ట్రంకురోడ్డుకు నూతన శోభ
ABN, Publish Date - May 31 , 2025 | 02:21 AM
సుదీర్ఘ కాలంగా ముందడుగు పడని ట్రంక్‌రోడ్డు విస్తరణ మరోసారి తెరపైకి వచ్చింది. ట్రాఫిక్ సమస్య నివారణ, నగర అభివృద్ధి దృష్ట్యా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆదేశాలతో కార్పొరేషన్ అధికారులు చర్యలు చేపట్టారు.
100 అడుగులకు విస్తరణ
మార్కింగ్‌ను ప్రారంభించిన కార్పొరేషన్ సిబ్బంది
నేడు వ్యాపారులతో కమిషనర్ సమావేశం
త్వరలోనే పనులు ప్రారంభం.. గతంలో పలుమార్లు వాయిదా
ఒంగోలు, కార్పొరేషన్, మే 30 (ఆంధ్రజ్యోతి) : సుదీర్ఘ కాలంగా ముందడుగు పడని ట్రంక్‌రోడ్డు విస్తరణ మరోసారి తెరపైకి వచ్చింది. ట్రాఫిక్ సమస్య నివారణ, నగర అభివృద్ధి దృష్ట్యా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆదేశాలతో కార్పొరేషన్ అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే నగరంలోని పలు ముఖ్యమైన రహదారుల విస్తరణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. త్వరలోనే కొత్తపట్నం బస్టాండ్ సెంటర్ నుంచి మస్తాన్ దర్గా వరకు ఉన్న రోడ్డును 80 అడుగులకు విస్తరణ చేయనున్నారు. అందుకోసం సోమవారం ఆ రోడ్డు మార్గంలో టౌన్ ప్లానింగ్ అధికారులు మార్కింగ్ చేయనున్నారు. అలాగే మిరియాలపాలెం నుంచి మస్తాన్ దర్గా వరకు ట్రంక్‌రోడ్డును విస్తరణ చేసే దిశగా చర్యలు వేగవంతం చేశారు. ఈ మేరకు శుక్రవారం టౌన్ ప్లానింగ్ అధికారులు, రోడ్డు విస్తరణ కోసం మార్కింగ్ చేశారు. దీంతో త్వరలోనే ట్రంక్‌రోడ్డు నూతన శోభను సంతరించుకోనుంది.
అనేకసార్లు ప్రతిపాదన.. అంతలోనే వాయిదా
నగర హోదాకు అనుగుణంగా రహదారుల విస్తరణ ఉండాలన్న దిశగా మాస్టర్ ప్లాన్‌కు అనుగుణంగా చర్యలు చేపట్టారు. అయితే 2006లో యక్కల తులసీరావు మునిసిపల్ చైర్మన్‌గా ఉన్న సమయంలో ఒకసారి ట్రంక్‌రోడ్డు విస్తరణ చేయాలని అప్పటి పాలకవర్గం ప్రతిపాదించింది. పలు రాజకీయాల కారణాలు, వ్యాపారుల నుంచి వచ్చిన ఒత్తిళ్లతో ముందడుగు పడలేదు. 2012లో అప్పటి పురపాలక శాఖ మంత్రి మానుగుంట మహీధర్‌రెడ్డి హయాంలోనూ ట్రంక్‌రోడ్, కర్నూలు రోడ్ విస్తరణ చేయాలని భావించారు. అయితే అప్పట్లో కర్నూలు రోడ్డు విస్తరణ మాత్రమే జరిగింది. ట్రంక్‌రోడ్డుకు సంబంధించి వంద అడుగులకు విస్తరిస్తే కొన్ని షాపులు సగానికిపైగా పోయే ప్రమాదం ఉందని, కొన్నేళ్లుగా వ్యాపారాలు చేస్తూ జీవనం సాగిస్తున్నామని వ్యాపారులు తెలిపారు. దీంతో అప్పట్లో ట్రంక్‌రోడ్‌విస్తరణ పనులు ముందుకు సాగలేదు. కొన్నేళ్లుగా ఆ అంశంపై పెద్దగా పట్టించుకున్నవారు లేరు. తాజాగా మరోసారి నగరంలోని ముఖ్య రోడ్ల విస్తరణకు అటు పాలకులు, ఇటు అధికారులు శ్రీకారం పలికారు. అందులోభాగంగా ట్రంక్‌రోడ్డు కూడా విస్తరించాలని నిర్ణయించారు.
ఒంగోలుకు కేంద్రం బిందువుగా ట్రంక్‌రోడ్డు
ఒంగోలు నగరానికి పూర్వం నుంచి ట్రంక్‌రోడ్డు కేంద్రబింధువుగా ఉండేది. అయితే మొదట్లో అత్యధికంగా షాపులు ఈ ప్రాంతంలోనే ఉండగా, గడిచిన పదేళ్లలో నగర పరిధి విస్తరించింది. బంగారం, వస్త్ర, ఇతర షాపింగ్ మాల్స్ ఒంగోలులో అడుగుపెట్టాయి. దీంతో కర్నూలు రోడ్డు, మంగమూరు రోడ్డు, గుంటూరు రోడ్లలో వ్యాపార సంస్థలు విస్తరించగా, ట్రంకు రోడ్డు ఇప్పటికే ఇరుగ్గానే ఉంది. దీంతో మెగా షాపింగ్ మాల్స్‌కు అవసరమైన భవనాలు లేకపోవడం, తదిర కారణాలతో పూర్వం ఉన్నటువంటి షాపులే నేటికీ కొనసాగుతున్నాయి. అయితే ప్రస్తుతం ఈ రోడ్డు 40 అడుగులు మాత్రమే ఉంది. దీన్ని 100 అడుగులకు విస్తరించనున్న నేపథ్యంలో భవిష్యత్‌లో ట్రంక్‌రోడ్డులో వ్యాపారాలు మరింత పెరిగే అవకాశంతోపాటు, నగర ప్రజలకు సులువైన మార్గంగా మారనుంది.
238 షాపులకు మార్కింగ్
ట్రంక్‌రోడ్డు వంద అడుగుల విస్తరణలో భాగంగా సుమారు 238 షాపులను కొంతమేర తొలగించే అవకాశం ఉంది. తూర్పువైపున 116 షాపులు, పడమర వైపున 122 షాపులకు మార్కింగ్ చేశారు. అయితే వాటిలో కొన్ని పూర్తిస్థాయిలో కోల్పోతుండగా, మరికొన్ని కొంతమేర మాత్రమే తొలిగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వ్యాపారులు నష్టపోకుండా ఉండేందుకు వారికి టీడీఆర్ బాండ్లు ్టపరిహారంగా అందించనున్నట్లు సమాచారం. కాగా ట్రంక్‌రోడ్డు వ్యాపారులతో మునిసిపల్ కమిషనరు కె.వెంకటేశ్వరరావు శనివారం సాయంత్రం కార్పొరేషన్ కార్యాలయంలో సమావేశం నిర్వహించనున్నారు.
నగరవాసుల హర్షం
ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆదేశాలతోఅభివృద్ధిలో నగరం నవ్యపథంగా దూసుకెళుతుండగా, అందుకు అనుగుణంగా విస్తరణ పనులు సైతం వేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే కర్నూలు రోడ్డు పనులు పూర్తయ్యాయి. సీవీఎన్ రీడింగ్ రూంసెంటర్ నుంచి కొణిజేడు బస్టాండ్ వరకు విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. తాజాగా బీవీఎస్ హాల్ రోడ్డు, ట్రంక్‌రోడ్డు విస్తరణ పనులు త్వరలోనే ప్రారంభం కానుండటంతో నగర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రోడ్ల విస్తరణతో ఒంగోలు నూతన శోభను సంతరించుకోనుందని అభిప్రాయపడుతున్నారు.
Updated Date - May 31 , 2025 | 02:21 AM