ఎస్జీటీలకు మాన్యువల్ కౌన్సెలింగ్
ABN, Publish Date - Jun 11 , 2025 | 01:21 AM
ఉమ్మడి జిల్లాలోని సెకండరీ గ్రేడ్ టీచర్లకు మాన్యువల్ విధానంలో బదిలీల కౌన్సెలింగ్ మొదలై అంతలోనే నిలిచిపోయింది. తొలిరోజైన మంగళవారం టీచర్ల బదిలీల సీనియారిటీ జాబితాలోని మొదటి 350 మందిని కౌన్సెలింగ్‌కు ఆహ్వానించారు.
తొలిరోజు హాజరైన 350 మంది
ప్రిఫరెన్షియల్ కేటగిరీ విషయంలో వివాదంతో జిల్లాలో నిలిచిన ప్రక్రియ
ఒంగోలు విద్య, జూన్ 10 (ఆంధ్రజ్యోతి) : ఉమ్మడి జిల్లాలోని సెకండరీ గ్రేడ్ టీచర్లకు మాన్యువల్ విధానంలో బదిలీల కౌన్సెలింగ్ మొదలై అంతలోనే నిలిచిపోయింది. తొలిరోజైన మంగళవారం టీచర్ల బదిలీల సీనియారిటీ జాబితాలోని మొదటి 350 మందిని కౌన్సెలింగ్‌కు ఆహ్వానించారు. తొలుత 50 మందిని కౌన్సెలింగ్ హాలులోకి పిలిచారు. బదిలీల సీనియారిటీ జాబితాలో ప్రిఫరెన్షియల్ కేటగిరీ విషయంలో వివాదం తలెత్తింది. దీంతో ఉపాధ్యాయ సంఘాల నాయకులు అధికారులతో వాగ్వివాదానికి దిగారు. రాత్రి 9 గంటలకు కౌన్సెలింగ్‌ను వాయిదా వేస్తున్నట్లు డీఈవో కిరణ్‌కుమార్ ప్రకటించారు. ఈ వివాదాన్ని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. బుధవారం ఉదయం 350 మంది కౌన్సిలింగ్‌కు హాజరు కావాలని డీఈవో కోరారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం నిర్వహిస్తున్నది పేరుకు మాన్యువల్ కౌన్సెలింగ్ అయినా జరిగేది అంతా ఆన్‌లైన్‌లోనే. సీనియారిటీ జాబితాలు, ఖాళీల వివరాలు అన్నీ వెబ్‌సైట్ ద్వారా ప్రదర్శిస్తారు. వరుస క్రమంలో ఒక్కో టీచర్‌ను పిలుస్తారు. వారు కోరుకున్న స్థానం, సీనియారిటీ జాబితాలో సంఖ్య అన్నీ నమోదు చేస్తారు. ఆ తర్వాత బదిలీ ఉత్తర్వులు ఆన్‌లైన్‌లో జనరేట్ అవుతాయి. బదిలీల కౌన్సెలింగ్ మూడు రోజుల్లో పూర్తిచేయాలని కమిషనర్ ఆదేశించారు. పాత జడ్పీ మీటింగ్ హాలులో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు.
మార్పులకు నోచాన్స్
కౌన్సెలింగ్ ప్రారంభమైన తర్వాత సీనియారిటీ, ఖాళీల జాబితాల్లో ఎటువంటి మార్పులు, చేర్పులకు అవకాశం లేదని డీఈవో కిరణ్‌కుమార్ తెలిపారు. ఉపాధ్యాయ సంఘాల నాయకులతో మంగళవారం మధ్యాహ్నం స్థానిక సమగ్రశిక్ష జిల్లా ప్రాజెక్టు కార్యాలయంలో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ గ్రీవెన్స్ అన్నీ పరిష్కారం అయ్యాక జాబితాలు ఫ్రీజ్ అవుతాయన్నారు. కౌన్సెలింగ్‌ను పరిశీలించేందుకు యూనియన్‌కు ఒకరిని అనుమతిస్తామన్నారు. జాబితాలపై ఎటువంటి అభ్యంతరాలు తెలపకుండా కౌన్సెలింగ్‌కు సహకరించాలని కోరారు. కౌన్సెలింగ్ కేంద్రానికి మండల విద్యాధికారి-1లను పిలుస్తున్నామని ప్రిఫరెన్షియల్ కేటగిరి, స్పౌజ్ విషయంలో వారి నుంచి వివరణ తీసుకుంటామన్నారు. ఎంఈవోలు ఏమైనా తప్పుడు సమాచారం ఇచ్చినట్లు తేలితే చర్యలు తీసుకుంటామని తెలిపారు.
పాత స్థానాలకు ఎంటీఎస్ టీచర్లు
మినిమం టైం స్కేలు (ఎంటీఎస్)తో పనిచేస్తున్న టీచర్లు పాఠశాలల పునఃప్రారంభ రోజైన ఈనెల 12న వారు పనిచేస్తున్న పాత స్థానాల్లోనే విధులకు హాజరు కావాలని కమిషనర్ ఆదేశించారు. రెగ్యులర్ టీచర్ల బదిలీల ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎంటీఎస్ టీచర్ల సర్దుబాటుపై దృష్టిపెడతామని పేర్కొన్నారు.
పీఈటీ, ఎల్‌పీల వెబ్‌ఆప్షన్లు ప్రారంభం
వ్యాయమ ఉపాధ్యాయులు, భాషా పండితుల బదిలీలకు వెబ్ ఆప్షన్లు మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభమయ్యాయి. ఈ రాత్రితో వెబ్ ఆప్షన్లు గడువు ముగుస్తున్నందున పీఈటీ, ఎల్‌పీలు త్వరితగతిన ఆప్షన్లు పెట్టుకోవాలని అధికారులు కోరుతున్నారు. జిల్లాలో పీఈటీలు 32మంది, భాషాపండితులు 14 మంది బదిలీకి దరఖాస్తు చేశారు. పీఈటీల్లో 12మంది తప్పనిసరిగా స్థానచలనం కావాల్సి ఉండగా 20మంది రిక్వెస్ట్ బదిలీలకు దరఖాస్తు చేశారు. భాషాపండితులు 10మంది తప్పనిసరిగా బదిలీ కావాల్సి ఉండగా నలుగురు అభ్యర్థన మేరకు దరఖాస్తు చేసుకున్నారు. వీరికి వెబ్‌ఆఫ్షన్లు గడువు మంగళవారం రాత్రితో ముగుస్తుంది. బుధవారం బదిలీ ఉత్తర్వులు విడుదల కానున్నాయి.
Updated Date - Jun 11 , 2025 | 01:21 AM