కారుప్రమాదంలో ఒంగోలు వైద్య విద్యార్థి మృతి
ABN, Publish Date - Apr 30 , 2025 | 11:47 PM
నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డిపాలెంలో జరిగిన కారు ప్రమాదంలో ఒంగోలుకు చెందిన గుర్రం యగ్నేష్(20) మృతిచెందడంలో వారి కుటుంబం శోకసముద్రంలో మునిగిపోయింది.
శోకసంద్రంలో యగ్నేష్ కుటుంబం
ఒంగోలు కార్పొరేషన్, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి): నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డిపాలెంలో జరిగిన కారు ప్రమాదంలో ఒంగోలుకు చెందిన గుర్రం యగ్నేష్(20) మృతిచెందడంలో వారి కుటుంబం శోకసముద్రంలో మునిగిపోయింది. స్థానిక రామనగర్ 3వ లైను 6వ క్రాస్ రోడ్‌లో నివాసం ఉండే గుర్రం గురువీర్ జిల్లాలోని తూర్పుగంగవరం, అనంతపురంలో పాల వ్యాపారం చేస్తుండగా, తల్లి గృహిణిగా ఉన్నారు. యగ్నేష్ నెల్లూరులోని నారాయణ కాలేజీలో ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. కాగా తనతోపాటు చదువుకునే స్నేహితుడు చక్రధర్ సోదరి నిశ్చయ కార్యక్రమానికి హాజరై వస్తూ ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదానికి గురి కావడంతో యగ్నేష్ మృతిచెందాడు. దీంతో వారి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరు అయ్యారు. కాగా పోస్టుమార్టం అనంతరం గురువారం మధ్యాహ్నం తర్వాత యగ్నేష్ మృతదేహాన్ని ఒంగోలు తీసుకురానున్నారు.
Updated Date - Apr 30 , 2025 | 11:47 PM