ఆధునికీక‘రణం’
ABN, Publish Date - Jun 01 , 2025 | 10:47 PM
2010 మే 19వ తేదీ గుర్తుకు వస్తేనే శివారుకాలనీ ప్రజలు ఉలిక్కిపడతారు. ఆ రోజు అర్ధరాత్రి అకస్మాత్తుగా వచ్చిన లైలా తుఫాన్ నగరాన్ని అతలాకుతలం చేసింది. ఉప్పెనలా విరుచుకుపడిన తుఫాన్ బీభత్సానికి నగరం నీట మునిగిపోవడమే కాకుండా వందలాది కుటుంబాలు కట్టుబట్టలతో బతుకుజీవుడా అంటూ పరుగులు పెట్టిన భయంకరమైన దుస్థితి.
ఒంగోలులోని పోతురాజు కాలువ పూడికతీత పనులపై శాఖల మధ్య లోపించిన సమన్వయం
కలిసి రాని ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు
మురుగు సమస్య కావడంతో కార్పొరేషన్‌కు తప్పని తిప్పలు
ఒంగోలు నగర జనాభా 3,10,694,
అన్ని రకాల గృహాల సంఖ్య 68,848,
శివారు కాలనీలు 53
శివారు కాలనీల జనాభా 25 వేలకు పైనే
ముంపు వాటిల్లే ప్రాంతాలు 37 కాలనీలు
పూర్తిగా నీట మునిగే గృహాలు 1,181
రిహాబిటేషన్ సెంటర్లు 5-10 కేంద్రాలు
శిబిరాలు నిర్వహణ రోజులు 3-5 రోజులు
విపత్తుల్లో బాధితుల పేరుతో ఖర్చు 1కోటి(సుమారు)
పక్కా డ్రెయిన్లు 348 కి.మీ
కచ్చా డ్రెయిన్లు 175 కి.మీ
స్ర్టోమ్ వాటర్ డ్రెయిన్లు 23.50 కి.మీ
పోతురాజు కాలువలో కలిసేవి 34 డివిజన్ల మురుగునీరు
నల్లకాలువలో కలిసేవి 16 డివిజన్ల మురుగునీరు
ఒంగోలు, కార్పొరేషన్, జూన్ 1 (ఆంధ్రజ్యోతి) : 2010 మే 19వ తేదీ గుర్తుకు వస్తేనే శివారుకాలనీ ప్రజలు ఉలిక్కిపడతారు. ఆ రోజు అర్ధరాత్రి అకస్మాత్తుగా వచ్చిన లైలా తుఫాన్ నగరాన్ని అతలాకుతలం చేసింది. ఉప్పెనలా విరుచుకుపడిన తుఫాన్ బీభత్సానికి నగరం నీట మునిగిపోవడమే కాకుండా వందలాది కుటుంబాలు కట్టుబట్టలతో బతుకుజీవుడా అంటూ పరుగులు పెట్టిన భయంకరమైన దుస్థితి. ఇళ్లలోకి చేరిన నీటి ప్రవాహంలో, పురుగులు, పాముల మధ్య గడిపిన దయనీయమైన ఘటనకు పదిహేనేళ్లు నిండాయి. అయినా పోతురాజు కాలువ పూడికతీత పనులు పూర్తికాలేదు. గత వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోగా, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం తిరిగి పనులు ప్రారంభించే దిశగా దృష్టి సారించింది. అందులో భాగంగా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లడంతోపాటు, గత అసెంబ్లీ సమావేశంలోనూ ఈ అంశాన్ని ప్రస్తావించారు. పోతురాజు కాలువ పనుల్లో గత వైసీపీ నిర్లక్ష్యాన్ని తెలియజేస్తూనే జరిగిన అవినీతి, పనుల రద్దు గురించి మాట్లాడారు. అందులో భాగంగా కొత్త డీపీఆర్ తయారు చేసి కాలువ ఆధునికీకరణను పునఃప్రారంభించాలని చూస్తున్నారు. కాలువ పనులపై కార్పొరేషన్, ఇరిగేషన్, రెవెన్యూ శాఖల మధ్య సమన్వయం లోపించడంతో సమస్యకు పరిష్కారం ఎలా ? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
మొదట రూ.12.5కోట్లు.. ఆ తర్వాత రూ. 80 కోట్లు
మొదట్లో పోతురాజు కాలువ ఆధునికీకరణ చేపట్టేందుకు రూ.12.50 కోట్లు కేటాయించారు. పేర్నమిట్ట సమీపంలో ఆరంభమై, క్విస్ పబ్లిక్ స్కూలు సమీపం గుండా గణేష్ నగర్, జయప్రకాష్ కాలనీ, నెహ్రూనగర్, పాపా కాలనీ, భగత్ సింగ్ కాలనీతోపాటు మొత్తం 14 కాలనీల మీదుగా దాదాపు 6 కిలోమీటర్లవరకు విస్తరించింది. ఈ కాలువ పనులను ప్రారంభించేందుకు రూ.11.78 కోట్లను అప్పటి సీఎం రాజశేఖరెడ్డికేటాయించారు. ఆ తర్వాత టీడీపీ అధికారంలోకి రాగా, పూర్తి స్థాయిలో పనులు చేపట్టడానికి సుమారు రూ.40 కోట్లు అవసరం అని అధికారులు లెక్కలు కట్టారు. అప్పటి ఎమ్మెల్యే దామచర్ల హయాంలో గుంటూరు రోడ్‌లోని పోతురాజు కాలువ ఆధునికీకరణ పనులు చేపట్టడంతోపాటు బ్రిడ్జినీ కూడా నిర్మించారు. కాలువ కరకట్టపై కొన్నినివాస గృహాలు ఉండటంతో మిగిలిన పనులకు అడ్డంకులు ఏర్పడ్డాయి. ఆ తర్వాత అధికారులు వాటిని తొలగించేందుకు ముందడుగు వేకపోవడం, తదనంతరం ఎన్నికల కోడ్ రావడంతో పనులు ఆగిపోయాయి.
టన్నుల కొద్ది మురుగు.. తీసేందుకు అడ్డంకులు
ప్రస్తుతం పోతురాజు కాలువలో టన్నుల కొద్ది పూడిక పేరుకుపోయింది. కాలువ నిర్వహణ బాధ్యతలు చూడాల్సిన ఇరిగేషన్ అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తుండడంతో కార్పొరేషన్ అధికారులు 20 రోజుల నుంచి పూడికతీత ప్రారంభించారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తన హయాంలోనే పనులు పూర్తి చేయాలని గట్టిగా భావిస్తుండగా, మూడు శాఖల మధ్య సమన్వయ లోపం వలన జాప్యం చోటుచేసుకుంటోంది. కాలువలో పేరుకుపోయిన వ్యర్థాలు, డెక్క, డిషిల్ట్, ప్లాస్టిక్ వ్యర్థాల తొలగింపు పెద్ద సమస్యగా మారింది. దీంతో కావలి నుంచి ప్రత్యేకంగా తెప్పించిన భారీ ఎక్స్‌వేటర్‌తో పనులు జరుగుతున్నాయి.
ప్రజలకు ఇబ్బంది రాకుండా పనులు
కే వెంకటేశ్వరరావు, నగర కమిషనర్
రానున్న వర్షా కాలంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు కార్పొరేషన్ నిధులు రూ.1.6 కోట్లతో పోతురాజు కాలువ, నల్లకాలువల్లో పూడికతీత పనులు చేపట్టాం. కాలువ నిర్వహణ బాధ్యతలు ఇరిగేషన్ వారే చూసుకోవాల్సి ఉండగా, వారు పెద్దగా జోక్యం చేసుకోవడం లేదు.
ప్రస్తుతం మాకు సంబంధం లేదు
రవికుమార్, ఇరిగేషన్ ఈఈ
పోతురాజు కాలువ పనులు 2024లో రద్దు కావడంతో ప్రస్తుతం మాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ పనుల బాధ్యత కార్పొరేషన్ వారిదే. పోతురాజు కాలువ, నల్లకాలువ ఇరిగేషకు సంబంధించినప్పటికీ కార్పొరేషన్ పరిధిలో ఉండటంతో వాటి నిర్వహణ బాధ్యతలు కార్పొరేషన్ వారే చూసుకోవాలి. మంచినీటి కాలువలను మాత్రమే తాము పర్యవేక్షించాల్సి ఉంది. ఇదే విషయాన్ని ప్రభుత్వానికి కూడా లేఖ రాశాం.
Updated Date - Jun 01 , 2025 | 10:47 PM