దేవా.. విడువవా!
ABN, Publish Date - Jul 24 , 2025 | 01:07 AM
దేవదాయ శాఖ అధికారుల అతి వ్యవహారం, నిర్లక్ష్యం ప్రజలకు శాపంగా మారింది. కోట్ల విలువ చేసే భూములను దేవుడి సొత్తుగా నమోదు చేసుకున్నారు. దీంతో తమ ఆస్తులను క్రయవిక్రయాలు చేసుకునేందుకు అందరూ పడరానిపాట్లు పడుతున్నారు.
నిషేధిత జాబితాలో గ్రామకంఠం ఆస్తులు
అధికారుల తప్పిదంతో దేవుడివిగా నమోదు
ఏడు సంవత్సరాలుగా నిలిచిన రిజిస్ట్రేషన్లు
పట్టించుకోని వైనం.. ప్రజల ఇబ్బందులు
దేవదాయ శాఖ అధికారుల అతి వ్యవహారం, నిర్లక్ష్యం ప్రజలకు శాపంగా మారింది. కోట్ల విలువ చేసే భూములను దేవుడి సొత్తుగా నమోదు చేసుకున్నారు. దీంతో తమ ఆస్తులను క్రయవిక్రయాలు చేసుకునేందుకు అందరూ పడరానిపాట్లు పడుతున్నారు. ఈ సమస్య జిల్లావ్యాప్తంగా నెలకొన్నప్పటికీ తాళ్లూరు మండలంలో అధికంగా ఉంది. కోట్ల విలువ చేసే ఆస్తులను సైతం వినియోగించుకోలేని దుస్థితిలో ఉన్నామని ఆయా గ్రామాలకు చెందిన బాధితులు వాపోతున్నారు. చేసిన తప్పులను సరిదిద్ది తమ ఆస్తులు తమ పేరున ఉండేలా చర్యలు చేపట్టాలని అధికారులను కోరుతున్నా పట్టనట్టు వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నారు. రెవెన్యూ, దేవదాయశాఖ అధికారులు ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ ఇబ్బందులు పెడుతున్నారని ప్రజలు వాపోతున్నారు.
తాళ్లూరు, జూలై 23 (ఆంధ్రజ్యోతి): అసలు ఎటువంటి సంబంధం లేని ఆస్తులను దేవదాయశాఖ అధికారులు దేవుళ్లకు చెందినవిగా 22-ఏ నిషేధిత జాబితా రికార్డుల్లో నమోదు చేశారు. దీంతో వాటిని విడిపించుకోలేక బాధిత రైతులు, గృహ యజమానులు అల్లాడుతున్నారు. దేవదాయ శాఖ, రెవెన్యూ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. అయినా వారి సమస్యను పట్టించుకునేవారు కరువయ్యారు. జిల్లావ్యాప్తంగా ఈ విధంగా వందలకొద్దీ వివాదాలు ఉన్నాయి. వీటిపై కోర్టుల తలుపుతట్టి గెలిచిన వారూ ఉన్నారు. అయినా ఆ శాఖ అధికారుల తీరు మాత్రం మారడం లేదు. భూబాధితులను కార్యాలయాల చుట్టూ తిప్పుకోవడం, ఏదో ఒకవిధంగా సమస్యను పరిష్కరిస్తామంటూ వారి వద్ద ఆమ్యామ్యాలు పుచ్చుకోవడం మామూలే అయ్యింది. అయినా పరిష్కారం అవుతున్న కేసులు వేళ్ల మీదనే లెక్కపెట్టవచ్చు.
నిషేధిత జాబితాలో చేర్చిన సర్వే నంబర్లు
తాళ్లూరులోని గ్రామకంఠం సర్వేనంబర్ 268లోని ఆస్తులు శ్రీవేణుగోపాల, రామలింగేశ్వరస్వామి, శ్రీఆంజనేయస్వాములకు చెందినవిగా నమోదయ్యాయి. నాగంబొట్లపాలెం గ్రామకంఠం 505 సర్వేనంబర్‌లోని ఆస్తులు శ్రీ సీతారామస్వామి పేరు మీద, బెల్లంకొండవారిపాలెం గ్రామ కంఠం సర్వే నంబర్ 9లోని ఆస్తులు సీతారామస్వామి పేరు మీద ఉన్నాయి. బొద్దికూరపాడు గ్రామకంఠ సర్వే నంబర్ 114లోని ఆస్తులను శ్రీసోమేశ్వర, జ్వాలాముఖి అమ్మవార్ల పేరు మీద నమోదు చేశారు. 115లోని గ్రామకంఠం ఆస్తులను శ్రీ మాధవస్వామి పేరు మీద, లక్కవరం గ్రామకంఠం 193/3లోని ఆస్తులను శ్రీమల్లేశ్వర వీరభద్రయ్య, శ్రీరామలింగేశ్వర స్వాముల పేరున, సోమవరప్పాడు గ్రామకంఠం సర్వేనంబర్16లోని ఆస్తులను శ్రీవీరాంజనేయస్వామి పేరున, శివరాంపురం గ్రామ కంఠం సర్వే నంబర్ 110లోని ఆస్తులను శ్రీవేణుగోపాల, ప్రతాపఆంజనేయస్వామి పేరున 22ఏ నిషేధిత చట్టంలో నమోదు చేశారు. వీటన్నింటి రిజిస్ట్రేణ్‌లను నిలుపుదల చేస్తూ దేవదాయశాఖ అధికారులు దర్శి సబ్‌రిజిస్ర్టార్ కార్యాలయానికి లిఖితపూర్వకంగా లేఖ అందజేశారు. దేవాలయాలు ఉన్న విస్తీర్ణాన్ని గుర్తించడంలో అప్పటి దేవదాయశాఖ అధికారులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారు. దేవాలయాలు ఉన్న విస్తీర్ణాన్ని కొలతలు తీసి సబ్ డివిజన్ చేయకుండా ఆ సర్వే నంబర్ పూర్తి విస్తీర్ణాన్ని 22ఏలో చేర్చారు. దీంతో గ్రామకంఠంకు చెందిన సగభాగానికి పైగా గృహాలు దేవుడికి చెందిన ఆస్తులుగా నమోదయ్యాయి. దీంతో ఆయా గ్రామాల్లోని ఇంటి యజమానులు రిజిస్ర్టేషన్లు జరగక పడరానిపాట్లు పడుతున్నారు. అప్పటి దేవదాయశాఖ అధికారులు ఆ గ్రామాల్లోని గ్రామకంఠం ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చామని పేర్కొంటూ సబ్ రిజిస్ర్టార్ కార్యాలయానికి జూన్ 4, 2016న లేఖ పంపడంతో గృహాల అమ్మకాలు, కొనుగోళ్లు నిలిచిపోయాయి.
ఏడేళ్లుగా ఏడు గ్రామాల్లో నిలిచిన రిజిస్ట్రేషన్లు
మండలంలోని ఏడు గ్రామాల్లో రిజిస్ట్రేషన్లు ఏడేళ్లుగా నిలిచి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాళ్లూరు, బొద్దికూరపాడు, నాగంబొట్లపాలెం, లక్కవరం, రామభద్రాపురం, సోమవరప్పాడు, బెల్లంకొండవారిపాలెం, శివరాంపురంలలో గ్రామకంఠానికి చెందిన పలు సర్వే నంబర్లలోని గృహాలను దేవుని ఆస్తిగా దేవదాయశాఖ అధికారులు నిషేధిత చట్టం 22-(ఏ) జాబితాలోకి చేర్చారు. అప్పటి అధికారులు దేవుళ్ల ఆస్తులను సబ్ డివిజన్ చేయలేదు. దీంతో ఆన్‌లైన్ చేసే సమయంలో ఆలయ భూములు ఉన్న సర్వే నంబర్లన్నింటినీ 22-ఏ జాబితాలో చేర్చారు. వీటి రిజిస్ట్రేషన్లు నిలిపివేసేందుకు ప్రభుత్వానికి లేఖ ఇవ్వడంతో పైఅధికారులు గుడ్డిగా నిలిపివేశారు. ఆ శాఖ ఉన్నతాధికారి పరిశీలించి లిఖితపూర్వకంగా అందజేస్తే మిగిలిన భూమికి అనుమతులు ఇస్తామని సబ్ రిజిస్ట్రార్ పలుమార్లు దేవదాయ శాఖ అధికారులకు విన్నవించినా పట్టించుకున్న నాథుడే లేరని గృహ యజమానులు వాపోతున్నారు.
రెవెన్యూ సదస్సుల్లో దరఖాస్తులు ఇచ్చినా లభించని పరిష్కారం
రాష్ట్రప్రభుత్వం అట్టహాసంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించి వచ్చిన అర్జీలను 45 రోజుల్లో పరిష్కరిస్తామని చెప్పిన మాటలు అమలుకు నోచుకోలేదు. దేవుడి ఆస్తులుగా 22-ఏలో చేరి ఇబ్బందులు పడుతున్న ఆయా గ్రామాల రైతులు, సమస్యలను పరిష్కరించాలన్న తలంపుతో దేవుని ఆస్తులను సర్వే చేసి గుర్తించాలని దేవదాయ ఈవో ప్రతి రెవెన్యూ సదస్సుల్లో దరఖాస్తులు పెట్టారు. ఆ మేరకు రెవెన్యూ సర్వేయర్లు, ఎండోమెంట్ అధికారులు జాయింట్‌గా కొలతలు తీసి సబ్‌డివిజన్లు చేసి ఉన్నతాధికారులకు పంపారు. అయినా నేటికీ ప్రజల ఆస్తులు 22-ఏ నుంచి విముక్తి లభించలేదు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని 22ఏ నుంచి సొంత ఆస్తులకు విముక్తి కల్గించాలని కోరుతున్నారు.
Updated Date - Jul 24 , 2025 | 01:09 AM