ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సహకార శాఖలో జీతాలకు లైన్‌క్లియర్‌

ABN, Publish Date - Jul 19 , 2025 | 01:56 AM

జిల్లా సహకారశాఖలో నాలుగు నెలలుగా నెలకొన్న గందరగోళ పరిస్థితికి తాత్కాలికంగా తెరపడింది. ఆ శాఖ జిల్లా కార్యాలయ ఉద్యోగులకు మూడు మాసాలుగా నిలిచిపోయిన జీతాల చెల్లింపునకు మార్గం సుగమమైంది.

డీసీవోగా ఇందిరాదేవికి పూర్తి అదనపు బాధ్యతలు

ఎట్టకేలకు ఉన్నతాధికారుల ఉత్తర్వులు

మంత్రి డాక్టర్‌ స్వామి చొరవ, లోకేష్‌ ఆదేశాలతో వ్యవహారం కొలిక్కి

తొలి నుంచి ఉన్నతాధికారుల తీరుపై ఆరోపణలే

ఒంగోలు, జూలై 18 (ఆంధ్రజ్యోతి) : జిల్లా సహకారశాఖలో నాలుగు నెలలుగా నెలకొన్న గందరగోళ పరిస్థితికి తాత్కాలికంగా తెరపడింది. ఆ శాఖ జిల్లా కార్యాలయ ఉద్యోగులకు మూడు మాసాలుగా నిలిచిపోయిన జీతాల చెల్లింపునకు మార్గం సుగమమైంది. అందుకు వీలుగా ఇన్‌చార్జి డీసీవోగా ఉన్న ఇందిరాదేవికి పూర్తి అదనపు బాధ్యతలను అప్పగిస్తూ ఆ శాఖ కమిషనర్‌ అహ్మద్‌బాబు గురువారం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు. ఈ విషయంలో జిల్లాకు చెందిన మంత్రి డాక్టర్‌ స్వామి చొరవ చూపి ఉద్యోగుల జీతాలు ఆగిపోయిన విషయాన్ని పార్టీ కీలక నేత అయిన మంత్రి నారా లోకేష్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన వెంటనే స్పందించి తగు ఆదేశాలు ఇవ్వడంతో రెండు రోజుల్లో ఉన్నతాధికారులు లోటుపాట్లు సరిచేసుకొని ఇందిరాదేవికి పూర్తి అదనపు బాధ్యతల (ఎఫ్‌ఏసీ)తో డీసీవోగా ఉత్తర్వులు జారీచేశారు.

తొలి నుంచి వివాదాస్పదమే

జిల్లాలో సహకార శాఖను గాడిలో పెట్టాల్సిన రాష్ట్ర ఉన్నతాధికారులు తొలి నుంచి అందుకు విరుద్ధంగానే వ్యవహరిస్తూ వచ్చారన్న విమర్శలు, ఆరోపణలు అధికారపార్టీ పెద్దల నుంచి ఉన్నాయి. డీసీసీబీపై విచారణ విషయంలోనూ, పలు కీలక సహకార సంస్థల పాలకవర్గాల నియామకాలు, ఇతర అంశాల్లోనూ జిల్లాలోని అధికారపార్టీ ప్రజాప్రతినిధుల సూచనలకు భిన్నంగా జిల్లా అధికారులు వ్యవహరించారు. రాష్ట్రస్థాయి ఉన్నతాధికారుల మద్దతుతోనే వారు అలా చేశారన్న ఆరోపణలు బలంగా వచ్చాయి. ఆ క్రమంలో ఇక్కడి డీసీవోగా గతంలో ఉన్న శ్రీనివాసరెడ్డి తీరుపై అధికారపార్టీ ప్రజాప్రతినిధులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడం, అదే సమయంలో పాలనా వ్యవహారాల్లో ఆయన తీరుపట్ల కలెక్టర్‌ అసంతృప్తిగా ఉన్న నేపథ్యంలో గత మార్చిలో శ్రీనివాసరెడ్డిని ప్రభుత్వానికి సరెండర్‌ చేశారు. అలాంటి సమయంలో తక్షణ చర్యలు తీసుకోవాల్సిన ఉన్నతాధికారులు తమ అభీష్టానికి విరుద్ధంగా సరెండర్‌ జరిగిందన్న భావనతో ఇక్కడ ఆ స్థానంలో ఎవ్వరినీ నియమించలేదు. దీంతో పక్షం రోజుల తర్వాత జిల్లాలో ఆ శాఖ వ్యవహారాలు కుంటుపడకుండా ఉండేందుకు డీఎల్‌డీవో కేడర్‌లో డీసీసీబీలో ఓఎస్‌డీగా ఉన్న ఎన్‌.ఇందిరాదేవిని ఇన్‌చార్జీ డీసీవోగా కలెక్టర్‌ అన్సారియా నియమించి ప్రభుత్వానికి తెలియజేశారు.

ధ్రువీకరించకుండా నాన్చుడు

ఇందిరాదేవి నియామకాన్ని ఉన్నతాధికారులు ధ్రువీకరించి ఆ బాధ్యతలను ఆమె నిర్వర్తించేందుకు వీలుగా అన్ని అధికారాలు కల్పిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలి. అయితే అందుకు భిన్నంగా ఉన్నతాధికారులు వ్యవహరించడంతో ఆర్థికపరమైన విషయాలలో ఇందిరాదేవి జోక్యం చేసుకునే వీలు లేకుండా పోయింది. దీంతో కార్యాలయ ఉద్యోగుల జీతాల చెల్లింపు మూడు నెలలుగా నిలిచిపోయాయి. సహకార శాఖలో ఇలా జరుగుతున్న లోటుపాట్లపై పలు సందర్భాలలో ‘ఆంధ్రజ్యోతి’లో కథనాలు ప్రచురితమయ్యాయి. వాటిపై జిల్లాకు చెందిన కీలక ప్రజాప్రతినిధులు, ప్రభుత్వంలో సంబంధిత పెద్దలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తున్నా సమస్య కొలిక్కిరాలేదు. ఈ నేపథ్యంలో ఉద్యోగులు జీతాలు ఆగిపోవడం, అందుకు కారణాలపై ఈనెల 9న ఆంధ్రజ్యోతిలో ‘సహకార శాఖలో విచిత్రం’ శీర్షికన ప్రచురితమైన కథనం ఉన్నతస్థాయిలో కలకలం సృష్టించింది. మంత్రి డాక్టర్‌ స్వామి ఉన్నతస్థాయి పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. ఇంటెలిజెన్స్‌ అధికారులు ఆ రోజున విచారించి ప్రభుత్వానికి నివేదిక పంపారు.

భిక్షాటన చేసి ఉద్యోగుల నిరసన.. పైస్థాయిలో కదలిక

తమకు జీతాలు నిలిచిపోయి అవస్థలు పడుతున్న విషయాన్ని ఈనెల 15న కలెక్టరేట్‌ వద్ద ఆ శాఖ ఉద్యోగులు నిరసన చేపట్టి భిక్షాటన చేశారు. దానిపై ఆంధ్రజ్యోతిలో ప్రచురించిన కథనాన్ని మరోసారి మంత్రి నారా లోకేష్‌ దృష్టికి మంత్రి డాక్టర్‌ స్వామి తీసుకెళ్లారు. దీనిని సీరియస్‌గా తీసుకున్న లోకేష్‌ బుధవారం అధికారులపై మండిపడి తక్షణ చర్యలకు ఆదేశించినట్లు సమాచారం. తదనుగుణంగా సీఎంవో అధికారుల సూచనలతో రాష్ట్ర సహకారశాఖ అధికారులు కదిలారు. రెండు రోజుల్లో సమస్య పరిష్కరిస్తామంటూ డీసీవో ద్వారా బుధవారం సాయంత్రం వివరణ ఇచ్చారు. అందుకు వీలుగా గురువారం రాత్రి ఇందిరాదేవికి డీసీవో బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అయితే ఎఫ్‌ఏసీ బాధ్యతలు ఇవ్వడం కన్నా మరొక అధికారిని ఇక్కడ డీసీవోగా నియమించాలని ఉన్నతాధికారులు తొలుత ఆలోచన చేసి కడప జిల్లాకు చెందిన ఒక మహిళా అధికారి పేరు సూచిస్తూ ఫైల్‌ కూడా సిద్ధం చేసినట్లు సమాచారం. ఇక్కడకు వచ్చేందుకు ఆమె సుముఖత చూపకపోవడం, తక్షణం ఇక్కడ జీతాల సమస్య పరిష్కారం అవసరం ఉండటంతో ఇందిరాదేవికి ఎఫ్‌ఏసీ బాధ్యతలు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. అలా ఆశాఖలో నాలుగైదు నెలలుగా సాగుతున్న గందరగోళానికి తాత్కాలికంగా తెరపడింది.

Updated Date - Jul 19 , 2025 | 01:56 AM