సమాజాన్ని చైతన్యవంతం చేసేవి నాటికలు
ABN, Publish Date - Apr 24 , 2025 | 10:52 PM
కళలు మన సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయని, కళాపరిషత్‌ల ద్వారా ప్రదర్శించే నాటికలకు సమాజాన్ని చైతన్యవంతం చేసే శక్తి ఉందని రోటరీ జిల్లా 3150 గవర్నర్ కే శరత్‌చౌదరి చెప్పారు.
శ్రీకారం రోటరీ కళా పరిషత్ నాటిక పోటీలు ప్రారంభం
మార్టూరు, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి) : కళలు మన సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయని, కళాపరిషత్‌ల ద్వారా ప్రదర్శించే నాటికలకు సమాజాన్ని చైతన్యవంతం చేసే శక్తి ఉందని రోటరీ జిల్లా 3150 గవర్నర్ కే శరత్‌చౌదరి చెప్పారు. గురువారం రాత్రి మార్టూరులో శ్రీకారం రోటరీ కళాపరిషత్ ఆధ్వర్యంలో 15వ తెలుగు రాష్ట్రాల నాటిక పోటీలు ప్రారంభమయ్యాయి. మొదట కే శరత్‌చౌదరి, శ్రీకారం కార్యదర్శి జాష్టి అనూరాధ, వేదిక ఉపాధ్యక్షుడు మల్లికార్జునరావు, రోటరీ సభ్యులు నటరాజ విగ్రహం వద్ద జ్యోతి ప్రజ్వలనతో నాటిక పోటీలను ప్రారంభించారు. ఎఫర్ట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జాష్టి వెంకట మోహనరావు అధ్యక్షత ఉపన్యాసంలో మాట్లాడుతూ ప్రజా సేవా కార్యక్రమాలతో పాటు రోటరీ కళా పరిషత్ నాటిక పోటీలను నిర్వహిస్తూ సమాజ చైతన్యం కోసం పనిచేస్తోందన్నారు. ముఖ్యఅతిథి కే శరత్‌చౌదరి మాట్లాడుతూ రోటరీ క్లబ్‌లలో మార్టూరు రోటరీ క్లబ్‌కు ప్రత్యేక స్థానం ఉందన్నారు. ప్రజాసమస్యల పరిష్కారానికి మార్గాలను కళా పరిషత్ నాటికల ప్రదర్శనల ద్వారా ప్రజల దృష్టికి తీసుకువెళుతోందని చెప్పారు. వేదికపై ఆత్మీయ అతిథులు వేదిక ఉపాధ్యక్షుడు పీవీ మల్లికార్జునరావు, రోటరీ అధ్యక్షుడు మద్దుమాల కోటేశ్వరరావు,కార్యదర్శి మాదాల సాంబశివరావులు, ఎం.ఈశ్వరప్రసాద్ ప్రసంగించారు.
ఆకట్టుకున్న నాటికలు
తొలిరోజు మొదటి ప్రదర్శనగా న్యూస్టార్ మోడరన్ థియేటర్ విజయవాడ వారిచే ప్రదర్శించిన కపిరాజు నాటిక ప్రేక్షకులను ఆకట్టుకున్నది. అనంతరం రసఝురి పొన్నూరు వారిచే గురి తప్పినవేట నాటికలో డబ్బు సంపాదించడం కోసం అడ్డదారులు తొక్కేవారు సమాజంలో పెరిగిపోయారని, నీతి, నిజాయతీతో డబ్బులు సంపాదించేవారికి ఎప్పుడూ విలువ ఉంటుందనే కథా వృత్తంతో సాగిన ప్రదర్శన ప్రేక్షకులను ఆలోచింపచేసింది. తరువాత యంగ్‌థియేటర్ విజయవాడ వారిచే 27వ మైలురాయి నాటికలో సమాజంలో న్యాయాన్ని కాపాడాల్సిన న్యాయవాదులు సమాజానికి కీడు చేసే కేసులు వాదించకుండా ఉండడం ఉత్తమమనే సందేశంతో నాటిక ప్రదర్శన చేశారు. నాటికలను తిలకించడానికి ప్రేక్షకులు భారీగా తరలి వచ్చారు.
Updated Date - Apr 24 , 2025 | 10:53 PM