాపల్లి గ్రోత్ సెంటర్‌లో గ్రానైట్ ఎగుమతుల వివరాలను, గుండ్లకమ్మ రిజర్వాయర్ దగ్గర మత్స్యకారులతో మాట్లాడి వారి సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. మత్స్యకారులు తెలిపిన సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన కలెక్టర్ అన్సారియాకు సూచించారు. అనంతరం మద్దిపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన సందర్శించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బీఎన్ విజయ్‌కుమార్, మత్స్యశాఖ జేడీ శ్రీనివాసరావు, ఎంపీడీవో వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - May 01 , 2025 | 11:03 PM