ముందస్తు బెయిల్ కోసం ‘ముప్పా’ యత్నం
ABN, Publish Date - May 29 , 2025 | 01:38 AM
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన తెలుగుదేశం పార్టీ నాయకుడు వీరయ్య చౌదరి హత్య కేసులో సూత్రధారి ముప్పా సురేష్ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. అదేసమయంలో పోలీసు బృందాలు సురేష్‌ను పట్టుకునేందుకు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టాయి.
వీరయ్య చౌదరి హత్య కేసులో నిందితులకు ముగిసిన పోలీసు కస్టడీ
అమ్మనబ్రోలులో సోదాలు నిర్వహించిన పోలీసులు
ఒంగోలు క్రైం, మే 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సంచలనం సృష్టించిన తెలుగుదేశం పార్టీ నాయకుడు వీరయ్య చౌదరి హత్య కేసులో సూత్రధారి ముప్పా సురేష్ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. అదేసమయంలో పోలీసు బృందాలు సురేష్‌ను పట్టుకునేందుకు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టాయి. ఇప్పటికే వీరయ్య హత్య కేసు నిందితుల్లో తొమ్మిది మంది రిమాండ్‌లో ఉండగా ఈనెల 25న పోలీసు కస్టడీకి తీసుకొని నాలుగు రోజులపాటు విచారించారు. వారిని బుధవారం తిరిగి కోర్టులో అప్పగించగా ఒంగోలు జైలుకు పంపించారు. ఈ నేపఽథ్యంలో మంగళవారం పోలీసులు అమ్మనబ్రోలులోని నిందితుడు సిద్ధాంతి సాంబశివరావు, సూత్రధారి ముప్పా సురేష్ ఇళ్లలో సోదాలు నిర్వహించారు. పోలీసులకు దొరక్కుండా తిరుగుతున్న సురేష్ ఒక టీవీ చానల్‌కు ఫోన్ ఇన్ ద్వారా ఇంటర్వ్యూ ఇచ్చారు. హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. గురువారం బెయిల్ పిటిషన్‌పై విచారణ జరగనుంది. సురేష్‌కు బెయిల్ మంజూరు చేయవద్దని కోర్టును అభ్యర్థిస్తూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఆయన్ను పోలీసులు పట్టుకుంటారా? లేక కోర్టులో అతనికి ఊరట లభిస్తుందా? అనేది చర్చనీయాంశమైంది.
పోలీసుల అదుపులో ఇరువురు నిందితులు
వీరయ్య చౌదరిని అత్యంత దారుణంగా హత్య చేసిన కిరాయి హంతకుడు నాగరాజు, కిరాయి హంతకులను నెల్లూరులో మాట్లాడి ఒంగోలు పంపిన నానీలను పోలీసులు అదుపులోకి తీసుకొని గోప్యంగా విచారిస్తున్నట్లు తెలిసింది. గతనెల 22వ తేదీ రాత్రి వీరయ్య చౌదరిని హత్య చేసిన నలుగురు నిందితులలో నాగరాజు, మరొకరు కలిసి స్ప్లెండర్ ప్లస్ మోటార్ సైకిల్‌పై మంగమూరువైపు వెళ్లారు. బైక్‌లో పెట్రోలు అయిపోవడంతో దాన్ని రోడ్డు పక్కన వదిలేసి వెళ్లారు. అక్కడి నుంచి ఓ ట్రాలీ ఆటోలో కొండపి వైపు ప్రయాణించినట్లు తెలిసింది. ఆటోలో సిమెంట్ బస్తాలు ఉండటంతో మార్గమధ్యంలో గమ్యస్థానంలో వాటిని దించి, అక్కడి నుంచి వారు అదే ఆటోలో జాతీయ రహదారికి చేరేందుకు బాడుగ మాట్లాడుకున్నారు. ఆటోడ్రైవర్ వారి మాటలు విని భయపడి మార్గమధ్యంలోనే దించి వేసి వెనుతిరిగాడు. మరలా బస్సులో ప్రయాణం చేసి నాగరాజు హైదరాబాద్ వెళ్లినట్లు విచారణలో వెల్లడించినట్లు తెలిసింది.
Updated Date - May 30 , 2025 | 03:04 PM