చీకటిపడితే బిక్కుబిక్కు !
ABN, Publish Date - May 12 , 2025 | 10:36 PM
మార్కాపురం పట్టణంతోపాటు డివిజన్‌లోని అన్ని మండలాల నుంచి వచ్చే రోగులకు కీలకమైనది ప్రభుత్వ సర్వజన వైద్యశాల. స్థానిక గుండ్లకమ్మ నది ఒడ్డున ఉన్న ఈ వైద్యశాలకు రాత్రి సమయాల్లో చేరుకోవాలంటే రోగులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సివస్తోంది. గుండ్లకమ్మ బ్రిడ్జిపై ఉన్న వీధిదీపాలు నెలలుగా వెలగడం లేదు.
గుండ్లకమ్మ బ్రిడ్జిపై
వెలగని వీదిదీపాలు
వైద్యశాలకు వెళ్లడానికి
అవస్థలు పడుతున్న ప్రజలు
మార్కాపురం, మే 12 (ఆంధ్రజ్యోతి) : మార్కాపురం పట్టణంతోపాటు డివిజన్‌లోని అన్ని మండలాల నుంచి వచ్చే రోగులకు కీలకమైనది ప్రభుత్వ సర్వజన వైద్యశాల. స్థానిక గుండ్లకమ్మ నది ఒడ్డున ఉన్న ఈ వైద్యశాలకు రాత్రి సమయాల్లో చేరుకోవాలంటే రోగులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సివస్తోంది. గుండ్లకమ్మ బ్రిడ్జిపై ఉన్న వీధిదీపాలు నెలలుగా వెలగడం లేదు. మున్సిపాలిటీలో అంతర్భాగం కాకపోయినా ప్రజా ప్రాధాన్యత దృష్ట్యా దశాబ్ధాలుగా పురపాలక ఇంజనీరింగ్ అధికారులే వైద్యశాల వరకు వీధి దీపాల నిర్వహణ చూస్తున్నారు. అప్పట్లో బ్రిడ్జిపై రాకపోకలు సాగించే వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా మున్సిపాలిటీ ఇంజనీరింగ్ విభాగం హైమాక్స్ వీధి దీపాలు అమర్చింది. సుమారు 10 వరకు పోల్స్ ఉన్నా ప్రస్తుతం వెలుగుతున్నది కేవలం రెండు మాత్రమే. రాత్రి సమయాల్లో రోగులతోపాటు అటుగా ప్రయాణం సాగించే వాళ్లు బ్రిడ్జి వెళ్లాలంటే భయపడాల్సి వస్తోంది. వైద్యశాలలో పనిచేసే కొందరు సిబ్బంది సైకిళ్లపై కూడా వస్తూ పోతుంటారు. అలాంటి వాళ్లు రాత్రి వైద్యశాలకు వెళ్లాలంటే తీవ్ర అవస్థలు పడాల్సివస్తోంది. అంతేకాక గుండ్లకమ్మ బ్రిడ్జిపై అక్కడక్కడా గుంతలు కూడా ఉన్నాయి. వెలుతురు లేకపోవడంతో చిన్నపాటి వాహనాలపై వెళ్లేవాళ్లు కూడా అవస్థల ప్రయాణం చేయాల్సివస్తోంది. ఈ సమస్యను చాలామంది మున్సిపాలిటీ అధికారుల దృష్టికి తీసుకొచ్చినా పట్టించుకోవడంలేదు. రూ.లక్షల మేర పట్టణంలో వీధి దీపాల నిర్వహణకు ఖర్చు చేస్తోన్న మున్సిపాలిటీ ఇంజనీరింగ్ విభాగం కీలకమైన వైద్యశాలకు వెళ్లే ప్రాంతంలో మరమ్మతులు చేయడానికి చొరవచూపకపోవడం శోచనీయం.
వెంటనే పరిశీలించి వీధి దీపాలను పునరుద్ధరిస్తాం
గుండ్లకమ్మ బ్రిడ్జిపై వీధి దీపాలు వెలగని విషయం మా దృష్టికి రాలేదు. అన్ని స్థంభాలపై ఉన్న వీధి దీపాలను పరిశీలంచి తప్పక మరమ్మతులు చేయిస్తాం. అవసరమైతే నూతన లైట్లు ఏర్పాటు చేస్తాం. వాస్తవానికి పెద్దపాటి సం్థభాలు కావడంతో వర్కర్లు ఎక్కి చేసే అవకాశం లేదు. క్రేన్ సాయంతో మాత్రమే ఆ స్థంభాలపై ఉన్న లైట్లను పరిశీలించే అవకాశం ఉంది.
Updated Date - May 12 , 2025 | 10:36 PM