ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ముందుకు ‘సాగు’నా..?

ABN, Publish Date - Jun 26 , 2025 | 11:26 PM

మారిన వాతావరణం రైతులను అయోమయానికి గురిచేస్తోంది. జూన్‌ ముగుస్తున్నా ఇంకా తొలకరి పైర్లకు విత్తనం చాలాచోట్ల పడలేదు. సాధారణంగా ఈ సమయంలో ఒక మోస్తరు వర్షాలు పడుతూ తొలకరి పైర్ల సాగుతోపాటు ప్రధానమైన ఖరీఫ్‌ పంటల సాగుకు అవసరమైన పనులను రైతులు చేస్తుంటారు. ఈ ఏడాది రుతుపవనాలు ముందుగా రావడం, మే నెల రెండో పక్షంలో మంచి వర్షాలు పడటంతో రైతులు ఈ సీజన్‌ పంటల సాగుపై నమ్మకం పెంచుకొని దుక్కులు దున్నకం చేసి విత్తనాలు వేసేందుకు సిద్ధమయ్యారు. ఇంచుమించు నెలరోజులుగా జిల్లాలో సరైన వర్షం కురవక పోవడమే కాక ఉష్ణోగ్రతలు కూడా అధికంగా నమోదవుతుండటంతో ఆందోళన చెందుతున్నారు.

మారిన వాతావరణంతో రైతుల్లో అయోమయం

జూన్‌ ముగుస్తున్నా తొలకరి పైర్లకు పడని విత్తనం

దుక్కులు దున్ని వాన కోసం ఎదురుచూపులు

మారిన వాతావరణం రైతులను అయోమయానికి గురిచేస్తోంది. జూన్‌ ముగుస్తున్నా ఇంకా తొలకరి పైర్లకు విత్తనం చాలాచోట్ల పడలేదు. సాధారణంగా ఈ సమయంలో ఒక మోస్తరు వర్షాలు పడుతూ తొలకరి పైర్ల సాగుతోపాటు ప్రధానమైన ఖరీఫ్‌ పంటల సాగుకు అవసరమైన పనులను రైతులు చేస్తుంటారు. ఈ ఏడాది రుతుపవనాలు ముందుగా రావడం, మే నెల రెండో పక్షంలో మంచి వర్షాలు పడటంతో రైతులు ఈ సీజన్‌ పంటల సాగుపై నమ్మకం పెంచుకొని దుక్కులు దున్నకం చేసి విత్తనాలు వేసేందుకు సిద్ధమయ్యారు. ఇంచుమించు నెలరోజులుగా జిల్లాలో సరైన వర్షం కురవక పోవడమే కాక ఉష్ణోగ్రతలు కూడా అధికంగా నమోదవుతుండటంతో ఆందోళన చెందుతున్నారు.

ఒంగోలు, జూన్‌ 26(ఆంధ్రజ్యోతి) : జిల్లాలో సాధారణంగా మే రెండో పక్షం నుంచి జూన్‌ తొలివారం వరకు వేసవి తీవ్రత అధికంగా ఉంటుంది. ఆ సమయంలో రోహిణి కార్తె కావడంతో రోళ్లు పగిలే ఎండలు కాస్తాయన్న నానుడికి అనుగుణంగా ఉష్ణోగ్రత కూడా 45 డిగ్రీల వరకు నమోదవుతాయి. తర్వాత వచ్చే మృగశిర కార్తెలో జల్లులు ఆరంభమై ఆరుద్ర కార్తెలో పెరుగుతాయి. అలా మృగశిరలో తిరిగి వాతావరణం చల్లబడటంతో ఉపశమనం లభిస్తుంది. ‘మృగశిరలో వానలు పడితే ముసలి ఎద్దు కూడా రంకె వేస్తుంది, అలాగే అరుద్ర కార్తెలో వర్షం కురిస్తే ఆరు కార్తెల్లోనూ కురుస్తాయి. ఆరుద్ర కరుణిస్తే దరిద్రం పోతుంది’ అన్నవి రైతాంగంలో ఎప్పటి నుంచో ఉండే నానుడి.

మేలో వానలు.. జూన్‌లో ఎండలు

రాళ్లు పగిలే ఎండలు కాయాల్సిన రోహిణి కార్తెలో జోరు వానలు కురిశాయి. మే నెలలో జిల్లాలో సాధారణ వర్షపాతం 53.0 మి.మీ కాగా ఈ ఏడాది ఏకంగా 103.01 మి.మీ నమోదైంది. దాదాపు సగం మండలాల్లో అక్కడ పడాల్సిన వర్షం కన్నా రెట్టింపు నుంచి నాలుగైదు రెట్లు కురిసింది. ప్రత్యేకించి గిద్దలూరు, మార్కాపురం, దర్శి, వైపాలెం, కనిగిరి నియోజకవర్గాల్లోని పలు మండలాల్లో అధికంగా ఉంది. ఇతర ప్రాంతాల్లోనూ సాధారణం కన్నా అధికంగానే కురిసింది. అలా సాగు సాధారణంగా జల్లులు పడే మృగశిర ఆరంభం నాటికి జిల్లాలో ఎండల తీవ్రతకు బదులు రోహిణి కార్తెలో వర్షాలు పడటంతో రైతులు ఆనందంగా సాగుకు సిద్ధమయ్యారు. తొలకరి పైర్లు అయిన సజ్జ, నువ్వు, పెసరలతో పాటు పచ్చిరొట్ట ఎరువులకు ఉపకరించేవి అలాగే పశుగ్రాస పంటల సాగుకు ఉపక్రమించడంతోపాటు ప్రధాన ఖరీఫ్‌ పంటలైన పత్తి, కంది, మినుము ఇతర పంటల సాగుకు భూములు సిద్ధం చేసే పనులు చేపట్టారు.

కొనసాగుతున్న బెట్ట వాతావరణం

కొన్నిచోట్ల బోర్లు ఇతర పరిమితి నీటి సౌకర్యం దగ్గర వేసవి పత్తి సాగు చేస్తారు. మృగశిర కార్తె రైతాంగాన్ని నిరాశపర్చగా ప్రస్తుతం ఆరుద్ర వచ్చినా వాన జాడ లేదు. రోహిణి ముగిసిన జూన్‌ 8న మృగశిర కార్తె రాగా ఈనెల 22తో మృగశిర కార్తె ముగిసి ఆరుద్ర వచ్చింది. ఈ రెండు కార్తెల్లోనూ బెట్ట వాతావరణమే నెలకొంది. ఈ నెలలో జిల్లాలో సాధారణ వర్షపాతం 58.0 మి.మీ. కాగా ఇప్పటివరకు కేవలం 24.4 మి.మీ మాత్రమే నమోదైంది. కురిసిన కాస్త కూడా అడపాదడపా కావడంతో ఎందుకు ఉపయోగపడలేదు. అంతేకాక ఎండల తీవ్రత కూడా అధికంగా ఉంది. రెండు, మూడు రోజులు ముందు వరకు చాలా ప్రాంతాల్లో 38 నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలతోపాటు వేడిగాలులు కూడా వీచాయి.

పంటలపై తీవ్ర ప్రభావం

వాతావరణ సీజన్‌లో చోటుచేసుకున్న మార్పులు జిల్లాలో పంటల సాగుపై తీవ్రంగా చూపిస్తోంది. సాధారణంగా ఈ సమయానికి జిల్లాలో 40వేల హెక్టార్ల వరకు తొలకరి పైర్లు పశుగ్రాస పంటలు సాగు కావాలి. ఈ ఏడాది రోహిణి కార్తెలో కురిసిన వర్షాలతో మరో పదివేల హెక్టార్లలో అదనంగా సాగు కావాల్సి ఉంది. అయితే అనంతరం వచ్చిన మృగశిర, ఆరుద్ర కార్తెలో వర్షం లేకపోవడం, ఎండలు పెరగడంతో ఇప్పటివరకు ఆరువేల హెక్టార్లలో మాత్రమే పంటలు సాగైనట్లు సమాచారం. అందులోనూ వేసవి పత్తి, నువ్వు మాత్రమే ఉండగా ఇతర పైర్ల సాగు లేదు. దుక్కులు దున్నిన రైతులు వానకోసం ఎదురుచూస్తున్నారు.

Updated Date - Jun 26 , 2025 | 11:26 PM