పాత్రికేయులూ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి
ABN, Publish Date - Jun 24 , 2025 | 11:43 PM
రోజురోజుకూ కొత్తపుంతలు తొక్కుతున్న సాంకేతిక పరిజ్ఞానంపై పాత్రికేయులు అవగాహన పెంచుకోవాలని, అప్పుడే వారిలో వృత్తి నైపుణ్యం పెరుగుతుందని పలువురు పత్రికారంగ ప్రముఖులు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలి్‌స్ట(ఏపీయూడబ్ల్ల్యూజే) 36వ రాష్ట్ర మహాసభలు మంగళవారం ఒంగోలులో ప్రారంభమయ్యాయి.
సెమినార్‌లో పత్రికారంగ ప్రముఖులు
ఒంగోలులో ప్రారంభమైన ఏపీయూడబ్ల్యూజే 36వ రాష్ట్ర మహాసభలు
ఒంగోలు కల్చరల్, జూన్ 24(ఆంధ్రజ్యోతి) : రోజురోజుకూ కొత్తపుంతలు తొక్కుతున్న సాంకేతిక పరిజ్ఞానంపై పాత్రికేయులు అవగాహన పెంచుకోవాలని, అప్పుడే వారిలో వృత్తి నైపుణ్యం పెరుగుతుందని పలువురు పత్రికారంగ ప్రముఖులు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలి్‌స్ట(ఏపీయూడబ్ల్ల్యూజే) 36వ రాష్ట్ర మహాసభలు మంగళవారం ఒంగోలులో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఒంగోలు ఎన్టీఆర్ కళాపరిషత్‌లో కృత్రిమ మేథ సామాజిక మాధ్యమాలు-వాస్తవాల నిర్ధారణ అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. ఈ సెమినార్‌కు ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐ.వి.సుబ్బారావు అధ్యక్షత వహించగా ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్(ఐజేయూ) ప్రెసిడెంట్, తెలంగాణా మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాసరెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ముందుగా ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం సోషల్ మీడియా ద్వారా ఫేక్ న్యూస్ శరవేగంగా వ్యాప్తి చెందుతున్నాయని చెప్పారు. వాటిని వెంటనే వివిధ సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేయకూడదన్నారు. ఐజేయూ ప్రెసిడెంట్ కె.శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం ఏఐ టెక్నాలజీ అన్ని రంగాలలో ప్రవేశిస్తోందని, దీనిపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం రాబోయే రోజుల్లో ఏఐ టెక్నాలజీ వినియోగంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉండేందుకు కృషిచేస్తున్నట్లు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.
ప్రధాన వక్త నరసింహ స్వామి మాట్లాడుతూ ఏఐ ద్వారా ఎన్ని అద్భుతాలు సృష్టించవచ్చు.. ఒక ఫొటో, వీడియో లేదా వార్త నిజమైనదా, కాదా ఎలా తెలుసుకోవచ్చు అనే విషయాలను కూలంకషంగా వివరించారు. అదేవిధంగా వార్తల సేకరణ, పంపిణీ విషయంలోనూ, పత్రికారంగంలోనూ ఏఐ టెక్నాలజీ ఏవిధంగా ఉపయోగపడుతుందో తెలిపారు. విశాలాంధ్ర గ్రూప్ ఎడిటర్ కె.అజయ్ మాట్లాడుతూ దేశంలో యూట్యూబ్ చానళ్ల సంఖ్య ఎక్కువగా ఉందని, అంతేగాక వాట్సాప్, ఫేస్‌బుక్, యూట్యూబ్, ఎక్స్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా ఫేక్ న్యూస్ విశృంఖలంగా వస్తున్నాయని వాటి పట్ల పాత్రికేయులు అప్రమత్తంగా ఉండాలన్నారు.
సభాధ్యక్షులు ఐ.వి.సుబ్బారావు మాట్లాడుతూ యూనియన్ రాష్ట్ర మహాసభలు ఒంగోలులో నిర్వహించటం ఆనందంగా ఉందని, ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న కృత్రిమ మేధ సామాజిక మాధ్యమాలపై సెమినార్ నిర్వహించటం పాత్రికేయులకు ఎంతో ఉపయోగంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఐజేయూ జనరల్ సెక్రటరీ బల్వీందర్ సింగ్, స్టీరింగ్ కమిటీ సభ్యులు ఎస్.వి.సిన్హా, జాతీయ కార్యదర్శి డి.సోమసుందర్, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్‌లు ప్రసంగించగా, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ సురేష్, ప్రకాశం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎన్.వి.రమణ, దాసరి కనకయ్య, ఏపీ ఎలక్ర్టానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకట్రావు, ఇఫ్తేకర్ బాషా కార్యక్రమ నిర్వహణకు సహకారాన్ని అందించారు.
సెమినార్‌లో వివిధ జిల్లాల నుంచి సుమారు 250 మంది పాత్రికేయులు పాల్గొన్నారు. ఇక బుధవారం ఒంగోలు దక్షిణ బైపా్‌సలోని విష్ణుప్రియ కన్వెన్షన్‌లో యూనియన్ మహాసభ ఉదయం 10.30 గంటల నుంచి జరుగుతుందని యూనియన్ ప్రతినిధులు తెలిపారు.
Updated Date - Jun 24 , 2025 | 11:43 PM