పాయింట్లే కీలకం
ABN, Publish Date - May 27 , 2025 | 01:29 AM
ఉపాధ్యాయుల బదిలీల్లో వారికి కేటాయిస్తున్న ఎన్‌టైటిల్‌మెంట్ పాయింట్లు ఎంతో కీలకం. కోరుకున్న స్థానాలు దక్కించుకోవాలంటే అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. న్యాయబద్ధంగా రావాల్సిన పాయింట్ల కోసం రాజీ పడకుండా ప్రయత్నించడంతోపాటు ఇతరులు అక్రమంగా పొందకుండా అడ్డుకోవాలి.
టీచర్ల బదిలీల్లో వాటికి ఎంతో ప్రాముఖ్యం
అప్రమత్తంగా లేకుంటే అర్హులకు అన్యాయమే
పరిశీలనలో బయటపడుతున్న అక్రమాలు
ఒంగోలు విద్య, మే 26 (ఆంధ్రజ్యోతి) : ఉపాధ్యాయుల బదిలీల్లో వారికి కేటాయిస్తున్న ఎన్‌టైటిల్‌మెంట్ పాయింట్లు ఎంతో కీలకం. కోరుకున్న స్థానాలు దక్కించుకోవాలంటే అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. న్యాయబద్ధంగా రావాల్సిన పాయింట్ల కోసం రాజీ పడకుండా ప్రయత్నించడంతోపాటు ఇతరులు అక్రమంగా పొందకుండా అడ్డుకోవాలి. లేకపోతే స్థానాలు పొందే విషయంలో అన్యాయం జరగడం ఖాయం. ఉద్దేశపూర్వకంగా కాకపోయినా అర్హత లేని కొందరు అవగాహన లేమితో పాయింట్ల కోసం తమకు వర్తించని అంశాలు దరఖాస్తుల్లో పొందుపర్చి ప్రయతిస్తున్నారన్న ఆరోపణలు ఉపాధ్యాయలోకం నుంచి వెల్లువెత్తుతున్నాయి. ఉదాహరణకు మాజీ సైనికోద్యోగులు స్వయంగా ఉపాధ్యాయులుగా పనిచేస్తుంటే వారికి ఐదు పాయింట్లు కేటాయిస్తారు. అదేవిధంగా ప్రస్తుతం సైనికోద్యోగులుగా పనిచేస్తున్న వారి స్పౌజ్‌కు ఐదు పాయింట్లు కేటాయిస్తారు. మాజీ సైనికోద్యోగుల స్పౌజ్‌కు మాత్రం ఎటువంటి పాయింట్లు రావు. అయితే ఒక మహిళా టీచర్ తన భర్త మాజీ సైనికోద్యోగి అని పేర్కొనడంతో మండల స్థాయిలో ఎంఈవో ఓకే చేసి ఐదు పాయింట్లు ఇచ్చారు. జిల్లాస్థాయిలో దరఖాస్తుల పరిశీలన సమయంలో దీనిపై అభ్యంతరం రావడంతో ఆ టీచర్‌కు ఆ ఐదు పాయింట్లు తొలగించారు. మరికొందరు కూడా అర్హత లేకపోయినా ఇదే విధంగా పాయింట్లు పొందారన్న ఆరోపణలు ఉన్నాయి.
స్పౌజ్‌ల విషయంలో తిరకాసు
స్పౌజ్ పాయింట్లలో కూడా కొంత తిరకాసు జరిగిందన్న విమర్శలు ఉన్నాయి. ఈ పాయింట్ల కోసం ఎటువంటి సర్టిఫికెట్ ఆప్‌లోడ్ చేసే అవసరం లేకపోవడంతో కొందరు అర్హత లేకపోయినా పొందారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. నిబంధనల ప్రకారం భార్యభర్తలిద్దరూ రాష్ట్ర, కేంద్రప్రభుత్వ ఉద్యోగాలు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే వారు, ఎయిడెడ్, స్థానిక సంస్థల్లో పనిచేస్తున్న వారు, ప్రభుత్వ విద్యారంగ సొసైటీల్లో పనిచేసే వారికి మాత్రమే స్పౌజ్ పాయింట్లు కేటాయించమన్నారు. అయితే దరఖాస్తులోని ఇతర కాలమ్‌ను ఆసరా చేసుకొని ఆ కోటాలో కొందరు స్పౌజ్ పాయింట్లు పొందారన్న ఆరోపణలు ఉన్నాయి. కొందరు ప్రైవేటు ఉద్యోగులు, టీచర్లు, లెక్చరర్లు స్పౌజ్ పాయిట్లు పొందారన్న ఆరోపణలు ఉన్నాయి. 5/8 సంవత్సరాలు పూర్తయిన హెచ్‌ఎంలు, టీచర్లు మాత్రమే వినియోగించుకోవాల్సి ఉండగా కొందరు ఆ సమయం పూర్తికాకపోయినా వినియోగించుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దరఖాస్తు పరిశీలన పక్కాగా నిర్వహించి అక్రమార్కులను ఏరివేసి తమకు న్యాయం చేయాలని టీచర్లు కోరుతున్నారు.
ఫిర్యాదుల పరిష్కారానికి మూడు బృందాలు
ఉమ్మడి జిల్లాలో ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించిన ప్రాథమిక సీనియారిటి జాబితాలపై అభ్యంతరాలు, ఫిర్యాదుల పరిష్కారానికి మూడు బృందాలను ఏర్పాటు చేస్తూ జిల్లా విద్యాశాఖాధికారి కిరణ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. జూన్ 2వతేదీ వరకు ఈ బృందాలు పనిచేస్తాయి. గ్రేడ్-2 ప్రధానోపాధ్యాయుల సీనియారిటీ జాబితాలపై అభ్యంతరాలు పరిశీలించి పరిష్కరించేందుకు చీరాల ఉప విద్యాధికారి బి.గంగాధరరావు, తెల్లబాడు జడ్పీ హైస్కూలు హెచ్‌ఎం ఎం.రమేష్, స్కూల్ అసిస్టెంట్ల అభ్యంతరాల పరిశీలనకు పెట్లూరు జడ్పీ హైస్కూల్ హెచ్‌ఎం కేసీహెచ్.చలపతి, రుద్రవరం హెచ్‌ఎం కె.శ్రీనివాసరావు, చినగంజాం ఎంఈవో బి.అజయ్‌ను నియమించారు. సెకండరీ గ్రేడ్ టీచర్ల అభ్యంతరాల పరిశీలన బాధ్యతను తాళ్లూరు హెచ్‌ఎం శ్రీనివాసరావు, తెల్లబాడు హెచ్‌ఎం ఎం.రమేష్, మల్లంపేట హెచ్‌ఎం పీఏ.పద్మనాభరావు, సుంకేశుల హెచ్‌ఎం కృష్ణప్రసాద్‌కు అప్పగించారు. ఆయా సబ్జెక్టులకు సంబంధించిన సెక్షన్ అసిస్టెంట్లు వీరికి సహాయకారులుగా వ్యవహరిస్తారు. ఈ మూడు టీంలు బదిలీల ప్రాథమిక సీనియారిటీ జాబితాలపై వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి పరిష్కరిస్తారు. ఎడిట్ ఆప్షన్‌ను ఉపయోగించి పాయింట్లలో మార్పులు,చేర్పులు చేస్తారు.
40 అభ్యంతరాలు పరిష్కారం
గ్రేడ్-2 హెచ్‌ఎంల సీనియారిటీ జాబితాపై 40 మంది హెచ్‌ఎంలు అభ్యంతరాలు తెలిపారు. అవన్నీ ప్రధానంగా పాయింట్లు కలవకపోవడంపైనే వచ్చాయి. వాటిని పరిశీలించి పరిష్కరించి ఆ మేరకు ఆన్‌లైన్‌లో మార్పులు చేశారు. హెచ్‌ఎం బదిలీలకు మొత్తం 111 ఖాళీలను ప్రకటించారు. అభ్యంతరాల పరిశీలన, పరిష్కారం ముగియడంతో బదిలీల తుది సీనియారిటీ జాబితా సోమవారం రాత్రికి విడుదలవుతుందని డీఈవో కిరణ్‌కుమార్ తెలిపారు. పీఎస్ హెచ్‌ఎంలు 149 మంది, 149 మంది ప్రాథమిక పాఠశాలల హెచ్‌ఎంలు బదిలీకి దరఖాస్తులు చేశారు. వీటి మొదటిదశ పరిశీలన సంబంధిత ఎంఈవో స్థాయిలో జరిగింది. రెండవ దశ స్థానిక డీఆర్‌ఆర్‌ఎం హైస్కూల్‌లో సోమవారం ముగిసింది.
Updated Date - May 27 , 2025 | 01:29 AM