లోగ్రేడ్.... నోబిడ్
ABN, Publish Date - Jul 30 , 2025 | 01:34 AM
పొగాకు మార్కెట్లో నోబిడ్ బేళ్లు భారీగా ఉంటున్నాయి. సోమ, మంగళవారాల్లో దక్షిణాది వేలం కేంద్రాల్లో మూడో వంతు వరకు తిరస్కరణకు గురయ్యాయి. టంగుటూరులో మంగళవారం ఏకంగా అక్కడికి వచ్చిన బేళ్లలో సగానికి పైగా నోబిడ్ అయ్యాయి.
పొగాకు మార్కెట్లో భారీగా తిరస్కరణలు
దక్షిణాదిలో సగటున మూడో వంతు
టంగుటూరులో ఏకంగా సగం నోబిడ్
ఒంగోలు, జూలై 29 (ఆంధ్రజ్యోతి) : పొగాకు మార్కెట్లో నోబిడ్ బేళ్లు భారీగా ఉంటున్నాయి. సోమ, మంగళవారాల్లో దక్షిణాది వేలం కేంద్రాల్లో మూడో వంతు వరకు తిరస్కరణకు గురయ్యాయి. టంగుటూరులో మంగళవారం ఏకంగా అక్కడికి వచ్చిన బేళ్లలో సగానికి పైగా నోబిడ్ అయ్యాయి. ప్రత్యేకించి ఆయా వేలం కేంద్రాల్లో లోగ్రేడ్ బేళ్లను కొనేందుకు బయ్యర్లు ఏమాత్రం ముందుకు రావడం లేదు. దీంతో వాటిని అధికారులు నోబిడ్ చేస్తున్నారు. దక్షిణాదిలోని 11 వేలం కేంద్రాల్లో అమ్మకాలకు మంగళవారం మొత్తం 8,856 బేళ్లను అధికా రులు అనుమతించారు. అందులో 5,040 బేళ్లను మాత్రమే వ్యాపారులు కొనుగోలు చేయగా 3,816 తిరస్కరణకు గురయ్యాయి. అంటే అమ్మకాలకు తెచ్చిన బేళ్లలో సుమారు 43శాతంను కొనుగోలు చేయలేదు. అలా తిరస్కరణకు గురైన 3,816 బేళ్లలో అధికా రులు సూచించిన ధరకు కొనేందుకు బయ్య ర్లు ముందుకు రాక 2,837 (32.03శాతం) నోబిడ్ అయ్యాయి. టంగుటూరు కేంద్రంలో ఏకంగా 50.36శాతం ఉన్నాయి.
మూడో వంతు తిరస్కరణే
ఎస్‌ఎల్‌ఎస్ రీజియన్‌లోని కలిగిరి వేలం కేంద్రంలో 40.93శాతం బేళ్లు, కనిగిరిలో 35.33శాతం, వెల్లంపల్లిలో 33.33శాతం, ఒంగోలు-1 కేంద్రంలో 32.75శాతం నోబిడ్ అయ్యాయి. ఇతరచోట్ల 25 నుంచి 30శాతం వరకు నోబిడ్లు ఉన్నాయి. సోమవారం కూడా మార్కెట్లో ఇలాంటి పరిస్థితే కనిపించింది. ఇంచుమించు మూడో వంతు బేళ్లు నోబిడ్ అయ్యాయి. ప్రత్యేకించి లోగ్రేడ్ బేళ్లు భారీగా తిరస్కరణకు గురవుతున్నాయి. ఈ ఏడాది పొగాకు బోర్డు అనుమతించిన దాని కన్నా అధికంగా పంట ఉత్పత్తి జరిగింది. లోగ్రేడ్ కూడా అధికంగానే వచ్చింది. మరోవైపు మేలురకం బేళ్ల కోసం బయ్యర్లు వేలంలో పోటీ పడుతున్నారే తప్ప ధర పెంచడం లేదు. గత ఏడాదితో పోల్చితే మేలురకం బేళ్ల ధరలు కిలోకు రూ.60 నుంచి రూ.70 వ్యత్యాసం ఉంటోంది. దీంతో మార్కెట్ ఆఖ రులో మేలురకం బేళ్ల ధరలు పెరుగుతా యన్న ఆశతో ప్రస్తుతం లోగ్రేడ్ బేళ్లను అధికంగా రైతులు అమ్మకాలకు తెస్తున్నారు. మేలురకం బేళ్ల కోసం పోటీపడుతున్న వ్యాపారులు లోగ్రేడ్ వైపు కన్నెత్తి చూడటం లేదు. లోగ్రేడ్ అంటే నోబిడ్‌గా పరిస్థితి మారి రైతులు నిత్యం ఇబ్బందిపడుతున్నారు.
Updated Date - Jul 30 , 2025 | 01:34 AM