భూంఫట్
ABN, Publish Date - May 28 , 2025 | 01:30 AM
దేవదాయశాఖ అధికారుల నిర్లక్ష్యంతో తాళ్లూరు మండలం మన్నేపల్లిలో చెన్నకేశవస్వామికి చెందిన కోట్లాది రూపాయల విలువైన భూములు అన్యాక్రాంతమయ్యాయి. రికార్డుల్లో స్వామిపేరిట ఉన్నా, రైతులు తమవి అన్నట్లు ఏళ్ల తరబడి సాగుచేసుకుంటున్నారు. కౌలు కూడా చెల్లించకపోవడంతో ఆలయానికి ఆదాయం లేక గ్రామస్థులే దాతల సహకారంతో ఆలనాపాలన చూసుకుంటున్నారు.
మన్నేపల్లిలో చెన్నకేశవస్వామి ఆలయ భూములు కబ్జా
దర్జాగా పంటల సాగు
63 ఎకరాలు ఉన్నా దేవుడికి పైసా చెల్లించని వైనం
పట్టించుకోని దేవదాయశాఖ అధికారులు
దాతల సాయంతో ఆలయ పునర్నిర్మాణం
తాళ్లూరు, మే 27 (ఆంధ్రజ్యోతి): దేవదాయశాఖ అధికారుల నిర్లక్ష్యంతో తాళ్లూరు మండలం మన్నేపల్లిలో చెన్నకేశవస్వామికి చెందిన కోట్లాది రూపాయల విలువైన భూములు అన్యాక్రాంతమయ్యాయి. రికార్డుల్లో స్వామిపేరిట ఉన్నా, రైతులు తమవి అన్నట్లు ఏళ్ల తరబడి సాగుచేసుకుంటున్నారు. కౌలు కూడా చెల్లించకపోవడంతో ఆలయానికి ఆదాయం లేక గ్రామస్థులే దాతల సహకారంతో ఆలనాపాలన చూసుకుంటున్నారు. మన్నేపల్లి రెవెన్యూ పరిధిలో వెంకటగిరి రాజుల కాలంలో చెన్నకేశవస్వామి ఆలయం నిర్మించారు. దానికి 63 ఎకరాల భూమిని కేటాయించారు. దీని విలువ ప్రస్తుత ధరల ప్రకారం దాదాపు రూ.10 కోట్ల పైమాటే. సర్వేనంబర్ 881/1లో 0.23 ఎకరాలు, 621/3లో 0.63ఎకరాలు, 457/1లో 14.46 ఎకరాలు, 545లో 16.91ఎకరాలు, 621/1లో10.90ఎకరాలు, 621/3లో 0.63ఎకరాలు, 675/5లో 0.96 ఎకరాలు, ,674/10లో 0.97 ఎకరాలు, 130/1లో 6.02 ఎకరాలు, 134లో 12.10ఎకరాలు కలిపి మొత్తం 63.18 ఎకరాలు ఆలయం పేరిట ఉన్నాయి.
42ఏళ్ల క్రితం దేవదాయ శాఖకు అప్పగింత
పూర్వం ఆభూములు వెంకటగిరి సంస్థానాధీశుల పేరున ఉండగా, 1982-83లో దేవదాయ శాఖకు అప్పగించారు. అప్పటి ఈవో పాండురంగారెడ్డి ఆభూములను స్వాధీనం చేసుకొని చెన్నకేశవస్వామికి చెందినవిగా రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయించారు. వీటిల్లో 30ఎకరాలు మంగళి మాన్యంగా వారి ఆధీనంలో ఉండగా, మిగిలిన 33 ఎకరాలు పలువురు రైతులు సాగుచేసుకుంటున్నారు. 63 ఎకరాల భూములు దేవునిపేరున రికార్డుల్లో నమోదైఉన్నా, ఒక ఎకరా కూడా దేవదాయశాఖ ఆధీనంలో లేదు. ఆలయ భూములకు 1బీ, అడంగల్‌లో చెన్నకేశవస్వామి పేరున భూములు ఉండి, పట్టాదార్ పాసుపుస్తకాలు కూడా ఉన్నాయి. ఆభూములను సాగుచేసుకుంటున్న రైతులు తమ వద్ద సెటిల్‌మెంట్ పట్టాలన్నాయంటూ వాటిని అనుభవిస్తున్నారు. కొందరు స్వార్థపరులు తమకున్న రాజకీయ పలుకుబడితో దేవుడి భూములను ఆక్రమించుకుని దర్జాగా పంటలు సాగు చేసుకుంటున్నా దేవదాయ శాఖ అధికారులు మిన్నకుండటం ఆరోపణలు తావిస్తోంది.
చందాలు వేసుకుని ఆలయ పునర్నిర్మాణం
మన్నేపల్లి చెన్నకేశవస్వామికి 63 ఎకరాల మాన్యం భూములున్నా దేవదాయశాఖ ఆభూములను స్వాధీనం చేసుకుని కౌలు కూడా వసూలు చేయడం లేదు. పురాతన కాలంతో నిర్మించిన చెన్నకేశవస్వామి ఆలయం పూర్తిగా శిథిలమైంది. దేవదాయశాఖ చుట్టూ తిరిగినా ఆలయ అభివృద్ధి గురించి పట్టించుకోపోవటంతో గ్రామస్థులు చందాలు వసూలుచేసి ఆరేళ్ల క్రితం పునర్నిర్మించారు. అప్పటి నుంచి దూపదీప నైవేద్యాలు, ఉత్సవాలకు దాతలపై ఆధారపడాల్సి వస్తుందని గ్రామస్థులు చెప్తున్నారు. ఈవిషయమై తాళ్లూరు మండల దేవదాయశాఖ ఈవో జి.వాసుబాబును వివరణకోరగా... మన్నేపల్లి చెన్నకేశవస్వామి ఆలయానికి రెగ్యులర్ ఈవో లేరన్నారు. ఆలయానికి రెవెన్యూ రికార్డుల మేర 63 ఎరాల మాన్యం భూమి ఉన్నట్లు 1బీ అడంగల్, పట్టాదార్ పాస్ పుస్తకాలు ఉన్నాయన్నారు. రెగ్యులర్ ఈవో నియామకం జరిగితే పరిశీలించి తగు చర్యలు తీసుకుంటారని చెప్పారు.
Updated Date - May 28 , 2025 | 01:41 AM