అమ్మా.. నిద్రలేమ్మా..!
ABN, Publish Date - Apr 30 , 2025 | 11:41 PM
వారు ముగ్గురూ చిన్నారులు. ఒక తల్లి బిడ్డలు. మంచంపై విగతజీవిగా ఉన్న తల్లి చనిపోయిందని కూడా ఆ పసి మనసులకు తెలీదు. తల్లి భూజాన్ని తడుతూ ‘అమ్మా.. నిద్రలేమ్మా.. ఆకలవుతోంది’ అని పదేపదే పిలుస్తూ ఉన్న ఆ చిన్నారులను చూసి అక్కడున్నవారంతా చలించిపోయారు.
తల్లి మృతదేహం వద్ద చిన్నారుల ఆర్ద్రత పిలుపు
రెండేళ్ల క్రితం తండ్రి మృతి
మర్రిపూడి, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి) : వారు ముగ్గురూ చిన్నారులు. ఒక తల్లి బిడ్డలు. మంచంపై విగతజీవిగా ఉన్న తల్లి చనిపోయిందని కూడా ఆ పసి మనసులకు తెలీదు. తల్లి భూజాన్ని తడుతూ ‘అమ్మా.. నిద్రలేమ్మా.. ఆకలవుతోంది’ అని పదేపదే పిలుస్తూ ఉన్న ఆ చిన్నారులను చూసి అక్కడున్నవారంతా చలించిపోయారు. కన్నీటి చుక్కను చిందించారు. మండల కేంద్రమైన మర్రిపూడిలో బుధవారం హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. కాలనీకి చెందిన కోండ్రు షడ్రక్, మౌనిక(29)లకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. అరవింద్, మేషక్, రూపిక.. ముగ్గురూ చిన్నారులే. వీరిది నిరుపేద కుటుంబం. ఏజుకారోజు కూలి చేసుకుని జీవనం గడపాలి. 2023 ఏప్రిల్‌లో కోండ్రు షడ్రక్ తీవ్ర అనారోగ్యంతో కన్నుమూశారు. కూలి చేసుకుంటూ మౌనిక తన పిల్లలను పోషించుకుంటోంది. ఆమె కూడా అనారోగ్యంతో బుధవారం కన్నుమూశారు. ఆమె శాశ్వతనిద్రలోకి వెళ్లినట్లు తెలీని ఆ పసిబిడ్డలు తల్లి దగ్గరకెళ్లి లేపే ప్రయత్నం చేయడం చూపరులకు కంటతడి పెట్టించింది. అనాథలైన ఆ అమాయకపు పిల్లలు ఎలా బతకాలో అని సమీప బంధువు గజ్జా దానమ్మ రోదించింది. టీడీపీ మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు గురజాల పోలయ్య, తెలుగు యువత నాయకులు రాజు, సురేష్, ప్రసాదు మాదిగ, జర్నలిస్ట్ ఫోరమ్ అధ్యక్షుడు బాబురావు.... మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. మౌనిక కుటుంబాన్ని ఆదుకునేందకు మంత్రి స్వామి, మారిటైంబోర్డ్ చైర్మన్ సత్యల కలిసి ప్రభుత్వం, పార్టీ పరంగా సహాయం అందించేందుకు కృషి చేస్తామన్నారు.
Updated Date - Apr 30 , 2025 | 11:41 PM