పెండింగ్ కేసులను త్వరితిగతిన పరిష్కరించాలి
ABN, Publish Date - Jul 10 , 2025 | 10:58 PM
పక్కా ప్రణాళికతో పెండింగ్ కేసులను త్వరతిగతిన పరిష్కరించాలని గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి అన్నారు. స్థానిక సర్కిల్ పరిధిలోని హనుమంతునిపాడు స్టేషన్‌ను గురువారం ఎస్‌పీ దామోదర్‌తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు.
గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి
కనిగిరి, జూలై 10 (ఆంధ్రజ్యోతి) : పక్కా ప్రణాళికతో పెండింగ్ కేసులను త్వరతిగతిన పరిష్కరించాలని గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి అన్నారు. స్థానిక సర్కిల్ పరిధిలోని హనుమంతునిపాడు స్టేషన్‌ను గురువారం ఎస్‌పీ దామోదర్‌తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఐజీ స్టేషన్ పరిధిలో నమోదైన కేసుల వివరాలు, ప్రస్తుత స్థితిగతులపై ఆరా తీశారు. పలు రికార్డులను పరిశీలించారు. మహిళలు, చిన్నారులపై జరుగుతున్న నేరాల కట్టడికి ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అసాంఘిక, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేలా పటిష్ఠంగా బీట్ సిస్టమ్‌ను నిర్వహించాలని సూచించారు. పోలీస్ స్టేషన్‌లలో నిర్వహిస్తున్న ఎఫ్‌ఐఆర్ ఇండెక్స్, కేసు డైరీలను, రిజిస్టర్లను, పలు రికార్డులను ఎప్పటికప్పుడు నమోదు చేయాలన్నారు. ప్రతి అంశాన్ని రికార్డులలో నమోదు చేసుకోవటం తప్పనిసరిగా పాటించాలని, ఈ విషయంలో అలసత్వం వద్దని హెచ్చరించారు. స్టేషన్‌ల పరిధిలోని శాంతి భద్రతల పరిస్థితి, నమోదైన కేసుల వివరాలను తెలుసుకుని వాటి స్థితిగతులపై ఆరా తీశారు. పెండింగ్ కేసుల దర్యాప్తు, పురోగతిపై అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ ఉన్న కేసుల పూర్వాపరాలపై విచారించి వాటికి కారణాలపై సమీక్షించారు. కేసుల విచారణలో చురుకుగా వ్యవహరించాలన్నారు. అనుమానాస్పద వ్యక్తుల యొక్క వేలి ముద్రలు సేకరించి వారి పాత నేరచరిత్రను విచారించాలన్నారు. ప్రతి పోలీస్ పరిధిలోని ప్రజలకు శక్తి యాప్ గురించి, శక్తి బృందాల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ పోలీస్ సహాయన్ని పొందే క్రమంలో ధైర్యంగా తెలియచేసేలా ఫ్రెండ్లీ పోలీసింగ్ అలవాటు చేసుకోవాలన్నారు. ప్రతి గ్రామంలో పల్లెనిద్ర చేస్తూ సమాచార వ్యవస్థను బలోపేతం చేసుకోవాలన్నారు. గ్రామాల్లో అల్లర్లకు తావు లేకుండా చూడాలన్నారు. జాతరలు, ఉత్సవాల సమయంలో పర్యవేక్షణ ముమ్మరం చేయాలని సూచించారు. ఐజీ వెంట డీఎ్‌సపీ సాయిఈశ్వర్‌యశ్వంత్, కనిగిరి, పామూరు సీఐలు ఖాజావలి, భీమానాయక్, ఎస్‌ఐలు టీ శ్రీరాం, ప్రేమ్‌కుమార్, అనోక్, మాధవరావు, కోటయ్య పాల్గొన్నారు.
Updated Date - Jul 10 , 2025 | 10:58 PM