కూటమి పండుగ
ABN, Publish Date - Jun 05 , 2025 | 01:27 AM
రాష్ట్రంలో కూటమి గెలిచి ఏడాది పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా టీడీపీ, జనసేన శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. పలుప్రాంతాల్లో కేక్ కటింగ్‌లు, బాణసంచా కాల్చడంతోపాటు ముగ్గులు వేసి ఆనందం వ్యక్తం చేశారు.
ప్రజా తీర్పునకు ఏడాది పూర్తి
టీడీపీ, జనసేన శ్రేణుల సంబరాలు
పలుచోట్ల కేక్ కటింగ్‌లు
ఒంగోలు, జూన్ 4 (ఆంఽధ్రజ్యోతి): రాష్ట్రంలో కూటమి గెలిచి ఏడాది పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా టీడీపీ, జనసేన శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. పలుప్రాంతాల్లో కేక్ కటింగ్‌లు, బాణసంచా కాల్చడంతోపాటు ముగ్గులు వేసి ఆనందం వ్యక్తం చేశారు. వైసీపీ ఐదేళ్ల అరాచక పాలనకు చమరగీతం పాడుతూ ప్రజానీకం ఇచ్చిన తీర్పు గత ఏడాది జూన్ 4న వెల్లడైంది. జిల్లాలోనూ, రాష్ట్రంలోనూ టీడీపీ కూటమి అనూహ్య విజయాలు సాధించి అధికారంలోకి వచ్చింది. అనంతరం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టింది. కాగా కూటమికి పట్టం కడుతూ ప్రజాతీర్పు వెల్లడై బుధవారం నాటికి ఏడాది ముగియడంతో పెద్ద ఎత్తున ఆ పార్టీ లు సంబరాలు చేసుకున్నాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఈసందర్భంగా ఒక వైపు టీడీపీ, మరో వైపు జనసేన శ్రేణులు ఈ కార్యక్రమాలు నిర్వహించాయి. ఒంగోలులోని మాగుంట కార్యాలయంలో బుధవారం ఉదయం కేక్ కట్ చేశారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డితోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. స్థానిక మంగమూరు రోడ్డులోని సంతనూతలపాడు నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఆ నియోజకవర్గ నేతల సమక్షంలో బీఎన్ విజయకుమార్ కేక్ కట్ చేశారు. స్థానిక ప్రగతి కాలనీలో జనసేన వీరమహిళలు ముగ్గులు వేసి సంబరాలు నిర్వహించగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ పాల్గొన్నారు. రాత్రి అద్దంకి బస్టాండు సెంటర్‌లో ఒంగోలు నియోజకవర్గ నాయకులు నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీ మాగుంట, పీడీసీసీ బ్యాంకు చైర్మన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడడు షేక్ రియాజ్, మేయర్ గంగాడ సుజాతలు పాల్గొన్నారు. పెద్దఎత్తున బాణసంచాను కాల్చారు. మార్కాపురంలో టీడీపీ నేత కందుల రామిరెడ్డి నేతృత్వంలో అక్కడి ఎన్టీర్ విగ్రహం వద్ద సంబరాలు నిర్వహించారు. దర్శిలో టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. అలాగే కొమరోలులో గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి, వైపాలెంలో అక్కడి టీడీపీ ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబులు పాల్గొన్నారు. జిల్లాలోని పలు ఇతర ప్రాంతాల్లోనూ అక్కడి టీడీపీ, జనసేన శ్రేణులు సంబరాలు నిర్వహించాయి.
Updated Date - Jun 05 , 2025 | 01:27 AM