తల్లిదండ్రులకు జూన్‌జాటం
ABN, Publish Date - Jun 08 , 2025 | 02:12 AM
సామాన్య కుటుంబాల వారు జూన్ వచ్చిందంటేనే భయపడిపోతున్నారు. అమ్మో.. అంటూ నోరెళ్లబెడుతున్నారు. నెలరోజుల వేసవి సెలవుల్లో ఆటపాటలతో ఆనందంగా గడిపిన విద్యార్థులు పుస్తకాలతో కుస్తీ పట్టేందుకు సిద్ధమవుతుండగా, వారి తల్లిదండ్రులు మాత్రం ఆర్థిక ఇబ్బందులను అధిగమించేది ఎలా అని ఆలోచన చేస్తున్నారు.
మధ్యతరగతి కుటుంబాల్లో గుబులు
ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల మోత
పెరిగిన బ్యాగులు, పుస్తకాల ధరలు
విద్యార్థుల తల్లిదండ్రులపై రూ.లక్షల్లో భారం
ఏటికేడు అధికమవుతున్న ఖర్చులు
ఒంగోలులోని బాలాజీనగర్‌కు చెందిన వీరాంజనేయులు తన మనుమడిని ఫస్ట్ క్లాస్ చదివించేందుకు ఓ కార్పొరేట్ స్కూలులో అడ్మిషన్‌కు వెళ్లారు. ఫీజు, బెల్ట్, టై, పుస్తకాలు కలిపి మొత్తం రూ.35వేలు చెల్లించాలనడంతో అవాక్కయ్యారు. యూనిఫాం మాత్రం బయట తీసుకోవాలని చెప్పడంతో ఏం చేయాలో అర్థం కాలేదు. తెలిసిన వాళ్లతో చెప్పించుకుంటే రూ.3వేలు తగ్గిస్తామన్నారు. దీంతో చేసేదేమీ లేక అడ్మిషన్ రాసి వచ్చారు.
నగరంలోని విజయనగర్ కాలనీలో నివసించే శ్రీనివాసరావు ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. తన ఇద్దరు పిల్లలను ఓ ప్రైవేటు స్కూలులో చదివిస్తున్నారు. కుమార్తె టెన్త్, కుమారుడు 7వ తరగతి. ఈ ఏడాది పాపకు రూ.30వేలు, బాబుకు రూ.28వేలకు ఫీజు పెంచినట్లు స్కూలు యాజమాన్యం చెప్పింది. ఆర్థిక భారమైనా స్కూలు మార్చలేక అక్కడే కొనసాగించాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
టంగుటూరు మండలం కారుమంచి గ్రామానికి చెందిన శ్రీనివాసరావు కుమారుడు ఇటీవల 10వ తరగతి మంచి మార్కులతో పాసయ్యాడు. ఇంటర్ చేర్పించడానికి ప్రైవేటు కాలేజీకి వెళ్లిన ఆయన ఫీజుల వివరాలు చూసి అవాక్కయ్యారు. డేస్కాలర్‌కు ఏడాదికి రూ.50వేలపైనే అవుతుండగా, హాస్టల్‌లో చేర్చాలంటే అన్నీ కలిపి రూ.లక్షపైనే చెప్పారు. దీంతో అమ్మో.. ఇవేమి ఫీజులు అంటూ అవాక్కయ్యాడు.
సామాన్య కుటుంబాల వారు జూన్ వచ్చిందంటేనే భయపడిపోతున్నారు. అమ్మో.. అంటూ నోరెళ్లబెడుతున్నారు. నెలరోజుల వేసవి సెలవుల్లో ఆటపాటలతో ఆనందంగా గడిపిన విద్యార్థులు పుస్తకాలతో కుస్తీ పట్టేందుకు సిద్ధమవుతుండగా, వారి తల్లిదండ్రులు మాత్రం ఆర్థిక ఇబ్బందులను అధిగమించేది ఎలా అని ఆలోచన చేస్తున్నారు. అడ్మిషన్ నుంచి పిల్లలు తరగతి గదిలో అడుగుపెట్టేంత వరకు వారికి లెక్కల పరీక్షే. ఖర్చుల మోతే.
ఒంగోలు కార్పొరేషన్,జూన్ 7 (ఆంధ్రజ్యోతి) : జూన్ నెల అనగానే పేద, మధ్యతరగతి కుటుంబాల్లో ఖర్చుల దడ పుడుతోంది. ఏటికేడు పెరుగుతున్న స్కూలు, కాలేజీ ఫీజులు, అందుకు అయ్యే ఇతర వ్యయం తలచుకుంటేనే గుండె గుభేల్‌మంటోంది. ఈనెలలో విద్యా సంస్థల పునఃప్రారంభంతో ఖర్చు తడిసి మోపెడవుతోంది. దీంతో నెలవారీ జీతాలపైనే ఆధారపడి కుటుంబాలు నెట్టుకొచ్చే మధ్యతరగతి వారు లెక్కలతో మల్లగుల్లాలు పడుతున్నారు. ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలు ఫీజులు, పుస్తకాలు, బస్సు చార్జీలు, యూనిఫాంలు, యాప్‌ల రూపంలో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి భారీగా వసూళ్లకు దిగడంతో వారు ఆందోళన చెందుతున్నారు.
భారీగా ఫీజులు
పాఠశాలలు ఈనెల 12 నుంచి పునఃప్రారంభం కానున్నాయి. ప్రైవేటు స్కూలు యాజమాన్యాలు ఒకటో తేదీ నుంచే అడ్మిషన్‌ల ప్రక్రియను ప్రారంభించాయి. అదేసమయంలో తల్లిదండ్రులు ఖర్చులకు భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా పిల్లలు స్కూలులో అడుగు పెట్టాలంటే పుస్తకాలు, నోట్‌బుక్కులతోపాటు, బ్యాగు, దానికితోడు లంచ్ బాక్స్, పెన్ను, పెన్సిల్ నోట్ బుక్స్.. ఇలా ఒకటేమిటి రకరకాలు కొనుగోలు తప్పనిసరి. గతంలో విద్యార్ధులు కావలసిన పుస్తకాలు తమకిష్టమొచ్చిన చోట కొనుక్కునేవారు. అయితే ఇప్పుడు పాఠశాలల పంథా మారింది. పెన్సిల్ దగ్గర నుంచి పుస్తకాల వరకు, బెల్టు, టై, షూస్, యూనిఫాం అన్నీ ఆయా స్కూళ్లలోనే కొనాలి. దీంతో ఒక్కో విద్యార్ధికి సుమారు రూ.10వేలకుపైనే ఖర్చు కళ్ల ముందు కనిపిస్తోంది. ఇక ఏటా పెరుగుతున్న ఫీజులతో అదనంగా మరో రూ.25వేలు కట్టాల్సి వస్తోంది. ఒకవైపు ఆర్ధికభారం.. మరోవైపు పిల్లల భవిష్యత్ కోసం మౌనంగానే ముందడుగు వేస్తున్నారు.
ఒక్కో కుటుంబంపై రూ.వేలల్లో భారం
మద్యతరగతి కుటుంబాలది ఎపుడూ లెక్కల పుస్తకమే. ఒకవైపు నిత్యావసర సరుకులు, వివిధ అవసరాల ఖర్చులు అడ్డగోలుగా పెరిగిపోయాయి. దీంతో ఏనెలకానెల ఆదాయ, వ్యయాలపై ఆచితూచీ అడుగులు వేస్తున్నవారిలో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, రోజువారీ కూలీలు ఉన్నారు. అయితే చదువు విషయంలో పేద, మధ్య తరగతి అనే భేదం లేదు. సాధారణ రోజుల్లోనే ఒక చిన్న కుటుంబం ఇంటి అవసరాలకు సుమారు రూ. 25 నుంచి 30వేల వరకు ఖర్చవుతోంది. ఈనెలలో ఇంటి అవసరాలను పక్కన పెడితే కేవలం పిల్లల స్కూలు కోసం ఒక్కొక్కరికీ సుమారు రూ.30వేల నుంచి రూ.50వేల వరకూ ఖర్చుచేయాల్సి వస్తుందని వాపోతున్నారు. అయితే ఒకరితో సరిపెట్టుకునే అంశం కాదని, ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఇక అంతే.. జూన్‌లో లక్ష రూపాయలకుపైనే ఖర్చు చేయాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు.
Updated Date - Jun 08 , 2025 | 02:12 AM